ధనుష్‌కి భౌతిక శాస్త్రం అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేవాడు. తనకి సైంటిస్ట్ కావాలని కోరిక. ఆ ఆలోచనను భౌతిక శాస్త్రం బోధించే రేవంత్ సార్ గుర్తించారు. ఖాళీ సమయం దొరికితే చాలు ల్యాబ్‌లోకి వెళ్ళి సైన్స్ పరికరాలను గమనించేవాడు. ధనుష్ ఆసక్తిని గమనించిన రేవంత్ సార్ అనుక్షణం ప్రోత్సహించేవారు.
ఒక రోజు ల్యాబ్‌లో రేవంత్ సార్, పిల్లలు కలిసి ప్రయోగం చేస్తుండగా ఒక్కసారిగా ల్యాబ్‌లో మంటలు వచ్చాయి. విద్యార్థులు అందరూ భయపడ్డారు. బయటికి వెళదాం అనుకుంటే డోర్ దగ్గరికి కూడా మంటలు వ్యాపించాయి. అందరూ కంగారు పడుతున్నారు. ఎటు వెళ్ళినా అటు వైపు మంటలు వస్తున్నాయి. ధనుష్ వెంటనే కుర్చీ తీసుకుని పక్కనే ఉన్న గ్లాస్ కిటికీని పగల కొట్టాడు.
కిటికీ ద్వారా ఒకరి వెంట ఒకరు అందరూ బయటకు వచ్చారు. తర్వాత నీళ్లతో మంటలు ఆర్పేసారు. తెలియని విషయం కనుగొనడమే ప్రయోగం కాదు, అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరించడం కూడా ప్రయోగం అని అందరూ ధనుష్‌ను మెచ్చుకున్నారు.
– కొంపల్లి విశిష్ట,
పదవ తరగతి,
జెడ్‌పిహెచ్‌ఎస్, జక్కాపూర్,
సిద్దిపేట జిల్లా.