మళ్లీ బడికి ఉత్సాహంగా …

Jun 12,2024 04:05 #Jeevana Stories

వేసవి సెలవుల తర్వాత పిల్లల్ని మళ్లీ స్కూళ్లకు ఎలా అలవాటు చేయాలా? అని హైరానా పడుతున్నారా? వేసవి కాలమంతా పిల్లలు ఇంట్లోనే ఉంటూ అమ్మమ్మలు, నానమ్మలు, స్నేహితులతో హాయిగా గడిపేశారు. ఇప్పుడు వేసవి సెలవులు ముగిసి, మళ్లీ బడికి వెళ్లే సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇంతకాలం బాగా ఎంజారు చేసిన పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఇప్పుడు ఒక్కసారిగా బడికి వెళ్లాలంటే కొంత ఇబ్బంది పడొచ్చు. ఇన్నాళ్లూ ఆలస్యంగా నిద్ర లేవడం, ఇంట్లో ఆడుకోవడం, నచ్చినవి తినడం చేసుంటారు. ఇలా అలవాటు పడిన పిల్లలను, ముఖ్యంగా చిన్న తరగతుల పిల్లలను పాఠశాలకు పంపే ఈ సమయంలోనే పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారిని ముందు మానసికంగా సంసిద్ధులను చేయాలి. పాఠశాలకు వెళ్లే విధంగా వారిని ప్రోత్సహించాలి. కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగు, కొత్త లంచ్‌ బాక్సు వంటి సన్నాహాలతో ఉత్సాహపడేలా చేయాలి.
నిపుణుల సూచనలు
పిల్లలు చక్కగా బడికి అలవాటవ్వాలంటే తల్లిదండ్రులు కొన్ని పద్ధతులు పాటించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలు బడికి అలవాటు అవ్వాలంటే ముందుగా టైం సెట్‌ చేయాలి. నిద్ర లేవడం, రెడీ అవ్వడం, ఆడుకోవడం, హోంవర్క్‌ చేయడం, కుటుంబ సభ్యుల కోసం కాస్త సమయం.. ఇలా వాళ్లు చేసే కార్యకలాపాలన్నింటికీ సమయం కేటాయిస్తూ ఒక నెల రోజుల పాటు టైం టేబుల్‌ సెట్‌ చేయాలి. స్కూలు నుంచి రాగానే ఆ రోజు ఏం చెప్పారు? హోం వర్కు చేయాల్సింది ఉందా? అనే విషయాలను అడిగి తెలుసుకోవాలి. చిన్న చిన్న గణిత ప్రక్రియలు చేయించడం, కథలు చదివించడం, దినపత్రికలు చదివించడం చేయాలి. పిల్లలకు కఠినంగా ఉండే అంశాల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో సహాయ సహాకారాలు అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పి ఒత్తిడి లేకుండా చూడాలి.
ఎంపిక చేసుకోనివ్వాలి : మీ పిల్లలకు అవసరమైన పాఠశాల సామగ్రి, పుస్తకాలు, బూట్లు, యూనిఫారాల జాబితాను ముందుగానే రూపొందించుకోవాలి. పిల్లలను షాపింగ్‌కు తీసుకుని వెళ్లి అవసరమైనవి, అనుగుణమైనవి వారినే సెలెక్ట్‌ చేసుకోనివ్వాలి.
చదువే కాదు మిగిలినవీ ముఖ్యమే : ఖాళీ సమయాల్లో వారేం చేయాలనుకుంటున్నారో ముందుగా వారినే అడగాలి. వారి అభిరుచులు, ఆసక్తులను తెలుసుకోవాలి. వారికి ఏయే అంశాల్లో నైపుణ్యం ఉందో అవగాహన చేసుకోవాలి. ఆటలు, పాటలు, డాన్సులు, చిత్రలేఖనం, ఏమైనా సంగీత వాయిద్యాలు వాయించడాన్ని ఇష్టపడితే ఆయా అంశాల్లో సమయాన్ని బట్టి శిక్షణను ఏర్పాటు చేస్తే వారిలో మానసికోల్లాసం కలుగుతుంది.
పౌష్టికాహారం చాలా ముఖ్యం : అధిక ప్రోటీన్‌ కలిగిన అల్పాహారం ఇచ్చి పిల్లలను బడికి పంపాలి. అది వారి శారీరక, మానసిక బలాన్ని మరింత బలపరుస్తుంది. వారు ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చేందుకు ప్రిఫర్‌ చేయాలి. మంచినీరు ఎక్కువ తాగేలా ప్రోత్సహించాలి. కొత్త విద్యా సంవత్సరానికి పిల్లలను అలవాటు చేయడం కాస్త కష్టమే అయినప్పటికీ.. పైన చెప్పినవన్నీ ఫాలో అయితే త్వరగా అలవాటు పడిపోతారు. అలాగే స్కూళ్లో వారు సాధించిన విజయాలను సెలబ్రేట్‌ చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది.
ఈ జాగ్రత్తలు కూడా కీలకమే!
– ఇన్నాళ్ళు పిల్లలు ఫోన్‌కు అలవాటు పడిపోయి ఉన్నారు. స్కూలు నుంచి రాగానే ఫోన్‌ కోసం పట్టుబడతారు. అయితే ముందుగా హోంవర్క్‌, చదవాల్సిన సబ్జెక్ట్‌లను పూర్తి చేయాలని చెప్పాలి.
– ఫోన్‌ను ఎక్కువ సేపు వాడనివ్వకుండా చూడాలి.
– హోంవర్క్‌ పూర్తయిన తరువాత ఎక్కువ సమయం ఆటలకు కేటాయించేలా ప్రోత్సహించాలి. దగ్గర్లోని పార్కులు లేదా ఆటస్థలాలకు తీసుకెళ్లి ఆడించాలి.
– పిల్లలు రాత్రిళ్లు త్వరగా నిద్రపోయే విధంగా చూడాలి.
– వేకువ జామునే నిద్ర లేచి, తొందరగా కాలకృత్యాలు పూర్తి చేసేలా చూడాలి.

– పాలడుగుల శివ నాగ రాజారావు,
తెలుగు ఉపాధ్యాయులు,
జెడ్పీ ఉన్నత పాఠశాల, మీర్జాపురం, ఏలూరు జిల్లా.

➡️