కటిక చీకటి ఆవరించిన చోట చిన్న చిరుదివ్వె కూడా గొప్ప వెలుగును ఇస్తుంది. కాంతిని మరింత కాంతివంతం చేస్తుంది. చీకటిని మరింత చిన్నబుచ్చుకునేట్టు చేస్తుంది. చీకటి వెలుగుల సమ్మేళనం మానవ జీవితానికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ. పోల్చి చూసుకుంటే ఒక అద్భుత పాఠం. మరి ఇలాంటి సందర్భాన్ని పేలుళ్లతో, విష వాయువులతో ఎందుకు నింపేయడం? కమ్మని కాంతుల మధ్య ప్రశాంతంగా జరుపుకుంటే సరిపోదా?
చీకటి చుట్టుముట్టటం మామూలే! చిన్న ప్రయత్నం చెయ్యి. ఏఏ వస్తువులను ఒక చోటకు చేర్చాలో వాటిని సమకూర్చు. ఆలంబనగా నిలవటానికి ఓ మట్టి ప్రమిద, ఇంధనంగా ఉపయోగపడటానికి కొద్ది చమురు, దాని ఆధారంగా మండటానికి ఒక పత్తి వొత్తి, ఈ వొత్తిని ప్రజ్వలింపచేయటానికి ఓ వెలుగు రవ్వ … ఈ నాలుగింటి సమాహారమే తిమిరాన్ని చెదరగొట్టే వెలుగు దీపం! సమకూర్చటం, సమన్వయపర్చటం, సమయానుకూలంగా సద్వినియోగం చేయడం .. ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం. జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఒక ముందడుగు వేయాలన్నా ఇలాంటి ఒక సన్నాహం అవసరమవుతుంది. ఎప్పుడు ఎలాంటి విపత్తు విరుచుకుపడినా ఇలాంటి ప్రయత్నం ఒకటి చేయాల్సి ఉంటుంది. చీకటి శాశ్వతం కాదు; వెలుగూ నిత్యం కాదు. ఒకదాని వెంట ఒకటి వస్తాయి. పోతాయి. వచ్చిన దానిని వచ్చినట్టు తొలుత ఒప్పుకోవాలి. దానిని తట్టుకోవటానికి సిద్ధం కావాలి. తగ్గించుకోవటానికి, తొలగించుకోవటానికి కచ్చితంగా ప్రయత్నించాలి. ఇదే దీపావళి వంటి పర్వదినాలు ఇచ్చే విలువైన సందేశం.
ఆడంబరం హానికరం!
ప్రపంచంలో ఎవరు ఏ ప్రాంతంలో నివసించినా, ఎలాంటి స్థితిలో ఉన్నా – మన కష్టసుఖాలకు మూలం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే, పరిసరాల్లోనే ఉంటుంది. మన సుఖజీవనం కోసం, ఆనందం కోసం, అవసరాలకోసం ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకుంటాం. మనకు అనువుగా వాడుకుంటాం. తరతరాలుగా ఇలా చేసే మనం మనుగడ సాగిస్తున్నాం. తెలివిగా వాడుకునే వేదికగా, ప్రయోగశాలగా ప్రకృతిని మార్చేశాం. ఇస్తున్న దానిని తెచ్చుకొని వాడుకోవటం ఒక దశ. ఇవ్వని దానిని సైతం గుంజుకొని తెచ్చుకోవటం మరొక దశ. మనం సరదాల కోసం ప్రకృతి సూత్రాలకు భిన్నంగా పర్యావరణానికి హాని కలిగించటం ఇంకొక దశ. ఈ మూడు దశలూ మూడు రకాల మానవ స్వభావాలకు నిదర్శనం. మొదటి దశ అవసరమైతే, రెండో దశ స్వార్ధం, మూడోది వివేచన లేని విధ్వంసం! అలాంటి విధ్వంసానికి చేజేతులా పూనుకోకండి అంటున్నారు పర్యావరణ వాదులు. దీపావళి సమయంలో ప్రతి ఏటా ఈ చర్చ ముందుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే- దీపావళి రోజున కొన్ని కోట్ల టన్నుల రసాయన పేలుడు చెత్త మన వీధుల నిండా పేరుకుపోతుంది కాబట్టి! అనేక రకాల హానికర రసాయనాలు మనం పీల్చే గాలినిండా ఆవరిస్తాయి కాబట్టి! పరిమితికి మించిన ధ్వని కాలుష్యంతో మన చెవులు దద్దరిల్లి పోతాయి కాబట్టి!
