పర్యావరణ హితం కోసం …

Apr 2,2024 06:38 #feachers, #jeevana, #plastic ban

గౌరీ గోపీనాధ్‌, కృష్ణన్‌ సుబ్రమణ్యన్‌ భార్యాభర్తలు. ఇద్దరూ కంప్యూటర్‌ విద్య చదివారు. బెంగళూరులో ఉద్యోగంలో చేరారు. రోజులు హాయిగానే గడిచిపోతున్నాయి. కానీ, వారి నిత్య జీవితంలోని ఒక సంఘటన వారిని బాధించింది. తమతో పాటే పనిచేసే ఒక మిత్రుడు క్యాన్సర్‌కి గురి కావడం వారిని దిగ్భ్రాంతి పరిచింది. మనతోనే నవ్వుతూ తుళ్లుతూ ఉన్న తనకి ఈ సమస్య ఎందుకు వచ్చింది? అన్న ప్రశ్న వారిని స్థిమితంగా ఉండనివ్వలేదు. చాలా చాలా విషయాలు చదివారు. చాలామందితో మాట్లాడారు. ప్యాకింగుల ద్వారా వేడి వేడి ఆహార పదార్థాల్లో కలిపిపోతున్న ప్లాస్టిక్‌ కూడా క్యాన్సరుకు కారణమవుతుందని తెలుసుకున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేదా? అని ప్రశ్నించుకున్నారు.
అప్పుడే ప్రభుత్వం నుంచి పాలీథీన్‌ కవర్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. గౌరీ, కృష్ణన్‌ సంతోషపడ్డారు. చిన్న చిన్న షాపుల మీద అధికారులు దాడులు చేయడం, పాలీధీన్‌ కవర్లను స్వాధీనం చేసుకోవడం, జరిమానాలను విధించటం పత్రికల్లో చూసి, ఆనందపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే- నెమ్మదిగా పాలీథీన్‌ కవర్ల వినియోగం, ఉత్పాదన తగ్గిపోతుందని భావించారు. కానీ, అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. నెలరోజుల తరువాత అవే షాపుల్లో దొంగచాటున కవర్ల వాడకం మొదలైంది. దాడులు తగ్గిపోయాయి. మీడియాలో హడావిడి తగ్గిపోయింది. షాపుల్లో పాలీథీన్‌ కవర్లు ఇస్తున్నారు. జనం యథేచ్ఛగా వాడుతున్నారు. అది చూసి, గౌరీ, కృష్ణన్‌ బాధపడ్డారు.
”ఈ కవర్లు వాడడం ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది కాదని చెబుతున్నారు కదా? మీరెందుకు వాడుతున్నారు?” అని కొంతమంది వినియోగదారులను అడిగారు. ”క్యారీ చేయటానికి ఇవి సౌకర్యవంతంగా ఉన్నాయి కదా?”, ”ఇవి తప్ప వేరే బ్యాగులు లేవు కదా?” అన్న సమాధానాలు వారి నుంచి వచ్చాయి.
ఈ సమాధానం గౌరీ, కృష్ణన్‌లను ఆలోచనల్లో పడేశాయి.
పాలీథీన్‌కి, ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా బ్యాగులను తామే తయారు చేయాలని నిశ్చయించుకున్నారు. వెంటనే స్థానికంగా టైలర్లను కలిసి, ఆకర్షణీయమైన గుడ్డ సంచులు కుట్టేలా ప్రోత్సహించారు. తాము వాటిని వాడడం మొదలు పెట్టారు. సహోద్యోగుల్లో, బంధుమిత్రుల్లో ప్రచారం చేశారు. వారాంతపు సెలవుల్లో షాపింగ్‌ మాళ్లకు వెళ్లి, మార్కెటింగ్‌ చేశారు. గుడ్డసంచులకు నెమ్మదిగా ఆదరణ మొదలైంది.
దానిని మరింత పెంచటానికి 2019లో ఇద్దరూ తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. సొంతూరు చెన్నై కేంద్రంగా పర్యావరణ హితమైన గుడ్డ సంచుల తయారీని ఒక పరిశ్రమగా చేపట్టారు. బ్యాగులను రూపొందించటంలో అనేక ఆకర్షణీయమైన పద్ధతులను అనుసరించారు. ”ప్లాస్టిక్‌, పాలీథీన్‌ కవర్లు వాడొద్దని ప్రచారం చేయటం ఒక్కటే కాదు. ఏమి వాడాలో వాటిని అందుబాట్లో ఉంచటం చాలా అవసరం. అది జరక్కపోవడం వల్లే పాలీథీన్‌ వాడకం పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. అందుకే మేము ఈ గుడ్డ సంచుల తయారీని ఒక ఉద్యమంలా చేపట్టాం.” అని చెప్పాడు కృష్ణన్‌.
”గుడ్డ సంచులను కనులకింపుగా తయారు చేయటం కూడా ముఖ్యమేనని మేం అనుభవంలో తెలుసుకున్నాం. తమిళ సాంప్రదాయ చిత్రాలను ఆహ్లాదకరమైన రంగుల్లో సంచుల మీద ముద్రిస్తున్నాం. సింపుల్‌గా, హుందాగా ఉండేలా తయారు చేయిస్తున్నాం. అందుకే మా బ్యాగులు బాగా అమ్ముడవుతున్నాయి. చాలామంది కస్టమర్ల చేతుల్లో మా బ్యాగులను చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది.” అని ఆనందంగా చెబుతోంది గౌరి.
”మనమూ, మన తరువాతి తరాలూ హాయిగా, ఆరోగ్యవంతంగా బతకాలంటే పర్యావరణం బాగుండాలి. అలా బాగుండటానికి మనమూ ఎంతోకొంత కృషి చేయాలి.” అంటున్నారు ఈ దంపతులు.
‘మన్‌జప్పరు’ పేరుతో ఈ బ్యాగులను రూపొందిస్తున్నారు. మన్‌జప్పరు అంటే పసుపు పచ్చని చేతి సంచి అని అర్థం అట. ఇప్పుడు రోజుకు మూడు వేల సంచుల వరకూ తయారు చేస్తున్నారు. ఈ బ్యాగుల ఖరీదు సైజును బట్టి, రకాన్ని బట్టి ధర రూ.20 లు మొదలు కొని రూ.200ల వరకూ ఉంటుంది. 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. వివిధ దినోత్సవాల సందర్భంగా పాఠశాలలకు, పర్యావరణ సంస్థలకు ఉచితంగా చేతిసంచులు పంచిపెడుతున్నారు. ఏడాదికి మూడు కోట్ల టర్నోవరు వ్యాపారమూ చేస్తున్నారు. పర్యావరణ హితం కోసం పనిచేస్తూ, ఇలా ఉపాధి పొందటం ఆత్మతృప్తిని ఇస్తుందని చెబుతున్నారు గౌరీ, కృష్ణన్‌.

➡️