సందర్భం ఏదైనా పుస్తకానికి పట్టాభిషేకం!

Apr 19,2024 08:40 #books, #feachers, #jeevana

పుస్తకాలు మాట్లాడవు కానీ, మహాబోధ చేస్తాయి. మనిషి ఎదగటానికి దోహదపడతాయి. అమ్మలా, నాన్నలా, గురువులా, స్నేహితుడిలా నిరంతరం చెంతనే ఉంటూ జ్ఞానాన్నిస్తాయి. కథలు చెబుతాయి. జీవితాన్ని విడమర్చి చూపిస్తాయి. మంచిచెడ్డలను బోధిస్తాయి. ధైర్యాన్నిస్తాయి. దారి చూపిస్తాయి. అలాంటి విలువైన పుస్తకాలకు ఎందరెందరో ప్రతి నిత్యం ప్రత్యేకమైన స్థానమిస్తారు. కొందరు తమ జీవితంలో జరిగే అన్ని సందర్భాల్లోనూ పుస్తకాలకే ప్రథమ గౌరవం ఇస్తారు.

విజయనగరానికి చెందిన చీకటి దివాకర్‌ బాల్యం నుంచి సాహిత్యాభిలాషి. పుస్తక ప్రేమికుడు. తన జీవితాన్ని, ఆలోచనా దృక్పథాన్ని తాను చదివిన పుస్తకాలే తీర్చిదిద్దాయని బలంగా నమ్ముతారు. వృత్తిరీత్యా ఇంజినీరు అయినా, మిగతా సమయం అంతా సాహిత్యంతోనే ఆయన జీవితం ముడిపడి సాగుతోంది. సాహితీ స్రవంతి సంస్థ ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తన బాల్యంలో ఊరి పంచాయతీ కార్యాలయంలో చదివిన పుస్తకాలు ఆయన్ని ఉత్తేజితం చేశాయి. ‘మంచి పుస్తకం ఓ గొప్ప విజ్ఞాన గవాక్షం’ అని తెలుసుకునేలా చేశాయి. పుస్తకాలు కొనటం, చదవడం, వివిధ సందర్భాల్లో బంధుమిత్రులకు ఇవ్వడం ఒక అలవాటుగా మారిపోయింది. ఆయన సహచరి చంద్రికారాణి కూడా అదే బాటలో నడుస్తున్నారు.

ఉద్యోగ విరమణలో కథల కానుక

ఈ ఏడాది మార్చిలో దివాకర్‌ పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేశారు. ఆ సందర్భంగా మిత్రులు అభినందన సభ ఏర్పాటు చేస్తే, దానిని ఓ పుస్తక మహోత్సవంగా మార్చారాయన. నాలుగు తరాల ఉత్తరాంధ్ర కథలతో 456 పేజీల పుస్తకం వేసి, ఆ సభలో ఆవిష్కరింపచేశారు. నిజానికి మహాకవి గురజాడ మొదలుకొని ఇప్పటి వర్తమాన రచయితల వరకూ ఉత్తరాంధ్ర కథలకు ఏర్చి కూర్చి ప్రచురించటం అంటే మామూలు విషయం కాదు. లక్షల రూపాయల ఖర్చుతోనూ, ఏళ్ళ తరబడిన శ్రమతోనూ ముడిపడిన కార్యం. అయినా సరే, ఆ వ్యయప్రయాసలకోర్చి, ఆ కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చారు. ప్రముఖ సాహితీవేత్తలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, చీకటి దివాకర్‌ల సంపాదకత్వాన 63 కథలతో ‘కళింగ కథాజాడ’ పేరిట ఆ గ్రంథాన్ని వెలువరించారు. తన ఉద్యోగ విరమణ కానుకగా తన మిత్రులకు అందించారు.

