విమర్శిస్తే దాడులు చేస్తారా?

దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా కనిపించని స్టాండప్‌ కామెడీ ఉత్తరాదిలో ప్రభావంతమైన పాత్రని పోషిస్తోంది. అక్కడ ఈ వ్యంగ్య హాస్యాన్ని చాలామంది సామాజిక అంశాలతో జోడించి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల తీరుతెన్నులను, పాలనా వైఫల్యాలను తమ హాస్యచతురోక్తులతో ఎండగడుతున్నారు. అవేమీ పర్సనల్‌, ప్రైవేట్‌ విషయాలు కాదు.. ఎవరికీ తెలియనివీ కాదు. అందరికీ తెలిసినవి.. చూస్తున్నవి. ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయాలు. అటువంటి వాటిని ఎత్తిచూపే సాహసం చేస్తున్న ఆ కమెడియన్ల చొరవ అభినందనీయం.. కానీ కొంతమంది పెద్దలకు ఆ చతురలు పదునైన బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ వ్యాఖ్యలు గుండెల్లో మంట పుట్టిస్తున్నాయి. అందుకే ఆ కమెడియన్లపై వేధింపులకు దిగుతున్నారు. బెదిరిస్తున్నారు. భయపెడుతున్నారు. అయితే ఆ తాటాకు చప్పుళ్లకు ఏమాత్రం భయపడకుండా తాము ఎంచుకున్న దారిలో ధైర్యంగా ముందుకు నడుస్తున్న ఎందరో స్టాండప్‌ కమెడియన్ల జాబితాలో తాజాగా
కునాల్‌ కమ్రా పేరు వినిపిస్తోంది.

ముంబయిలో ఓ ప్రదర్శనలో పాల్గొన్న కునాల్‌, అక్కడి రాజకీయ పరిస్థితులు, నాయకుల తీరుతెన్నులపై తనదైన వ్యంగ్య హాస్యాన్ని సంధించారు. శివసేన నమ్మినబంటుగా ఉన్న ఏక్‌నాథ్‌ షిండే ఆ పార్టీని చీల్చి శివసేన షిండే పేరుతో కొత్త పార్టీని ఏర్పాటుచేశారు. ఆ తరువాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో షిండేపార్టీ, ఎన్‌సిపి, బిజెపి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. షిండే చూపించిన స్వామిభక్తికి ప్రసన్నులైన బిజెపి పెద్దలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని అతనికి కట్టబెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపైనే కునాల్‌ తన వ్యంగాస్త్రాన్ని సంధించారు. షిండేని ఉద్దేశించి ‘ట్రైయేటర్‌’ (దేశద్రోహి) అని సంబోధించారు.
ఈ వ్యాఖ్యలు షిండే అనుచరులకు, బిజెపి పెద్దలకు గట్టిగా తగిలాయి. ఆ వ్యాఖ్యలకు బదులుగా తాము కూడా వాదనలు చేస్తే చర్చ ఇంతవరకు వచ్చేది కాదు.. కానీ అధికారంలో ఉన్నామన్న అహంకారంతో అనుచరుల పేరుతో రౌడీ మూక రంగంలోకి దిగింది. కునాల్‌ని బెదిరిస్తూ, భయపెడుతూ సోషల్‌మీడియాలో పోస్టులు చేసింది. ప్రదర్శన చేసిన స్టూడియోలోకి అక్రమంగా చొరబడి కనపడిన సామానంతా ధ్వంసం చేసింది. మున్సిపల్‌ అధికారులైతే నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఆ హోటల్‌ని కూల్చేశారు.
ఈ మొత్తం వ్యవహారం చూస్తే కక్ష్య సాధింపు చర్య స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ బెదిరింపు లకు, దౌర్జన్యాలకు కునాల్‌ అదరలేదు, బెదరలేదు.. ఈసారి వ్యంగ్యంగా కాదు.. చాలా ఘాటుగా స్పందించాడు. ‘ఈ దాడులు నాకు కొత్త కాదు.. అయినా నేను ప్రతిఘటిస్తూనే ఉంటాను. నా ప్రదర్శనలు జరగకుండా మీరు ఆపగలరు కానీ, నా మాటల వెనుక ఉన్న సత్యాన్ని మీరు ఆపలేరు’ అంటూ వ్యాఖ్యానించారు. హోటల్‌ ఘటనపై మాట్లాడుతూ ‘సర్వ్‌ చేసిన బటర్‌ చికెన్‌ బాగోలేదని, టమాటాలు తీసుకెళ్తున్న లారీని బోల్తో కొట్టించినంత తెలివితక్కువ పని ఇది’ అని విమర్శించారు.
కునాల్‌కి ఈ దాడులు, బెదిరింపులు కొత్త కాదు. అతను 2013లో స్టాండప్‌ కామెడీ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టినప్పటి నుండీ ఇవి మొద లయ్యాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో తలెత్తిన పరిస్థితులపై కునాల్‌ తన షోలలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లో కూడా బలమైన వ్యంగ్యాస్త్రాలని వినిపించేవారు. అతి జాతీయ వాదం, భారత సైన్యంపై ప్రభుత్వ వైఖరి, నోట్ల రద్దుపై వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై హత్యా బెదిరింపులు వచ్చాయి. ‘రాజకీయ నాయకుల ప్రభావంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమ’ని చెప్పినట్లు అప్పట్లో కునాల్‌ తన ఫేస్‌బుక్‌లో రాశారు.

