ప్రకృతిలో ఏ జీవి కూడా కారణం లేకుండా మరొక జీవిపై దాడి చేయదు. క్రూర మృగాలు కూడా ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే వెంటాడతాయి. ఆకలి లేనప్పుడు పక్కనుంచి పోతున్న చిన్న చిన్న జంతువులను కూడా ఏమీ చేయవు. కానీ మెదడు బాగా అభివృద్ధి చెందిన, జ్ఞానం పొందిన మనిషి మాత్రం కేవలం తన స్వార్థం కోసం, తాత్కాలిక సంతోషం కోసం ఎంతటి హింసకైనా సిద్ధంగా ఉంటాడు, ఎదుటి వారి ప్రాణాలు అంతే అవలీలగా తీయగలడు. వీటికి రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలు కూడా కలిస్తే హింస మరింత ఎక్కువవుతుంది.
ఒక్కోసారి అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం, అత్యాచారం, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల వంటివి జరిగినప్పుడు షాక్‌కి గురై మనసు కొంతసేపు మొద్దుబారిపోతుంది. కొంతమంది వెంటనే జరుగుతున్నది తెలుసుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు మహిళపై పురుషుడు చేసే దాడుల నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు. ఒక్కోసారి ఆ షాక్ నుంచి బయటకు రావడానికి కొన్ని వారాలు, నెలలు కూడా పట్టొచ్చు. గాయాల వల్ల అసలు మామూలు స్థితికి రాలేకపోవడం, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.
ప్రపంచం అభివృద్ధి వైపు దూసుకుపోతున్న నేటి హైటెక్ యుగంలో మహిళగా జీవితంలో ప్రతి దశలోనూ ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటోంది. ఐక్య రాజ్య సమితికి చెందిన రెండు సంస్థలు రోజుకు సగటున 140 మంది బాలికలు, మహిళలు బంధువులు లేదా భర్త చేతుల్లో మరణిస్తున్నారని; 2023లో 51 వేల 300 మంది మరణానికి తమ కుటుంబ సభ్యులే కారణమని చెప్పింది. కాలంతో పాటే మహిళపై హింస కూడా పెరుగుతుంది. దీనికి కుటుంబంతో పాటు సమాజం, రాజ్యం కూడా కారణమే అవుతుంది.
మహిళలు ఎదుర్కొనే హింసలో లైంగికదాడి మరింత ప్రమాదకరమైనది. ఎక్కువగా భర్త లేదా సన్నిహిత భాగస్వామి, తెలిసిన వారే ప్రధాన నిందితులుగా ఉంటారు. వీటివల్ల బాధితురాలు మానసికంగా, శారీరకంగా దీర్ఘకాలంపాటు ఆరోగ్య సమస్యలను భరించాల్సి వస్తుంది. దాడికి గురైన ఆమె ఒక్కతే కాదు; పిల్లలు, కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న సమాజం కూడా భరించాలి. ఆమె వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటుంది. పని శ్రద్ధగా చేయలేని అశక్తత వల్ల ఉపాధి పోయి ఒక్కోసారి కుటుంబం రోడ్డున పడుతుంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం … జనాభాలోని ప్రతి ముగ్గురు 15- 49 ఏళ్ళ వయసు మహిళల్లో ఒకరు అంటే 33 శాతం మంది ఏదో ఒక రకంగా లైంగిక హింసకు గురవుతున్నారు. ఈ దారుణాల్లో 40 శాతం బాగా తెలిసిన వాళ్ళ వల్ల జరుగుతున్నాయి. ప్రతి మహిళా తన జీవితంలో ఒక్కసారైనా ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురయ్యే ఉంటుంది. మన అనుకున్న వారితోనే ప్రమాదం అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జష్ట్రఱశ్రీస Abబరవ Aష్ కింద లైంగికత గురించి ఏ మాత్రం అవగాహన, గ్రహింపు లేని వయసు వారితో, వారి సమ్మతి లేకుండా అత్యాచారం చేయడం నేరం. ూశీషరశీ చట్టం 18 ఏళ్ళ లోపు వయసున్న పిల్లల శరీర భాగాలను తాకటం, లైంగిక చర్యను సూచించే మాటలు, సైగలు, అశ్లీల చిత్రాలు చూపించడం వంటివి నేరం. ఈ చట్టాలేవీ నెలల పసికందులపై జరిగే అత్యాచారాలను ఆపలేకపోతున్నాయి. ఒక సర్వే ప్రకారం 50 శాతం కన్నా ఎక్కువ మంది పిల్లలు మానసిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దారుణం తర్వాత అయినా చాలామంది తల్లితండ్రులు రిపోర్టు చేయడానికి కూడా రావడం లేరు. కుటుంబ పరువు, మర్యాద పోతుందని వారి భయం.
