సాధారణంగా సీజన్ మారినప్పుడల్లా జ్వరం, దగ్గు, జలుబు వంటి రోగాలు వస్తుంటాయి. గత కొన్ని రోజులుగా అడపా దడపా వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు, తాగునీరు కలుషితం కావటం, ఇతర వైరస్‌లు గాలి ద్వారా వ్యాపించటం, ఈగలు, దోమలు వంటివి సైతం విజృంభిస్తుండటం ఇప్పుడు వ్యాధి కారకాలుగా మారుతున్నాయి. అందువల్ల ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. ఆరోగ్యపరమైన విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ డాక్టర్ల సూచనలు పాటించటం ద్వారా మెరుగైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అతిసార కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అతిసార రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
అతిసార ఎలా వస్తుంది?
సాధారణంగా లూజు లేదా నీళ్ల విరోచనాలు అవటాన్నే అతిసార వ్యాధి (డయేరియా) అని అంటారు. అంతర్లీనంగా ఉండే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రుగ్మతలో భాగమే ఇది. ఎవరికైనా ఒక రోజులో మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీళ్ల విరోచనాలు అయితే దానిని అతిసారగా పిలుస్తుంటారు.
ఏటా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 17 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతుంటారని అంచనా. పోషకాహార లోపంతో ఈ వ్యాధి బారినపడి వీరిలో 13 శాతం మంది మరణిస్తున్నట్లుగా సమాచారం. సామాన్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా, పరాన్న జీవుల వల్ల వ్యాధి తీవ్రస్థాయికి కూడా చేరే ప్రమాదం ఉంటుంది. కలుషిత నీటిని తాగటం, ఆహారాలను సరిగ్గా వండకపోవటం వల్ల అతిసార వ్యాధిని కల్గించే ఇన్ఫెక్షన్లు సోకుతాయి. వీటితోపాటు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవటం, వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో నీరు తగ్గిపోవటం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవటం వల్ల కూడా అతిసార తీవ్రత ముదిరే ప్రమాదం ఉంటుంది. సకాలంలో డాక్టరును సంప్రదిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది. లేకపోతే రోగి ఆరోగ్యం బాగా క్షీణించి ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశాలుంటాయి. రెండురోజులకు మించి తగ్గకపోయినా, బాగా నీరసం అనిపించినా, పొత్తి కడుపులో నొప్పిగా ఉన్నా మలం నల్లగా లేదా రక్తంతో కూడి ఉన్నా, జ్వరం 102 డిగ్రీల జ్వరం ఉన్నా ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఓఆర్‌ఎస్, జింక్, ప్రోబయాటిక్స్ వంటి వాటితోపాటుగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించటం ద్వారా అతిసార లక్షణాలను త్వరగా తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో రాకుండా కూడా నివారించుకోవచ్చు. చిన్న పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ వేయటం ద్వారా రాకుండా చేయొచ్చు.
అప్రమత్తంగా ఉండటం మేలు
అతిసార సీజనల్‌గా వచ్చే వ్యాధే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ దీని బారినపడుతుంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మంచి జీవన శైలిని అలవర్చుకోవటం, వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అతిసార మొదలైనప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
మూడు రోజులు దాటితే కాస్త ఇబ్బందికరం. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాధి సోకిన వెంటనే సంబంధిత డాక్టరును సంప్రదించి వైద్య చికిత్సలు పొందితే త్వరగా నయం అవుతుంది. పరిశుభ్రత పాటించటం, పౌష్టికాహారం తీసుకోవటం, శారీరక శ్రమను పెంచు కోవటం కూడా ఆరోగ్యానికి దోహద పడుతుంది.
ఇవీ, లక్షణాలు
- బాగా దప్పిక అవుతుండటం
- బరువు తగ్గిపోవటం
- జ్వరం వచ్చిన లక్షణాలు
- కడుపులో వికారం
- పొత్తికడుపు పిండేసినట్లుగా ఉండటం
- కడుపులో నొప్పి, పొత్తి కడుపు ఉబ్బటం
- ఆకస్మిక మలవిసర్జనలు
తీవ్రమైతే కనబడే లక్షణాలు
- మలములో రక్తం కనిపించటం
- వదలకుండా వాంతులవ్వటం
- బాగా నీరసం, లేవలేని పరిస్థితి
ఈ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి!
- మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవాలి.
- వంట చేసే ముందు, చేసిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి.
- డైపర్స్ మార్చిన తర్వాత చేతులను కడుక్కోవాలి
- కాచి చల్లార్చిన నీటినే తాగాలి
- పిల్లలకు వారి వయస్సుకు తగిన విధంగా ఆహారాన్ని ఇవ్వాలి.
- ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
- ఆరు నెలల వరకూ పిల్లలకు తల్లిపాలనే తప్పనిసరిగా ఇవ్వాలి.
- పాచిపోయిన, కలుషితమైన ఆహార పదార్థాలను తినరాదు
- నిల్వవుంచే జ్యూసులు, పానీయాలు, ఐస్‌లు తినకపోవటమే మంచిది
- అన్ పాస్చ్యురైజ్డ్ పాలు తాగొద్దు
- వీధుల వెంట విక్రయించే ఆహార పదార్థాల జోలికెళ్లొద్దు
- నిల్వవుంచిన మాంసం తినొద్దు
- ఆల్కాహాలు వంటివి సేవించొద్దు
- మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి
- ఆరునెలల తర్వాత పిల్లలకు పోషక విలువలు (కాంప్లిమెంటరీ ఫీడ్) కలిగిన ఆహారాన్నే ఇవ్వాలి.
డాక్టర్ జాడి సాయి శిశిర్, ఎంబిబిఎస్, డిసిహెచ్, డిఎన్‌బి,
చిన్నపిల్లల వైద్య నిపుణులు,
గిద్దలూరు, ప్రకాశం జిల్లా. సెల్ : 9573971929