ఈ సమస్యలు మనలో ప్రతి ఒక్కరికీ అనుభవమే! కాబట్టి పర్యావరణ హితమైన ప్రశాంత దీపావళిని జరుపుకోవాలని మనలో చాలామంది ఆకాంక్ష. ఆ దిశగా ప్రచారం, చైతన్యం, ఆచరణ కూడా సాగుతోంది. కొన్ని పర్యావరణ సంస్థలు, జనవిజ్ఞాన వేదిక, పాఠశాలలు … ఈ విషయంలో ప్రచారం చేస్తున్నాయి. నెమ్మదిగా మంచి ఫలితాలు కూడా మొదలయ్యాయి. కోర్టులు కూడా జోక్యం చేసుకొని- ఫలానా సమయంలో, కొద్ది పరిమితిలోనే టపాసులు కాల్చండి అని నిబంధనలు విధిస్తున్నాయి. ఈ ప్రయత్నమంతా మన కోసం.. మన ఆరోగ్యం కోసం.. పర్యావరణ హితం కోసం. కానీ, కొంతమంది ఈ ప్రయత్నాలను తప్పు పడుతున్నారు. ఇది మనుషులకు సంబంధించిన వ్యవహారంగా కాక మతానికి సంబంధించిన వ్యవహారంగా రచ్చ చేస్తున్నారు. విచ్చలవిడిగా మందుగుండు సామగ్రి కాల్చటం అనేది ఏ మతాన్నయినా ఎలా ఉద్ధరిస్తుంది? ఏ మనిషి ఆరోగ్యానికైనా ఎలా ఉపయోగపడుతుంది? ఇది రెచ్చగొట్టుడు వ్యవహారం తప్ప మరొకటి కాదు.
హడావిడి లేకుండా ఆనాటి పండగ
నిజానికి 30, 40 ఏళ్ల క్రితం దాకా దీపావళిని ఎలా జరుపుకునేవాళ్లం? దీపావళి అంటే దీపాల పండగ కదా? ఈ పేలుళ్లూ, హడావిడులూ ఎప్పుడు ప్రవేశించాయి? ఏది సాంప్రదాయం? ఏది కాదు? ఈ పరిశీలనలోకి వెళ్లినా అసలు నిజం మనకు తెలుస్తుంది. మట్టి ప్రమిదల్లో చమురు పోసి వత్తిని వెలిగించే ప్రశాంత పండగ కదా, దీపావళి అంటే ..! గోగు చెట్లకు వొత్తులు వెలిగించి ‘దివ్వీ దివ్వీ దీపావళి ..’ అని నేలన కొట్టటం కదా, ఆమాస సందడి అంటే ..! అలాంటి సాధారణమైన సండగ స్థానే శబ్ద, వాయు కాలుష్యాన్ని పెంచే హడావిడికీ, ఆడంబ రానికి, అధిక వ్యయానికి వంత పాడడం తప్పు. పర్యావరణ వాదులే కాదు, పండగ పరమార్థం తెలిసిన వారు సైతం హంగా మాను సమర్థించరు. మందుగుండు సామగ్రిని పేలిస్తే వచ్చే పొగ వల్ల, శబ్దాల వల్ల అప్పటికే పెచ్చు పెరిగిన క్రిమికీటకాలూ, దోమలూ చచ్చిపోతాయని, అది ప్రజలకు మేలు చేస్తుందని చేసే చచ్చు వాదన కూడా అర్థం లేనిది.
పండగ అంటే ఓ ఆనంద సందర్భం. ఇంటిల్లిపాదీ సంతోషం. ఊరు ఊరంతా వెల్లి విరిసే ఉత్సాహం. ఏ పండగైనా జనం మనుసుల లోంచి వెల్లువలా రావాలి. కేలండర్లోని తేదీల నుంచి కాదు. దైనందిన జీవన వ్యయం హెచ్చి హెచ్చి, పెట్రో ధరలు పెచ్చు పెరిగి, సిలిండరు ధర తారాజువ్వలా ఎగసి ఎగసి, నిత్యావసరాల ధరల మోత ఎప్పటికప్పుడు లక్ష్మీబాంబుల్లా పేలుతూ ఉంటే- సామాన్యుల జీవితాలకు మళ్లీ మందుగుండు సామగ్రి పేలుళ్ల మోత మళ్లీ అంత అవసరమా? ఇంట్లోని పిల్లలూ పెద్దలూ కలిసి ఆనందంగా గడిపే ప్రశాంత తరుణాల సందర్భమే దీపావళి. అలా మతాబుల్లా నవ్వులు రువ్వుతూ కాకర పువ్వొత్తుల్లా కాంతులు చిమ్ముతూ అందరూ పండగను జరుపుకోవాలని ఆశిద్దాం!
– శాంతిమిత్ర