విజయనగరం పైడితల్లమ్మవారి పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. దీనికి అనుబంధంగా నిర్వహిస్తున్న విజయనగర ఉత్సవాలు కూడా గ్రామీణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడతాయి. సాంస్కృతిక రాజధానిగా, కళలకు కాణాచిగా, విద్యల నగరంగా ఘనతికెక్కిన ఈ నగరం భిన్న సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించబోయే పైడితల్లమ్మవారి జాతరకు నగరం ముస్తాబవుతోంది. 13,14 తేదీల్లో జరగబోయే ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇటు ఉత్సవాలు, అటు పైడితల్లమ్మవారి పండగ భిన్నత్వంలో ఏకత్వంలా విభిన్న జాతులు, కులాల వారిని ఐక్యం చేస్తుందనడంలో సందేహం లేదు. శతాబ్ధాల క్రితం నుంచి నిర్వహిస్తున్న ఈ పండగ వెనుక ప్రజల విశ్వాసం, సంప్రదాయాలు దాగివున్నాయి. అన్ని మతాలు, సామాజిక వర్గాలు కలగలిసి జరుపుకునే పండగ ఇది. అందుకే ఏటా లక్షల మంది జనం భాగస్వామ్య మౌతున్నారు. ఈ ఏడాది అందుకు తగ్గట్టే అధికారులు అంచనా వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు.
సమాజంలో ప్రతి పండగ వెనుకా ఒక విజయం లేదా ఒక నిర్మాణాత్మక సందేశం ఉన్నట్టే పైడితలమ్మ పండగకు కూడా వ్యవసాయం, శాంతియుత వాతావరణం అనే ప్రత్యేకతలు ఉన్నాయి. నేడు లక్షలాది మంది అభిమానం చూరగొంటున్న ఈ జాతరకు, బొబ్బిలి యుద్ధానికి సంబంధం ఉందని నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. 17వ శతాబ్ధంలో విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. యుద్ధాలు జరుగుతున్నప్పుడల్లా వందలాదిగా జననష్టం జరిగేది. రక్తపాతానికి దూరంగా ఉండాలని విజయనగర పూసపాటి రాజవంశీయులకి వారి ఆడపడుచు అప్పలకొండమాంబ హితబోధ చేసేవారట. అయితే విజయనగర సంస్థానాధీసుడైన విజయరామ గజపతిరాజు వినిపించుకోలేదు. 1757లో అప్పటి బ్రిటీష్ పాలనాధికారి బుస్సీతో చేతులు కలిపి దొడ్డిదారిలో బొబ్బిలి రాజులను ఓడించినట్టు చరిత్ర చెబుతోంది. భవిష్యత్తు పరిణామాల పట్ల ఆందోళన చెందిన అప్పలకొండమాంబ మంచంపట్టి తనువు చాలించారట. యుద్ధకాలంలో శాంతియుత వాతావరణం కోసం ప్రయత్నించిన ఆమె (పైడితలమ్మ)పేరిట, విజయనగరం, బొబ్బిలి ప్రాంత ప్రజల్లో నెలకొన్ని వైషమ్యాలను పారద్రోలి, ఒక్కతాటి పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో 1758నుంచి ఏటా విజయదశమి వెళ్లిన మరుసటి మంగళవారం పైడితల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు.
నెల రోజుల ముందు నుంచే పండగ హడావుడి
దసరా వెళ్లిన మరుసటి మంగళవారమే సిరిమానోత్సవం నిర్వహిస్తుంటారు. లక్షలాదిగా హాజరయ్యే సిరిమానోత్సవానికి నెల రోజులు ముందుగానే పందిరి రాటతో పండగ హడావుడి ప్రారంభమౌతుంది. సిరిమానోత్సవానికి ముందు రోజు తొలేళ్ల ఉత్సవం, అక్కడి నుంచి వారం రోజుల తరువాత జరిపే తెప్పోత్సవం పండగలో ముఖ్యమైన ఘట్టాలు. ఉయ్యాల కంబాలు కార్యకార్యక్రమంతో పండగ ముగుస్తుంది. పైడితల్లి ఆలయంలో సమర్పించిన వ్యవసాయ విత్తనాలను తొలేళ్ల ఉత్సవంలో భాగంగా కోట వద్దకు తెచ్చి పంచడం, వాటిని స్వీకరించేందుకు రైతులు పోటీ పడడం వంటి సన్నివేశాలు గ్రామీణ సంస్కృతికి అద్దం పడతాయి. ఉత్సవాల ప్రారంభానికి పది రోజుల ముందునుంచే పట్టణంలో పండగ శోభ సంతరించుకుంటుంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పైడితల్లమ్మ ఆలయాలు, అలనాటి కోట, గంటస్తంభం, సంగీత, సాహిత్య కేంద్రాలు విద్యుత్ అలంకరణతో ప్రత్యేకత సంతరించుకుంటుంది. పండక్కి రెండు రోజుల ముందు నుంచే ఇళ్లల్లో వంటకాల ఘమఘమలు నోరూరిస్తాయి. ఇళ్లల్లో ఆడపడుచుల హడావుడి మొదలవుతుంది. అమ్మవారికి ఘటాలను అర్పిస్తారు. పూర్వం నుంచి ఆలయ అనువంశిక ధర్మరక్తలైన పూసపాటి వంశీయులు ఉత్సవంలో తప్పనిసరిగా భాగస్వామవుతారు. గత ఏడాది నుంచీ రాష్ట్రీయపండగగా గుర్తించడంతో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
సిరిమానోత్సవంలో విశేషాలెన్నో..