అర్నబ్‌ గోస్వామి..
2020లో ఇండిగో విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన ఓ ఘటనకి సంబంధించిన వీడియోను కునాల్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. రిపబ్లిక్‌ టీవీ వ్యవస్థాపకుడు అర్నబ్‌ గోస్వామి ఆ వీడియోలో ఉన్నారు. అతన్ని ఉద్దేశించి కునాల్‌ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడ ఓ కోవర్డ్‌ జర్నలిస్టుతో మాట్లాడుతున్నాను. ఇతను నేను ఊహించినట్లు గానే ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు’ అన్నాడు. అది సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే లేపింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 9 నెలల పాటు ఆయన విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. ఎయిర్‌ ఇండియా, స్పేస్‌జెట్‌, గోఎయిర్‌ కూడా ఆ నిషాధాన్ని అమలు చేశాయి.

సల్మాన్‌ ఖాన్‌
డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ దేశంలో నేరం చేసినా నిర్దోషులుగా ఎలా బయటపడతారో ఓ స్టేజి షోలో కునాల్‌ ఉదహరించారు. బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌పై 1998లో కృష్ణజింక కేసు, ఆ తరువాత 2002లో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది. ఇంత పెద్ద కేసుల్లో నిందితుడిగా ఉన్న సల్మాన్‌ని 2015లో బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీనిపైనే కునాల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకి తనపై సల్మాన్‌ పరువునష్టం దావా వేస్తున్నాడని తెలిసినా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని ఆయన కరాఖండిగా చెప్పారు.

సుప్రీంకోర్టు
దేశ అత్యున్నత న్యాయస్థానం ఒకానొక సందర్భంలో ఇస్తున్న ఏకపక్ష తీర్పులపై కూడా కునాల్‌ తనదైన రీతిలో స్పందించారు. ‘దేశంలో ఎక్కడ చూసినా అసహనం పెరుగుతోంది. ఇక్కడ నేరం చేయడం ప్రాథమిక హక్కుగా పరిగణిస్తు న్నారు. ఇది ఎంతలా పెరిగిందంటే చాలామంది నేరాలు చేయడాన్ని తాము ఎంతగానో ఇష్టపడే జాతీయ క్రీడలా చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

విశ్వహిందూపరిషత్‌కి బహిరంగ లేఖ
సామాజిక, రాజకీయ అంశాలపై విమర్శనాస్త్రాలు సంధించే కునాల్‌ 2022 సెప్టెంబరులో విహెచ్‌పికి బహిరంగ లేఖ ఒకటి రాశారు. ‘హిందూ అనుకూల, ఉగ్రవాద వ్యతిరేక సంస్థ అని నిరూపించుకోవాలంటే.. మహాత్మా గాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సేని హంతకుడిగా ప్రకటించాలి. ఆయన్ని వ్యతిరేకించాలి. అలాగే తాను ఎక్కడైనా హిందూ మతాన్ని అగౌరపరిచినట్లు ఉంటే దాన్ని రుజువు చేయాల’ని సవాల్‌ విసిరారు. భజరంగ్‌దళ్‌, విహెచ్‌పి కలిసి గురుగ్రామ్‌లో జరిగే కునాల్‌ షో జరగకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంలో కునాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నేను ప్రభుత్వంపై మాత్రమే వ్యంగ్యం చేస్తాను. మీరు ప్రభుత్వానికి ఇష్టమైన వారా? అయితే బాధపడవచ్చు. ఇందులోకి హిందువు ఎలా వచ్చాడు? దేవునితో నా సంబంధం గురించి మీరు నాకు పరీక్ష పెట్టక్కర్లేదు. నేనే మీకు పరీక్ష పెడుతున్నా. నేను బిగ్గరగా జైశ్రీరామ్‌, జై రాధాకృష్ణా అంటాను. అంతే స్వరంతో మీరు గాడ్సే ముర్దాబాద్‌ అని అరవండి. గాడ్సే మీకు దేవుడు కాదు కదా! తప్పులేదు.. మీరు అలా చేయకపోతే మీరు హిందూ వ్యతిరేకి అని, ఉగ్రవాద అనుకూలురని నేను భావిస్తాను’ అంటూ కునాల్‌ రాసిన బహిరంగ లేఖ ఎందరో ‘దేశభక్తుల’ హృదయాలను భగం చేసింది.
ఇవన్నీ కునాల్‌ తన సొంత ప్రయోజనాల కోసం చేసిన వ్యాఖ్యలు కాదు. దేశ వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నంలో చేసినవి. కునాల్‌ వ్యాఖ్యలు నచ్చకపోతే వాటిపై వాదప్రతివాదనలకు దిగాలి. అంతేకాని దాడులు, బెదిరింపులకు దిగడం ఎంతమాత్రమూ సముచితం కాదు.. తాజా సుప్రీం తీర్పు కూడా ఈ విషయాన్ని స్పష్టపర్చింది.
‘సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్‌ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది? ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు.
ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సి వస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్‌ స్వాతంత్య్రం ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్‌ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’ అని ధర్మాసనం తాజా తీర్పులో స్పష్టం చేసింది.

➡️