లైంగిక దాడిలో బాధితురాలికి గాయాలవుతాయి. నిర్భయ, హత్రాస్, కథువా, ఆర్‌జి కార్‌లో డాక్టర్‌పై అత్యాచారాలు గురించి విన్నప్పుడు అంత దారుణంగా మనిషి అనేవాడు ప్రవర్తిస్తారా అనే అనుమానం వస్తుంది. దాదాపు అన్ని అవయవాలను ప్రమాదకరంగా గాయపరచడం, ఎముకలు విరిచేయడం వంటి అమానుషాలను ఈ సంఘటనల్లో చేశారు. అటువంటి దాడిలో బాధితులు బతికే అవకాశం తక్కువే. ఒక అమ్మాయి జీవితాన్ని అర్ధంతరంగా ముగించే అధికారం వాళ్ళకు ఎవరు ఇచ్చారు ?
మనదేశంలో అప్రకటిత రాజ్యాంగంగా చెలామణి అవుతున్న మనుస్మ ృతి బోధించిన పురుషాధిక్య భావజాలం, స్త్రీని బానిసగా చూసే మనస్తత్వం మహిళను ఇలాగే ఉండాలంటుంది. ఈ లైంగిక దాడులకు అసాంఘిక వ్యక్తిత్వం, మద్యం డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు, నిందితులకు అండగా నిలబడే నీచ రాజకీయ నాయకులు, కామాంధులను కాపాడే నేటి న్యాయ వ్యవస్థ … అన్నీ కారణాలే! స్త్రీని లైంగిక వస్తువుగా చూసినంత కాలం ఈ హింస తగ్గదు.
లైంగిక హింసకు గురైన మహిళలు గాయాల వల్ల బ్లీడింగ్, కడుపునొప్పి వంటి తీవ్ర సమస్యలు కాకుండా దీర్ఘకాలిక శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమస్యలు, ఒకవేళ గర్భిణి అయితే అబార్షన్ కావడం, కడుపులోని శిశువు ఎదగడంలో లోపాలు, బరువు తక్కువ బిడ్డలు పుట్టడం, కావల్సిన సమయం కన్నా ముందే డెలివరీ కావడం, లేదా బిడ్డ చనిపోయి పుట్టడం వంటివి జరుగుతాయి. కుటుంబ సభ్యులతో గొడవలు, ఒత్తిడి, మైగ్రేన్ తలనొప్పి, నిద్రలేమి, ఆకలి లేకపోవడం డిప్రెషన్, హత్య లేదా ఆత్మ హత్యా ప్రయత్నం కూడా చేస్తారు. HIV , ఇంకా ఇతర లైంగిక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
పసిపిల్లలు లైంగిక దాడికి గురైతే, తమపై ఆ దాడి జరిగిందనే అవగాహన కూడా వారికి ఉండదు. నొప్పి అని ఏడవడం, సరిగా తినకపోవడం వల్ల పోషకాహార లోపాలు, తగినంత పెరుగుదల లేకపోవడం, చదువులో వెనక పడడం వంటివి బయటికి కనిపిస్తాయి. అసహజ ప్రవర్తన, కారణం లేని కోపం, వత్తిడి, ఇంట్లో, బడిలో కూడా స్నేహితులతో కలవలేకపోవడం, అందరితో గొడవలు పెట్టుకోవడం వంటి లక్షణాలు కూడా కనపడొచ్చు. నిద్రలో భయపడడం, ఏడవడం వంటివి చూసినప్పుడు తల్లితండ్రులు ఓపికగా కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పెద్దపిల్లలు అయితే అసాధారణ లైంగిక ప్రవర్తన, చెడు అలవాట్లవైపు వెళ్ళడం, హింసకు దారి తీసే పనులు చేస్తారు. ఎవరో చేసిన తప్పును పసి బిడ్డలు, కుటుంబ సభ్యులు, సమాజం కూడా భరించ వలసి ఉంటుంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో కన్నా మహిళను దేవతగా పూజించాలని చెప్పే మనదేశంలో మహిళలపై హింస, మరణాల శాతం చాలా ఎక్కువ. కట్టుబాట్లు, సాంప్రదాయం, మగవారికి ఎదురు చెప్పకూడదనే భావజాలం… ఎంత చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నా మహిళలకైనా తప్పడం లేదు. మహిళాభివృద్ధి, సమానత్వం, సాధికారత అని నాయకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇవి చాటి చెబుతున్నాయి. కుటుంబంలో మహిళకు ప్రత్యేక గౌరవం అవసరం లేదు సాటి మనిషిగా చూసుకుంటే చాలు. ఎవరు లైంగిక వేధింపులకు గురైనా సమస్యను అర్థం చేసుకోవడం, వారిపట్ల సానుభూతి చూపడం, కనీస మద్దతు తెలియచేయడం నాగరికులుగా మన కనీస బాధ్యత.
డాక్టర్ సిహెచ్.శారద
సెల్ : 9966430378.