పైడితల్లమ్మవారి పండగలో సిరిమానోత్సవం తలమానికంగా నిలుస్తుంది. సుమారు 40 అడుగుల ఎత్తుగల సిరిమాను పీఠికపై అమ్మవారి ఆలయ అనువంశిక పూజారి అవరోధిస్తారు. ఆలయం నుంచి సమీపంలో వున్న విజయనగరం కోటగుమ్మానికి ముమ్మాటు తిరుగుతుంది. దీన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు రాష్ట్ర నలుమూల నుంచీ, ఒడిశా నుంచి లక్షలాది మంది తరలివస్తుంటారు. అనేక జానపద కళారూపాలు సందర్శకులను కనువిందు చేస్తాయి. డప్పువాయిద్యం, ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచూర్యం పొందిన పులివేషాలు, చిత్ర, విచిత్ర వేషధారణలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. కేవలం సిరిమాను తిరిగే కోట, పైడితలమ్మ ఆలయం మధ్యనే కాకుండా వీధివీధినా ఇటువంటి కళారూపాలు కనువిందు చేస్తాయి.
ఉత్సవాల ప్రారంభం నుంచీ ముగిసేవరకూ వరకు అనేక సామాజిక తరగతుల శ్రమ ఇందులో ఇమిడి ఉంటుంది. సిరిమాను గుర్తించింది మొదలు దాన్ని సంప్రదాయ పూజలతో తెగ్గొట్టడం, పూజారి ఇంటికి తరలించడం, అక్కడ ఉత్సవానికి అనుగుణంగా రూపొందించడం వరకు విశ్వబ్రాహ్మణులు, వేదపండితులు, రజకులు వంటి అనేక కులవృత్తులవారి శ్రమ ఉంటుంది. పాలకపార్టీలు మతోన్మాదుల కనుసన్నల్లో నడుచుకుంటున్న ఈ నేపథ్యంలో సమైఖ్యతను, శాంతియుత వాతావరణాన్ని గుర్తుచేసే పైడితల్లమ్మ పండగ, ఇందులో ఇమిడి ఉన్న కళలు, సంస్కృతి, సంప్రదాయాలే రక్షణగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఈ ఏడాది పెదతాడివాడ ప్రాంతంలోని చింతచెట్టును సిరిమానుగా గుర్తించారు.
ముస్తాబైన విజయనగరం
సుమారు 265 ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న విజయనగరం పైడితల్లమ్మ పండగ వివిధ కళాప్రదర్శనలతో కళకళలాడుతోంది. పండగవేళ పట్టణమంతా శోభాయమానంగా మారింది. పూర్వం రైతాంగం మాత్రమే నిర్వహించుకునే ఈ పండగ కాలక్రమేణ వృత్తిదారులు, వ్యాపారులు ఇలా అన్ని తరగతులవారినీ భాగస్వామ్యం చేసింది. చివరకు కులమతాలకతీతంగా మారింది.
జాతరకు అనుబంధంగా విజయనగరం ఉత్సవాలు
సిరిమానోత్సవానికి అనుబంధంగా ఈనెల 13, 14వ తేదీల్లో విజయనగరం-2024 ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు జిల్లా చరిత్రతోపాటు వినోదం, విజ్ఞానం, క్రీడా సూర్ఫిని నింపనున్నాయి. భిన్న మతాల సమ్మేళనం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ ఏడాది ఆనందగజపతి ఆడిటోరియం, గురజాడ కళా భారతి, కోట, సంస్కృత కళాశాల, అయోధ్యమైదానం వేదికలుగా కళాకారులు, క్రీడాకారులు, సాహితీ ప్రియులు అలరించనున్నారు. కవి సమ్మేళనాలు, అవధానాలతో ఆలోచింపజేయనున్నారు.
– కె.రమేష్‌నాయుడు
స్టాఫ్‌రిపోర్టర్, విజయనగరం