గాడిద బద్దకం

Apr 22,2025 00:07 #children stories

ఒక ఊరిలో ఓ రైతు పొలం పనులకు గాడిదని ఉపయోగించేవాడు. పొలం దున్నడం, కుప్ప నూర్చడం, పొలం నుండి పంట కళ్లానికి చేర్చడం, ధాన్యం బస్తాలు ఇంటికి చేర్చడం వంటి పనులు అన్నీ ఆ గాడిదతోనే చేయించేవాడు. గాడిదకు తిన్నంత ఆహారం పెట్టేవాడు. దాన్ని ఒక జంతువులా కాకుండా తన ఇంటి సొంత మనిషిలా చూసు కునేవాడు. కాని ఆ గాడిదకు ఒక చెడ్డ అలవాటుంది. దానికి బద్ధకం ఎక్కువ. పని చేయడానికి ఇష్ట పడేదికాదు. ఒక్కోసారి పని తప్పించుకోవటానికి అనారోగ్యంలా నటించేది. రైతుతో సేవలు చేయించుకునేది.
ఇలా బాగా బద్ధకానికి అలవాటు పడిన గాడిద, రైతు నుండి ఏ మాత్రం పనిలేని చోటుకి వెళ్లిపోవాలనుకునేది. తగిన సమయం కోసం ఎదురు చూసేది. ఒక రోజు రైతు పొలంలోకి రాజు గారి గుర్రం ఒకటి మేత మేయడానికి వచ్చింది. ‘ఆ గుర్రంతో రాజు గారి గుర్రంశాలకు నేను కూడా చేరుకుంటే భలే ఉంటుంది. అక్కడ ఎక్కువ గుర్రాలు ఉంటాయి. అన్ని గుర్రాల మధ్య పని తేలికగా తప్పించుకోవచ్చు. ఆకారంలో నేను కూడా గుర్రం లాగే ఉంటాను కదా!’ అనుకుంది.
గుర్రంతో మాటలు కలిపింది. ‘ఇక్కడ పని ఎక్కువ. ఆహారం అసలు పెట్టడం లేదు. రైతు సరిగా చూసుకోవడం లేదు’ అని అబద్దాలు చెప్పి ఏడ్చింది. గుర్రం ‘సరే’ అంది. సాయంత్రం గుర్రం లాగే తయారై రాజుగారి గుర్రం శాలకు చేరుకుంది. అక్కడా దాంతో గాడిద చాకిరీ చేయించారు. పైగా రైతు దగ్గర ఉన్నంత స్వేచ్ఛ ఆ గుర్రంశాలలో గాడిదకి దొరకలేదు. పైగా కొట్టి మరీ పరుగులు పెట్టిస్తున్నారు. ఆయాసంతో దానికి నీరసం వచ్చేసేది.
ఒక రోజు ఆ గుర్రాలశాల నుండి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంది. కాపరి వచ్చినప్పుడు ఓండ్రించింది. అంతే కాపరి దాన్ని గుర్రాలశాల నుండి తరిమికొట్టాడు. బతుకుజీవుడా అనుకుంటూ గాడిద రైతు పొలం వైపు పరుగు లంకించుకుంది. ఆ రోజు నుండి రైతు చెప్పిన పనులు బుద్ధిగా చేసింది. తప్పిపోయిన తన గాడిద తిరిగి వచ్చినందుకు రైతు కూడా చాలా సంతో షించాడు.

– రాళ్లబండి సంగంనాయుడు,
జరజాపుపేట, విజయనగరం,
94909 35258.

➡️