అమ్మ స్మరణలో ‘పేగుబంధం’

2022 జూన్‌లో తన తల్లి సరోజనమ్మ సంస్మరణార్థం ఇదే విధంగా ‘పేగుబంధం’ పేరుతో ఒక కవితా సంకలనం వెలువరించారు దివాకర్‌. ఎవరి జీవితంలోనైనా తల్లి ప్రేమ, పాత్రా అపారం, అమూల్యం. దివాకర్‌ తన తల్లి జీవితాన్ని స్మరించుకుంటూ, అప్పటికే అనేక మంది కవులు అమ్మ మీద రాసిన అమూల్యమైన కవిత్వాన్ని ఈ పుస్తకంలో చేర్చి, ప్రచురించారు. తల్లి సంస్మరణ రోజున బంధుమిత్రులకు అందించారు. అమ్మ సరోజనమ్మకు దైవభక్తి ఉన్నా అది మూఢభక్తి కాదు. కుమారుడు దివాకర్‌ శాస్త్రీయ ఆలోచనలను అర్థం చేసుకొని, అండగా నిలబడ్డారు. 2013లో దివాకర్‌ కొత్త ఇల్లు నిర్మించుకొని, ప్రవేశం చేసినప్పుడు పూజా కార్యక్రమాలు లేకుండా తన తల్లి చేతనే ఇంట్లో తొలి అడుగు పెట్టించి, ప్రారంభోత్సవం జరిపారు. అప్పటికే భర్త చనిపోయిన సరోజనమ్మ వితంతువుగా ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదని ఒకరిద్దరు బంధువులు అడ్డు చెప్పబోతే, ”ఇంకెవరికీ లేని గౌరవం నా కొడుకు నాకిచ్చాడు. నేను ప్రారంభిస్తాను.” అని ఆమె ముందడుగు వేసిన విషయాన్ని దివాకర్‌ తన మాటలో గుర్తు చేసుకున్నారు. శివారెడ్డి, సినారె, నగముని, దేవీప్రియ మొదలుకొని వర్తమాన కవుల వరకూ అమ్మ గురించి రాసిన వందకు పైగా కవితలతో ‘పేగుబంధం’ పుస్తకం ఎందరినో ఆకట్టుకొంది.

పుస్తకంతో పెళ్లి పిలుపు

దివాకర్‌ – చంద్రికారాణి కుమారుడు రవితేజ వివాహం ఈనెల 18న జరిగింది. ఈ సందర్భం గానూ ఒక పుస్తకం రూపంలోనే వివాహ ఆహ్వాన పత్రాన్ని రూపొందించారు. 168 పేజీలున్న ఈ పుస్తకంలో మహాకవులు గురజాడ, జాషువా, శ్రీశ్రీ, వేమన రాసిన స్మరణీయ కవితలు, పద్యాలూ పొందుపర్చారు. సుపరిచితమైన చైతన్యగీతాలతో పాటు గుండె లోతులకు తాకే ప్రేమైక గీతాలను, వ్యాఖ్యలను జోడించారు. పుస్తకం కవరు పేజీలో వేమన, గురజాడ, జీషువా, శ్రీశ్రీ రేఖాచిత్రాలతో పాటు వధూవరులు వైష్ణవి, రవితేజల ఫొటో ప్రచురించారు. పుస్తకం చివరి అట్టపై ”పెళ్లి పిలుపు” వివరాలు ఇచ్చారు. ”మహాకవుల మాటలు” పేరిట వెలువరించిన ఈ ఆహ్వాన పుస్తకాన్ని చూసి, బంధుమిత్రులు ”ఇది చాలా ప్రయోజనకరమైన పని” అని అభినందిస్తున్నారు.
ఈ పుస్తకానికి ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, ప్రముఖ రచయిత అట్టాడ అప్పల నాయుడు ముందు మాటలు రాశారు. ”సాధారణంగా పెళ్లికానుకగా రకరకాల ఆకర్షణీయమైన సరుకులను ఇవ్వడం ఆనవాయితీ అయిపోయింది. చాలా సందర్భాల్లో ఆ సరుకులు పుచ్చుకున్నవారికి అంతగా ఉపకరించవు. వాటికి ఉపయోగ విలువ కంటే వినిమయ విలువ ఎక్కువ. కానీ, పుస్తకం సరుకూ వస్తువూ కాదు. శాశ్వత ఉపయోగ విలువ గలది. ఇచ్చేవారు ఏ ప్రయోజనం ఆశించి, ఈ పుస్తకం ఇస్తున్నారో- ఆ ప్రయోజనం నూటికి నూరు పాళ్లూ నెరవేరుతుంది.” అని పేర్కొన్నారు.
వివిధ సందర్భాల్లో పుస్తకాలను కానుకగా, జ్ఞాపికగా ఇవ్వడం మంచి వరవడి. దానివల్ల పుస్తకం పుటలు పుటలుగా వర్థిల్లుతుంది. జ్ఞానం పుస్తక మహోత్సవంలా విస్తరిస్తుంది!

