కులమతాలు లేని సమాజం కోసం…

Jan 16,2025 05:58 #feacherse, #Jeevana Stories, #secular

”ఇద్దరు మనుషులు కలిసి జీవించటానికి కులమతాలతో సంబంధం లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ఇష్టం ఉంటే చాలు. అలాంటి భావాలు ఉన్న అవివాహిత యువతీ యువకులకు స్వాగతం!” అంటోంది ఆ మాట్రిమోని వెబ్‌సైట్‌. అయితే, వివాహం సెక్యులర్‌ రిజిస్టర్‌ పద్ధతిలోనే చేసుకుంటామన్న నిబంధన పాటించాల్సి ఉంటుంది. ‘పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి. కులపోళ్లే కావాలి. వాళ్ల కుటుంబాల్లో ఎక్కడా అన్యమతం మారిన దాఖలాలు ఉండకూడదు’ వంటి ఆంక్షల మధ్య కులం, మతం ఊసు లేకుండా సెక్యులర్‌ పద్ధతిలో పెళ్లి సంబంధాలు చూసే ఈ వెబ్‌సైట్‌ ఎలా నడుస్తోందో చూద్దాం.

‘సెక్యులర్‌ మాట్రిమోనీ’ పేరుతో నడుస్తోన్న ఈ వెబ్‌సైట్‌కి మలయాళం ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ వెబ్‌సైట్‌ ఇటీవల ఇన్‌స్టా పేజీలో పోస్టు చేసిన ఓ పోస్టు బాగా పాపులర్‌ అయ్యింది. ’40 ఏళ్ల క్రితం మా కుటుంబం కులం, మతం సంబంధం లేకుండా సెక్యులర్‌గా జీవిస్తోంది. నా జీవిత భాగస్వామి వ్యక్తిగతంగా ఏ మతానికి చెందినవారైనా పర్వాలేదు. నాతో, నా కుటుంబంతో మా భావాలతో ఏకీభవిస్తూ జీవిస్తే చాలు’ అని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ యువకుడు నింపిన ప్రొఫైల్‌ కాలమ్‌ వివరాలు ఆ పోస్టు సారాంశం.

వివాహ వ్యవస్థలో ఒకే కులం, ఒకే మతం పేరుతో పెద్ద వ్యవస్థ నడుస్తోంది. కులాంతర, మతాంతర వివాహాలకు అందులో చోటు చాలా తక్కువ. ఇలాంటి సమూహాల్లో ‘సెక్యులర్‌ మ్యాట్రిమోనీ’ నడపడం ఆషామాషీ కాదు. అయితే కేరళ లాంటి ప్రొగ్రేసివ్‌ రాష్ట్రంలో ఇది కాస్తంత సులువు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తోంది 35 ఏళ్ల మను మనుష్యజాతి అనే యువకుడు. తన వెబ్‌సైట్‌ నిర్వహణ గురించి అతని మాటల్లోనే తెలుసుకుందాం.

‘ఈ మ్యాట్రిమోనీ ద్వారా కులం, మతం లేని వ్యక్తులంతా ఏకమవుతున్నారు. 90 శాతం వివాహాలు సెక్యులర్‌ పద్ధతిలోనే జరిగాయి. నేను కూడా ఈ వెబ్‌సైట్‌ ద్వారానే నా భాగస్వామి శివలీలని కలుసుకున్నాను. 38 ఏళ్ల అప్జల్‌ తన పార్టనర్‌ రష్నాని కూడా ఇక్కడే కలిశాడు. ముస్లిం కుటుంబానికి చెందిన అతడు తన సెక్యులర్‌ భావాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసుకున్నప్పుడు చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎన్నో సైద్ధాంతిక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వాటిన్నింటితో విసుగుచెందిన అప్జల్‌ని మా వెబ్‌సైట్‌ విపరీతంగా ఆకర్షించింది. అమ్మాయి మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రులు కూడా సెక్యులర్‌ భావాలు కలిగివుండాలన్న అతని ఆలోచనకు రష్నా సరిగ్గా సరిపోయింది’ అని మను తన వెబ్‌సైట్‌ సక్సెస్‌ స్టోరీని చెబుతున్నారు.

అప్జల్‌ స్టోరీనే మన దేశంలో మొదటిది కాదు, చివరిదీ కాదు. 2011,-12 హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సర్వే ప్రకారం దేశంలో పది శాతం కుటుంబాల్లో కులాంతర వివాహాలు జరిగాయి. 5 శాతం మంది మతాంతర వివాహాలకు మొగ్గుచూపారు. నామమాత్రంగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ‘సెక్యులర్‌ మాట్రిమోనీ’ ఉపయోగపడుతోంది. ఈ పేజీని ఇన్‌స్టాలో 57 వేల మంది అనుసరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 64 వేల మంది వీక్షిస్తున్నారు. 32 వేల మందితో ఓ వాట్సాప్‌ గ్రూపు నడుస్తోంది. వీరిలో కేరళ వారే కాదు; ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు నుండి కూడా ఉన్నారు.

కుల మతాలకు అతీతమైన సమాజం ఆకాంక్షించే వారంతా ఈ వెబ్‌సైట్‌ ద్వారా తమ భావాలను పంచుకుంటున్నారు. పిల్లల పెంపకంపై కూడా ఇందులో చర్చిస్తారు. ప్రేమ, సారుప్యత, లింగ భేదం లేకుండా మాట్లాడుకునే వీరిలో ఎల్‌జిబిటీక్యూ కమ్యూనిటీ వ్యక్తులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు.

గణిత టీచర్‌ బాధ్యతల్లో ఉన్న మను 2022 నుండి ఈ మ్యాట్రిమోనీని నిర్వహిస్తున్నారు. వెబ్‌సైట్‌ ద్వారా 100 జంటలను ఏకం చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న మను ఇప్పటి వరకు తనతో సహా 90 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు చెబుతున్నారు.
‘చిన్న తనం నుండి దేవుని చుట్టూ నాకు అనేక ప్రశ్నలు ఉండేవి. ప్రేమకి, మతానికి సంబంధం ఏంటని చాలాసార్లు అనుకునేవాణ్ణి. 2014లో ‘మథమిల్లథ జీవిథంగల్‌'(లైఫ్‌ విత్‌అవుట్‌ రిలీజియన్‌) పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పేజీ నిర్వహించాను. దాని స్ఫూర్తితోనే ఈ వెబ్‌సైట్‌ ఆలోచనకి బీజం పడింది. ‘ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని భావించినప్పుడు కులం, మతం వారికి అడ్డుకాకూడదు. ఈ భావాలు యుక్త వయసుకు వచ్చిన పిల్లల్లోనే కాదు, పెద్దల్లో కూడా ఉన్నప్పుడే ఆ బంధాలు సజీవంగా ఉంటాయి. సమాజాన్ని కులమతాలకతీతంగా అభివృద్ధి చేయడంలో పిల్ల్లలు, పెద్దలు ఒక్కతాటిపై నడవాలి’ అంటున్నారు మను.

➡️