మూర్ఖులు బలిగొన్నారు… మనుషులు కాపాడారు …!

అందాల కాశ్మీర్‌ పచ్చిక బయళ్ల మధ్య రక్తం చిందింది. తోడుని కోల్పోయిన నవవధువులు, తండ్రులని కోల్పోయిన పసిబిడ్డలు, భర్తలను కోల్పోయిన భార్యల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఇంత మారణహోమం జరిగిన వేళ, దేశంలో రెండు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఉగ్రదాడిని చూసి, ఒక కన్ను కన్నీరు కారుస్తోంది. మరో కన్ను ఈ దాడికి మతం రంగు పులిమి, విపరీతాలకు పాల్పడుతున్న వారిని చూసి ఆందోళనతో ఎరుపెక్కుతోంది. దాడి జరిగిన క్షణం నుండి ఈ ఘాతుకానికి తెగబడ్డ వ్యక్తులు హిందువులని లక్ష్యం చేసుకున్నారన్న వార్తలతో మీడియా హోరెత్తిపోయింది. బిజెపి పెద్దలైతే ఒకడుగు ముందుకేసి ఈ మొత్తం ఉగ్రదాడిని హిందూ-ముస్లిం మధ్య వైరిగా చిత్రీకరించేశారు. తీవ్రవాదానికి మతం రంగు పులుముతున్న ఈ పాలకులు దాడి చేయొద్దని ఆగంతకులకు ఎదురొడ్డి ప్రాణాలొదిన హార్స్‌ రైడర్‌ సయ్యద్‌ అదిల్‌ హుస్సేన్‌ మృతిని మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఈ దాడిని నిరసిస్తూ మరణించిన హిందూ సోదరులకు సంఘీభావంగా కాశ్మీర్‌ వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీలు చేసిన ముస్లిం కుటుంబాల వార్తలు కూడా ఎక్కడా చూపించడం లేదు.

అందాల కాశ్మీర్‌ చుట్టూ ఇప్పుడు విద్వేష వాదప్రతివాదాలు మిన్నంటుతున్నాయి. వాస్తవానికి దేశ పర్యాటక రంగంలో కాశ్మీర్‌ది ప్రత్యేకస్థానం. అక్కడ ఎంతోమంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పర్యాటకుల రాక వారికి పెద్ద పండుగని తెచ్చి పెడుతుంది. ఇంట్లో ఖర్చులకు, పిల్లల బట్టలకు, కడుపునిండా తినడానికి అవసరమైన డబ్బులు వాళ్ల వల్లే వస్తాయి. అలాంటి వారికి కాశ్మీరీలు వినమ్రంగా సేవలు చేస్తారు. భాషాభేదాలు, కులమతాల పట్టింపులు లేకుండా ప్రేమలు కురిపిస్తారు. కాశ్మీర్‌కి వచ్చినప్పటి నుంచి తిరిగివెళ్లేదాకా అతిథులకు లోటు లేకుండా సేవలు చేయడంలో పోటీలు పడతారు. అంతటి ప్రేమాభిమానాలు చూపించే ఆ కాశ్మీరీలు ఇప్పుడు ఒక్కసారిగా యావత్‌ దేశానికి శత్రువులుగా మారిపోయేలా చేస్తున్నారు. మతం పేరుతో ఆ అమాయకులను ఇంతలా వేధించడం వెనుక నిలువెల్లా విషం నిండిన పాముల్లాంటి వ్యక్తులు ఇప్పుడు దేశమంతా ఆక్రమించేస్తున్నారు.

దాడిలో హతుడైన అదిల్‌ మృతదేహం ఇంటికి చేరడానికి కొన్ని గంటల ముందు అక్కడి వాతావరణం ఎలా ఉందో పరిశీలిస్తే, పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కాశ్మీరీల జీవన దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి.
హపాంతార్‌ గ్రామం నుంచి అదిల్‌ రోజు కూలీ చేసేందుకు పహల్గామ్‌కి వెళ్తాడు. అక్కడ పర్యాటకులను బైసరన్‌ క్యాంపుకి చేర్చే హార్స్‌ రైడర్‌గా పనిచేస్తాడు. రోజంతా పనిచేస్తే అతనికి వచ్చే కూలీ కేవలం రూ.300 నుంచి 400 మాత్రమే! తల్లిదండ్రులు, భార్య, ఐదుగురు తోడబుట్టిన వాళ్ల బాధ్యత ఉన్న ఇంటి పెద్ద కొడుకు అదిల్‌. ఇప్పుడు అతని మరణం ఆ ఇంటిని దిక్కులేనిది చేసింది.
‘నా కొడుకు ఎప్పటిలాగే పని నుండి ఇంటికి తిరిగి వస్తాడనుకున్నాం. కానీ ఇలా జరిగింది. ఇప్పుడు మాకు దిక్కెవరు? అంటూ అదిల్‌ తల్లీదండ్రీ రోదిస్తున్న తీరు చుట్టుపక్కల చేరిన జనాల్ని కూడా కన్నీరు కార్చేలా చేసింది.