– సత్యాజీ

పుస్తకాలు వెలుగు దారులు :  దివాకర్‌ – చంద్రిక

తమ ఇళ్లల్లో జరిగే వివిధ కార్యక్రమాలను పురస్కరించుకొని చాలామంది అతిథులకు జ్ఞాపికలను అందిస్తున్నారు. మేం పుస్తక రూపంలో ఆ జ్ఞాపికను ఇస్తున్నాం. వేమన, గురజాడ, శ్రీశ్రీ, కందుకూరి, జాషువా వంటి మహామహులు రచించిన పుస్తకాలు జీవితానికి వెలుగు దారులను చూపిస్తాయి. వారి మాటలూ, రచనలూ చదివితే మనిషి ప్రతి దశలోనూ ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.

అమూల్య కానుకలు.. పుస్తక జ్ఞాపికలు

తమ ఇంట పదిమందీ చేరే సందర్భాల్లో పుస్తకాలను ప్రత్యేకంగా ముద్రించి, జ్ఞాపికలుగా ఇవ్వడం మన సమాజంలో చాలా కాలంగా అమల్లో ఉంది. వివాహం, గృహప్రవేశం, సంస్మరణం … ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఇలా పుస్తకం ప్రచురించి, పంచారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా తమ కుమారుడి వివాహ సందర్భంగా ‘శరత్‌ జ్యోత్స ్న’ పేరిట పుస్తకం తెచ్చారు. ఎమెస్కో విజరుకుమార్‌ తమ ఇంట జరిగిన వివాహ వేడుకకు అందమైన బొమ్మలతో రూపొందించిన నండూరి ఎంకిపాటలు పుస్తకాన్ని కానుకగా అందించారు. రచయిత కోట పురుషోత్తం తమ కుమారుడు పెళ్లి సందర్భంగా ‘కీర్తి ఆమనిల పెండ్లిపుస్తకం’ వెలువరించారు. విశాఖలో జెవి సత్యనారాయణ మూర్తి తమ ఇంట జరిగిన పెళ్లిలో ‘అనామకుడు’ అనే రష్యన్‌ కథను ఒక పుస్తకంగా వేసి, అతిథులకు అందించారు. కవి బండ్ల మాధవరావు తమ గృహ ప్రవేశ కానుకగా ‘మా వూరు – మా ఇల్లు’ పుస్తకం వెలువరించారు. కవి ప్రసేన్‌ తమ ‘మనవరాలు’ పుట్టినరోజుకు ఓ పుస్తకం తెచ్చారు. శిఖామణి, లలితానంద ప్రసాద్‌ తదితరులు కూడా తమ ఇంట ఉత్సవాల సందర్భంగా పుస్తకాలను ప్రచురించారు. తెలుగు నాట ఇలాంటి సందర్భాలు ఇంకెన్నో ఉన్నాయి. సంస్మరణ సంచికలైతే చాలానే వెలువడుతున్నాయి.

➡️