మధుమేహమా.. మహిళలూ జాగ్రత్త!

మధుమేహం (డయాబెటిక్‌) ఆడా మగా, పిల్లలు, పెద్దవారు అనే తేడాలేకుండా అందరికీ వస్తోంది. ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం ఎంతైనా మంచిది. వచ్చిన వారు తగ్గించుకోవటానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించాలి. ఏదైమైనా పురుషులతో పోలిస్తే మహిళలు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు. నియంత్రణ విషయంలోనూ పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా కష్టపడాల్సివస్తుంది. నిరంతర పర్యవేక్షణ కూడా చేయాల్సివస్తోంది. ఎందుకంటే మహిళల్లో షుగర్‌ అనేది ఓ జీవనశైలి వ్యాధి మాత్రమే కాదు. దీని కారణంగా ఇతర ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తుంటాయి. గుండె సంబంధిత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. పురుషులతో పోలిస్తే షుగర్‌ కలిగిన మహిళలు నాలుగు రెట్లు గుండె జబ్బులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా కిడ్నీ వ్యాధులు, ఇతర మానసిక సమస్యలు కూడా మధుమేహం ఉన్న మహిళల్లో అధికంగా ఉంటాయనేది పలు అధ్యాయనాల్లో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఈ వ్యాధి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం.

కారణాలేమంటే…

రక్తంలో షుగర్‌ కంట్రోల్‌ లేకపోవటం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌కు శరీరం స్పందించే తత్వం తగ్గిపోతుంది. స్త్రీలలో సెక్స్‌ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇన్సులిన్‌ సెన్సివిటీ కూడా మహిళల్లోనే అధికంగా ఉంటుంది. శరీరంలో శక్తి సమతుల్యత, గ్లూకోజ్‌ మెటబోలిజం స్త్రీ, పురుషుల్లో విభిన్నంగా ఉంటుంది. అందువల్లనే చాలామంది మహిళలు రక్తంలో వచ్చే ఇబ్బందులే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు. సాధారణంగా ఇలాంటి వారికి టైప్‌ 2 డయాబెటిస్‌ అధికంగా వస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారు, అధిక బరువున్నవారు, కుటుంబం లో తల్లిదండ్రులు, లేదా తోబుట్టువులకు షుగర్‌ ఉన్న వారు, గర్భధారణ సమయంలో, అధికంగా కొలెస్ట్రాల్‌, పీసీఓఎస్‌తో బాధపడుతున్న వారు, శారీరకంగా చురుకైన జీవనశైలి లేని వారు ఈ వ్యాధి భారినపడుతుంటారు.

ఇన్ఫెక్షన్ల ముప్పు

100 మందిలో 50 మంది మహిళలు తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి వెజైనా, యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవాల్సివస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవటం, మూత్రాశయంలో మూత్రం పూర్తిగా ఖాళీ కాకపోవటం వల్ల అక్కడ బ్యాక్టీరియా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. వెజైనా దగ్గర ఈస్ట్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఉంది.

పీసీఓడీ, పీసీఓఎస్‌తోనూ సమస్యలే…

మహిళల్లో చాలామంది పీసీఓడీ, పీసీఓఎస్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 40 శాతం మందికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. బీపీ, గుండెజబ్బులు, బ్రెయిన్‌ హెమరేజ్‌, గర్భాశయ క్యాన్సర్‌ వంటి వ్యాధులకు పీసీఓడీతో సంబంధం ఉంది. ప్రపంచంలోనూ, మనదేశంలోనూ ఈ సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ప్రతి నలుగురిలో ఒక అమ్మాయి ఈ సమస్యతో బాధపడుతున్నట్లుగా గణాంకాలు ఉన్నాయి. తొలినాళ్లలోనే దీనిని గుర్తించటం, తినే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవటం, యోగా, స్విమ్మింగ్‌ వంటివి వ్యాయామాలు చేయటం, ఒత్తిడిని తగ్గించుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం ద్వారా ఇలాంటి సమస్యలను నివారించుకోవచ్చు.

రాకుండా ఉండాలంటే…

  • రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో ఉంచుకోవాలి.
  • తగినంత నీటిని తాగాలి
  • కాటన్‌ లో దుస్తులు ధరించాలి
  •  మూత్రాన్ని ఆపుకోకుండా జాగ్రత్తపడాలి

గర్భధారణ సమయంలో…

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు గర్భధారణ కూడా కష్టమే. ఒకవేళ వచ్చినా తొలి నెలల్లోనే గర్భస్రావం కావటం, పుట్టే పిల్లల్లో లోపాలు, ప్రి-మెచ్యూర్‌ డెలీవరీ, శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో డాక్టర్‌ పర్యవేక్షణలో జాగ్రత్తలు పాటించటం ముఖ్యం. సాధారణంగానే మెనోపాజ్‌లో వేడి ఆవిర్లు, మూడ్‌స్వింగ్స్‌, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో సమస్యలు మహిళలను వేధిస్తుంటాయి. మధుమేహం కారణంగా నెలసరి సమస్యలు, కంటిచూపు తగ్గిపోవటం, కిడ్నీ సమస్యలు వంటివి కూడా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి.

ఇబ్బందులు ఇవీ…

  • మూత్ర సంబంధిత ఇబ్బందులు
  •  రుతుక్రమం దెబ్బతినటం
  •  పాలిసిప్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) మధుమేహం లక్షణాలు ప్రతి ముగ్గురిలో ఒకరికి మధుమేహం ఉన్నా తెలియటం లేదు. మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించకపోవటమే దీనికి కారణం. సమస్య పెరిగే కొద్దీ కొన్ని హెచ్చరికలు పొడచూపుతుంటాయి.
  •  అతిగా దాహం వేయటం
  •  నోరు ఎండిపోవటం
  • విపరీతంగా ఆకలి వేయటం
  •  మూత్రం ఎక్కువగా రావటం
  •  అసాధారణ బరువు పెరగటం లేదా తగ్గటం
  •  రక్తంలో గ్లూకోజు పెరిగితే తలనొప్పి, చూపు మసకబారటం, నిస్సత్తువ
  •  తీవ్రమైతే గాయాలు, పుండ్లు త్వరగా మానకపోవటం
  •  తరచూ మూత్రకోశ ఇన్ఫెక్షన్లు గజ్జల్లో దురద పెట్టడం
  •  జననాంగం పొడిబారిపోవటం
  •  లైంగిక కోరికలు తగ్గిపోవటం

ఇవి పాటించటం మేలు

  •  వ్యాయామం చేయటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవాలి.
  •  తాజా పండ్లు, కాయగూరలు ఆహారంలో భాగం చేసుకోవాలి
  •  విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలుండే మొక్కల ఆధారిత ఆహారం మేలు
  •  ఆహారం ఒకేసారి కాకుండా తక్కువమొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలి
  •  చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలు కాకుండా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఓట్‌మీల్‌, తృణధాన్యాలు తినాలి
  •  మంచినీటిని అవసరమైంతస్థాయిలో తీసుకోవాలి.
  •  శీతల పానీయాలను మానేయాలి
  •  పీచు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి

– డాక్టర్‌ కె.వేణుగోపాలరెడ్డి, చైర్మన్‌ విజిఆర్‌ డయాబెటిక్స్‌ ఆసుపత్రి, విజయవాడ.

➡️