అదిల్‌తో పాటు కోటి ఆశలతో ఆ ఇంటికి వచ్చిన అతని భార్య (కొత్త కోడలు)ని ఓదార్చడం అక్కడున్న వారి తరం కావడం లేదు. అదిల్‌ మృతదేహం ఇంకొన్ని నిమిషాల్లో అక్కడికి చేరుకుంటుంది అనగానే అక్కడున్న వారి మౌనంతో ఆ ప్రాంతంలో నిశ్శబ్దం తాండవించింది. అదిల్‌కి మద్దతుగా ఓ ముస్లిం పెద్దావిడ ‘మా అదిల్‌తో పాటు మరణించిన మిగిలిన హిందూ బిడ్డలందరికీ మా సంతాపం తెలుపుతున్నాం’ అనగానే అక్కడ గుమిగూడిన ముస్లిం కుటుంబాలన్నీ ఒక్కసారిగా ఆమెతో గొంతు కలిపారు. ఏడుస్తున్న అదిల్‌ కుటుంబం కూడా వారితో స్వరం కలిపింది. ఎందుకంటే మరణించే ముందు అదిల్‌ కూడా తన పర్యాటకులను కాల్చి చంపొద్దని ఉగ్రవాదులతో మొరపెట్టుకున్నాడు. ‘ఇది తప్ప’ని వారించాడు.
ఇది కదా అసలు భారతదేశం.

సుహృద్భావానికి, సౌభ్రాతృత్వానికి ఇదే సంకేతం!

ఇలాంటి ఉదంతాలు ఇప్పుడు అక్కడ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. దాడి సమయంలో నాలుగు హిందూ కుటుంబాలని రక్షించేందుకు ఓ ముస్లిం వ్యక్తి ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. అరవింద అగర్వాల్‌ అనే అతడు తన సోషల్‌ మీడియాలో ఇలా రాశాడు : ‘నీ ప్రాణాలను అడ్డం పెట్టి మా ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు నజఖత్‌ భాయ్. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను’.
అరవింద్‌ తనకు సాయం చేసిన వ్యక్తిలో మతం చూడలేదు. మానవత్వాన్ని చూశాడు. నజఖత్‌ రక్షించిన వారిలో అరవింద్‌తో పాటు శివాంశ్‌ జైన్‌, హ్యాపీ వధావన్‌, కుల్దీప్‌ స్థాపక్‌ ఉన్నారు. వారంతా ‘నజకత్‌ వల్లే మేము ప్రాణాలతో బయడపడ్డాం’ అని ముక్తకంఠంతో ప్రశంసించారు. బైసరన్‌ లోయకి చేరుకునేందుకు కొంతమంది పర్యాటకులు హార్స్‌ రైడింగ్‌ని ఉపయోగిస్తే, మరికొంతమంది ముస్లిం గైడ్‌ల వీపులపై ప్రయాణిస్తూ పర్యాటక ప్రదేశానికి చేరుకోవడం అక్కడ చూస్తాం.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక మహిళ ఆ వీడియోలో ఇలా చెబుతోంది : ‘నీవు హిందువువా ముస్లింవా అని అడిగి హిందువులను చంపారు’ అని ప్రచారం జరుగుతూ ఉండడం విచారకరం. అది ఏమాత్రం వాస్తవం కాదు. నేను ఈ రోజు ఉదయమే కాశ్మీర్‌ నుండి వచ్చాను. దాడి జరిగిన రోజు నా వెంట ఉన్న ముస్లిం డ్రైవర్‌ ‘నువ్వు భయపడకు చెల్లీ, మా ప్రాణాలు అడ్డుపెట్టి నిన్ను రక్షిస్తాం’ అని నాకు భరోసా ఇచ్చాడు. కాశ్మీర్‌లో ముస్లింల వల్ల హిందువులకు ప్రమాదం లేదు, అలాగే హిందువుల వల్ల ముస్లింలకు ప్రమాదం లేదు. పర్యాటకులకు ఇక్కడ హిందువులు, ముస్లింలు అండగా ఉన్నారు. ప్రజలలోని ఈ మానవత్వం, ఈ సంఘీభావం కలకాలం ఉంటుందని నమ్ముతున్నాను’ అని ఆమె మీడియా ముందు ప్రకటించింది.

ఉగ్రవాద సంఘటన జరిగినప్పటి నుంచి టూరిస్టులను ఎయిర్‌ పోర్ట్‌కూ బస్‌ స్టాండుకూ ఉచితంగా తరలిస్తున్న ఆటో వాలాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నారు. ఈ ఉదంతం గురించి వారు ఏం అంటున్నారంటే, ‘కాశ్మీర్‌కి వచ్చే పర్యాటకుల వల్లే మేము బతుకుతున్నాం. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం మా పని. మాలో చాలామంది పర్యాటకుల కోసం ఆటోలు, వ్యానులు నడుపుతారు. వారి కోసమే ఇక్కడ అంగళ్లు కొలువుదీరతాయి. ఈ ఉగ్రదాడి ఇప్పుడు మా కడుపు కొట్టింది’ అంటున్న వారి మాటల్లో కాశ్మీరీల జీవనభృతికి ఉగ్ర ఘాతుకం వల్ల ఎంత తీవ్ర నష్టం వాటిల్లిందో తెలుస్తుంది.

terror attack

ఉన్మాదం తలకెక్కిన వాళ్లు ఏ మతంలో ఉన్నా ప్రమాదమే! వాళ్లు దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. మృతులకు సంతాపాన్ని, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలపాల్సిన వేళ .. వాళ్లు ఉన్మత్త వ్యాఖ్యలతో మనుషులను విభజించే కుట్రకు పాల్పడుతున్నారు. మానవత్వంతో కూడిన స్పందనే వారికి సమాధానం!

➡️