మల్లవరం అనే ఊరిలో రామయ్య, సీతమ్మ దంపతులు ఉన్నారు. వారికి రమ, రాము అనే ఇద్దరు పిల్లలు. కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య దుర్వ్యసనాలకు అలవాటు పట్టాడు. ఎవరు ఎంత చెప్పినా వినలేదు.
ఆ రోజు రమ పదవ పుట్టినరోజు. సీతమ్మ, తమ్ముడు రాము, రమకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. రమ ఎంతో సంతోషించింది. రామయ్య మాత్రం చెప్పలేదు. అసలు అతనికి గుర్తు కూడా లేదు. ఎప్పుడూ మత్తులో ఉంటున్నాడు. రామయ్య పరిస్థితికి రమ ఎంతో బాధపడింది. తండ్రిలో మార్పు తేవాలని బలంగా అనుకుంది.
కొన్ని రోజులకి రాము పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు కూడా రామయ్య అలాగే ప్రవర్తించాడు. అప్పుడు రమ తండ్రి దగ్గరికి వెళ్లింది. ‘నాన్న, మీరు ఈ వ్యసనాల నుండి దూరంగా రండి. ఇది మిమ్మల్నే కాదు, మమ్మల్ని కూడా పాడుచేస్తోంది. మీ ప్రవర్తన వల్ల అమ్మ, నేను, తమ్ముడు చాలా బాధపడుతున్నాం. బంధువుల్లో మన పరువు పోతోంది. ఎవరూ మమ్మల్ని గౌరవంగా చూడడం లేదు. ఇది మేము భరించలేకపోతున్నాం. ఈ రోజు తమ్ముడి పుట్టినరోజు. మీరు ఈ రోజు సాయంత్రం పని నుండి ఇంటికి వచ్చేటప్పుడు తమ్ముడి కోసం కేక్ తీసుకురండి. అలా అని మాకు మాట ఇవ్వండి. అప్పుడు మీరు మారారని మేమంతా నమ్ముతాం. మమ్మల్ని అర్థం చేసుకోండి నాన్న’ అని ఏడుస్తూ బతిమాలింది.
రమ మాటలు రామయ్యపై ప్రభావం చూపాయి. ఆ రోజు నుండి మత్తు పదార్థాల వైపు వెళ్లకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆరోజు సాయంత్రం ఇంటికి కేక్ తీసుకెళ్లాడు. అతనిలో వచ్చిన మార్పు చూసి కుటుంబం సంతోషపడింది.
– బి.రవి త్రేయని,
6వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
అనంత సాగర్, సిద్దిపేట జిల్లా,
99590 07914.