కొబ్బరి చెట్టు

Mar 16,2025 19:53 #children stories

నాంచారి పల్లి చెరువు దగ్గర రెండు కొబ్బరి చెట్లు ఉండేవి. ఒకటి చెరువుకు దూరంగా ఉన్నది. నీరందక వంకర టింకరగా పెరిగింది. ఇంకొక చెట్టు చెరువు కట్ట పైన ఉన్నది. చెరువులో నీరందడం వల్ల చక్కగా పెరిగింది. గుత్తులు గుత్తులుగా కొబ్బరి కాయలు కాసేది. ఊరిలోని వారందరూ ఈ చెట్టు దగ్గరకు వచ్చి కాయలు తెంపుకు పోయేవారు. దీంతో దానికి గర్వం పెరిగింది.
ఒకసారి వంకర కొబ్బరి చెట్టుతో ‘చూశావా! వంకరి దానా! నావద్దకే ఊరందరూ వచ్చి కొబ్బరి కాయలు తీసుకొనిపోతున్నారు. నీ వంకర ముఖాన్ని చూడడానికి ఏ ఒక్కరూ ఇష్టపడడం లేదు’ అంది. అప్పుడు వంకర చెట్టు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది.
కొన్ని రోజులకు చెరువు కట్టను వెడల్పు చేయడానికి ఇంజనీర్లు వచ్చారు. కట్ట దగ్గరలో ఉన్న కొబ్బరిచెట్టుని తొలగించాలని అనుకున్నారు. జెసిబి తెచ్చి దాని కొమ్మలు, కాయలు తొలగిస్తున్నారు. అప్పుడు కొబ్బరి చెట్టు ఏడుస్తూ కూర్చొంది. అప్పుడు దూరాన ఉన్న వంకర కొబ్బరి చెట్టు దాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంది. ఉన్నట్లుండి దాని కొమ్మలు అటూఇటూ బలంగా ఊపింది. కిందనున్న మట్టిని విసురుగా పైకి లేపింది. అప్పుడు పొగరుబోతు చెట్టును కొడుతున్న వారిలో ఒకతను అది చూశాడు. మనసులో ఏదో ఆలోచించుకుని అధికారి దగ్గరికి వెళ్లాడు. ‘బాబూ ఇప్పుడు కొడుతున్న ఈ కొబ్బరిచెట్టు మాకు చాలా కాలంగా కాయలు, మట్టలు ఇస్తోంది. ఎంతో ఉపయోగపడింది. దీన్ని ఇక్కడి నుంచి తీసేసినా మళ్లీ చిగురించే ప్రయత్నం చేయండి బాబు’ అని బతిమాలాడాడు.
అధికారులు అందుకు అంగీకరించారు. ఆ కొబ్బరి చెట్టును వేర్లతో సహా పెకిలించారు. దాన్ని వంకర చెట్టుకు దగ్గరలో పాతి పెట్టారు. అది నాటుకునే వరకు నీరు పోశారు. చిగురులు తొడుగుతున్న తన నేస్తాన్ని చూసి వంకర కొబ్బరి చెట్టు ఎంతో సంతోషించింది. అప్పుడు పొగరుబోతు చెట్టు వంకర చెట్టుతో ‘మిత్రమా! నన్ను క్షమించు. నా కళ్ళు తెరిపించావు. ఎవరినీ ఎగతాళి చేయొద్దని తెలుసుకున్నాను. ఇక నుండి మనము స్నేహితులుగా ఉందాం’ అని చెప్పింది. ఆ రోజు నుండి రెండు కొబ్బరిచెట్లు కలిసిమెలిసి పెరిగాయి.

– పెంబర్ల చరణ్‌,
6వ, తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల
బక్రిచెప్యాల,
సిద్ధిపేట జిల్లా.

➡️