మెదడుకు మేత

Apr 25,2025 02:15 #feachers, #jeevana

‘తాతయ్యా ‘మెదడుకు మేత’ అంటే ఏంటో చెప్పవా?’ అని అడిగాడు జున్ను బాబు. ‘మనం పనిచేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం (మేత) ద్వారా లభిస్తుంది. అలాగే మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే పొడుపు కథలు విప్పాలి, తమాషా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, ప్రహేళికలకు జవాబులు ఆలోచించాలి. ఇవే మెదడుకు మేత’ అని చెప్పాడు తాతయ్య.
‘సరే అయితే నాకో పొడుపు కథ చెప్పు. జవాబు చెప్తాను’ అన్నాడు జున్ను బాబు.
‘పూర్వం పిఠాపురంలో భోగేసు, లచ్చిమి దంపతులు నివసిస్తూ ఉండేవారు. భోగేసు ప్రతి రోజూ దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి పిట్టలను వేటాడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. ఒకరోజు లచ్చిమి భర్త దగ్గరకు వెళ్ళి ‘పిఠాపురం చిన్నోడా, పిట్టల వేటగాడా, బతికిన పిట్టను కొట్టా వద్దు, చచ్చిన పిట్టను తేనూ వద్దు, కూరకు లేకుండా రానూ వద్దు’ అని చెప్పింది.
భార్య చెప్పిన మాటలు భోగేసుకు అర్థం కాలేదు. బతికిన పిట్టలను కొట్టకూడదు. చచ్చిన పిట్టలను తేకూడదు అనుకుంటూ అడవిబాట పట్టాడు. దారిలో ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. అతడికి విషయమంతా చెప్పి పరిష్కారం చూపమని ప్రాధేయపడ్డాడు.
పెద్ద మనిషి ఆలోచించి అతడి భార్య చెప్పిన దాని ప్రకారం… కూరకి ఏమి తీసుకు వెళ్ళాలో చెప్పాడు. అతడికి కృతజ్ఞతలు తెలిపి భోగేసు అడవికి వెళ్ళాడు. కావలసినవి సేకరించి భార్యకి ఇచ్చి కూర చెయ్యమని చెప్పాడు.
‘ఇంతకూ భోగేసు భార్యకు ఏమి ఇచ్చాడో చెప్పు’ అని అడిగాడు తాతయ్య జున్ను బాబుని.
‘వెదురు కొమ్ములు తాతయ్య’ అన్నాడు జున్ను బాబు. ‘కాదు’. ‘దుంపలు తాతయ్య’. ‘కాదు’. ‘మాంసం తాతయ్య’. ‘కాదు’. ‘పక్షి గుడ్లు తాతయ్యా’.
‘నీ బుర్రకి పని చెప్పావు. సరిగ్గా జవాబు చెప్పావు మనవడా!’ అన్నాడు తాతయ్య.
‘భలే భలే.. మెదడుకు మేతను వేశా. పొడుపు కథని విప్పేసా అని పాడుకుంటూ స్నేహితుల దగ్గరికి పరుగు తీశాడు జున్ను బాబు.

– కాశీ విశ్వనాధం పట్రాయుడు,
94945 24445.

➡️