సుందరమను అడవి యుండె
అందు కోతి ఒక్కటుండె
దాని బిడ్డ మర్కటమును
గారాబము చేయుచుండె
ఎవరు చెప్పిననూ వినదు
దానికి అసలే తోచదు
అది జంతువులన్నింటిని
అల్లరి పెట్టుట మానదు
ఆ అడవిలో ఎలుగు ఉండె
తన దారిన పోవుచుండె
ఆయుర్వేదపు మొక్కలు
దాని చేతులలో నుండె
మర్కటమ్ము దాన్ని గనెను
ఆ మొక్కల లాగుకొనెను
వెంటనె వాటిని అది ఒక
బురదగుంటలో వేసెను
తల్లి ఎంతొ బాధ పడెను
ఎలుగును మన్నించమనెను
అతి గారాబం వద్దని
ఎలుగుయు దానికి చెప్పెను
తల్లి కోతి ముఖము కనెను
ఎలుగు ఓపికను పట్టెను
కానీ ఆ మర్కటమ్ము
చెడు బుద్ధి మారదయ్యెను
అదియు ఒంటరిగా వచ్చె
గ్రామమందు ఇంట చొచ్చె
వస్తువులను దొంగిలించి
దాని చేతి లోన తెచ్చె
ఇంటి వారు అది చూసిరి
కర్రతో దాని కొట్టిరి
గాయములతో అది రాగ
దాని వెంట బడె ఒక కరి
మర్కటమ్ము పరిగెత్తెను
తల్లి వద్దకది చేరెను
తల్లి దాన్ని ఎలుగు కడకు
వెంట తీసుకొని వెళ్లెను
ఎలుగు దాన్ని మందలించి
మందు లేదని బెదిరించి
కట్టు కట్టె పసరు పూసి
తల్లి బాధ పడుట గాంచి
”చూశావా, పిల్ల కోతి
మొక్కలను తోడ్పడు రీతి
లాక్కొని అవి పారవేయ
నీకు లేదు నీతి భీతి
మర్కటమా! కొంటె పనులు
నీవు చేయకున్న చాలు
మీ అమ్మయు కోరుకొనే
నీ భవితకు అదే మేలు”
ఆ మాటలు మనసు చేరి
దానిలోన మార్పు తెచ్చె
తల్లి ఎంతొ సంత సిల్ల
అది ఇంటికి మరలి వచ్చె!
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
99085 54535.