చింటూ కోరిక

చింటూ స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం బడి వదలగానే ఇంటికి వచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కుని, అమ్మ ఇచ్చిన పాలు తాగాడు. బడిలో జరిగిన విషయాలన్నీ అమ్మకి చెప్పాడు. కాసేపు తోటి పిల్లలతో ఆడుకున్నాడు. అప్పుడు చింటూ వాళ్ల అమ్మ ‘చింటూ రేపు నీ పుట్టినరోజు కదా బజారుకు వెళ్లి నీ స్నేహితులకు ఇవ్వడానికి చాక్లెట్లు, బిస్కెట్లు, నీకు కొత్త బట్టలు కొనుక్కుని వద్దాం పద” అంది.
చింటూ మౌనంగా ఉండిపోయాడు. ‘ఏమైంది కన్నా అలా ఉన్నావు?’ అని దగ్గరికి తీసుకుని అడిగింది. ‘అమ్మా! ఈసారి నా పుట్టినరోజుకి బట్టలు, చాక్లెట్లు వద్దు’ అన్నాడు చింటూ. ‘మరేం కావాలి?’ అని అడిగింది అమ్మ చింటూని దగ్గరకి తీసుకుంటూ. ‘రెండు కుండలు కావాలి అమ్మ’ నసుగుతూ అడిగాడు చింటూ.
‘పిల్లలు ఎవరైనా మంచి బట్టలు, ఆడుకునే వస్తువులు, సైకిలు, తినే వస్తువులు అడుగుతారు. నువ్వు కుండలు అడుగుతున్నావు ఏంటి?’ అంది తల్లి. ‘మొన్న మీ పెళ్లిరోజునాడు అనాధాశ్రమానికి వెళ్లి భోజనాలు పెట్టారు. ఎందుకు అలా చేస్తున్నారని నాన్నని అడిగాను. ‘పదిమందికి ఉపయోగపడే పని చెయ్యాలి. ఇతరులకు సేవ చెయ్యాలి’ అని చెప్పారు కదా! ఇప్పుడు నేను కూడా అలాంటి పనే చేయాలనుకుంటున్నాను’ అన్నాడు చింటూ.
‘అయితే ఈ కుండలెందుకు?’ అడిగింది అమ్మ అయోమయంగా ముఖంపెట్టి.
‘రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి కదా అమ్మ. మా తరగతి గది ముందు, పంచాయుతీ ఆఫీసు దగ్గర కుండతో నీళ్లుపెట్టి దాహం తీర్చాలి అనుకుంటున్నాను’ అన్నాడు చింటూ. చింటూకి వచ్చిన గొప్ప ఆలోచనకు పొంగిపోయింది తల్లి. మర్నాడు చింటూ స్కూలుకి కొత్త బట్టలు వేసుకుని రెండు కుండలు పట్టుకుని వెళ్లాడు.
సత్యం మాష్ఠారుకి విషయమంతా వివరించి చెప్పింది చింటూ తల్లి. ‘పిల్లలు తల్లి దండ్రులను అనుకరిస్తారు. ఇతరులకు సేవ చేయాలన్న మీ ఆలోచన చింటూ కూడా ఒంటబట్టించుకున్నాడు. అని తల్లిని మెచ్చుకుని చింటూకి పుట్టినరోజు
శుభాకాంక్షలు చెప్పారు సత్యం మాష్టారు. ఎండాకాలంలో చింటూ ఏర్పాటు చేసిన కుండలో చల్లని నీటిని తాగి ఆనందించడమే కాదు మిగిలిన పిల్లలు కూడా చింటూ బాటలో నడిచారు. పెద్దలు అభినందించారు.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️