కోశాధికారి ఎంపిక

May 17,2024 02:30 #chinnari, #feachers, #jeevana, #katha

అవంతి రాజ్యాన్ని గుణనిధి పరిపాలిస్తుండేవాడు. ఒకసారి రాజ్యంలోని కోశాధికారి ఎంపికకు పోటీ నిర్వహించారు. పలువురిని పరిశీలించగా చివరిగా గణిత శాస్త్ర నిపుణులైన స్వర్ణలత అనే యువతి, రంగనాధం అనే యువకుడు మిగిలారు. వారిద్దరిలో ఒకరికే పదవి వరిస్తుంది. అప్పుడు రాజు గారు ఓ పరీక్ష పెట్టారు.
‘మీ ఇరువురికి నేను రెండు ప్రశ్నలు వేస్తాను. వాటికి తగిన సమాధానం చెప్పిన వారే కోశాధికారి పదవికి ఎంపిక అవుతారు’ అన్నారు. ‘రాజ్యంలో పేద ప్రజలపై భారం పడకుండా, పన్ను వసూలు చేసే మార్గం చెప్పండి’ అని మొదటి ప్రశ్న వేశారు.
‘ప్రజల్లో ధనిక, మధ్య తరగతి, పేదరికం విభజన జరిపిన పిదప తగిన విధంగా పన్నులు విధించవచ్చు’ అన్నాడు రంగనాధం. ‘స్వర్ణలత ఈ విషయం పైన నీ అభిప్రాయం చెప్పు’ అని అడిగాడు రాజు.
‘రాజ్యంలోని పొలిమేరల రహదారులపై ప్రయాణించే వాహనదారులపై పన్నులు వేయవచ్చు. గుర్రాలపైన, పల్లకీలో, ఎడ్లబండ్లపై సరుకులు తీసుకువెళ్లే వ్యాపారులు తరచూ పొలిమేరలు దాటుతూ ఉంటారు. పేదవారికి ఎటువంటి వాహనాలూ ఉండవు కనుక వారిపై పన్ను భారం పడదు’ అని చెప్పింది స్వర్ణలత. ఈ సారి రాజు మరో ప్రశ్న వేశాడు.
‘రంగనాధా, తాళపత్రం పైన ఉన్న ఆరు అనే సంఖ్యను ఎటువంటి మార్పులు చేయకుండా దాని సంఖ్యా బలం పెంచాలి ఎలా?’ అని అడిగారు. రంగనాధం ఆలోచిస్తూ ఉండిపోయాడు. అప్పుడు స్వర్ణలత ఆ తాళపత్రాన్ని తీసుకుని తలకిందులుగా తిప్పి చూపించింది. ‘రాజా! ఇది మీ చేతిలో ఆరుగా కనిపిస్తే, నా చేతిలో తలకిందులుగా మారడంతో తొమ్మిదిగా మారింది’ అన్నది.
తన ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలిపిన స్వర్ణలతను కోశాధికారి పదవికి ఎంపిక చేసినట్లు రాజు ప్రకటించాడు. సభలోని వారంతా కరతాళ ధ్వనులు చేశారు.

– బెల్లంకొండ నాగేశ్వరరావు, చెన్నయ్.

➡️