సాక్ష్యాలున్నా స్పందించని నీతిమాలిన వ్యవస్థ ఇది … అంకితా, మమ్ము క్షమించు..!

ఇది భారతదేశం.. ఇక్కడ రాళ్లు, రప్పలు.. చెట్లు, చేమలు.. నీళ్లు, నిప్పులకు ప్రతిరూపాలుగా మహిళలను కొలుస్తారు. మొక్కులు చెల్లిస్తారు. అయితే ఈ గౌరవ మర్యాదలు ప్రాణం లేని ప్రతిమలకే అందుతాయి. ప్రాణాలున్న మహిళలకు కాదు. ఎందుకంటే అనాదిగా ఈ దేశంలో అన్యాయానికి గురైన మహిళలను చట్టం, న్యాయం అక్కున చేర్చుకోవు. మూడేళ్ల క్రితం డెహ్రాడూన్‌లో హోటల్‌ రిసెస్పనిస్ట్‌గా పనిచేస్తున్న 18 ఏళ్ల అంకిత భండారి అనే యువతిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఉత్తరాఖండ్‌ బిజెపి మంత్రి కొడుకు ఆ హోటల్‌ని నిర్వహిస్తున్నాడు. అతనే ఇందులో ప్రధాన దోషి. నిందితులు కళ్ల ముందే ఉన్నారు. అయినా వారు నేరస్తులుగా పరిగణించలేదు. సాక్ష్యాలను గల్లంతు చేశారు. నిందితులను రక్షిస్తూ, పోలీసులు, అధికారులు, పాలకులు అంతా కుమ్మక్కై ఆమెకి అన్యాయం చేశారు. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఆమె హత్య కేసును సిబిఐకి అప్పగించమన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

సుప్రీంకోర్టు తాజా తీర్పుపై తీవ్రంగా కలత చెందిన సీనియర్‌ అడ్వకేట్‌ కోలిన్‌ గోన్సల్వ్సే, చనిపోయిన అంకితకి బహిరంగ క్షమాపణ లేఖ రాశారు. భావోద్వేగభరితమైన ఆ లేఖ ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ లేఖలో ఇలా ఉంది.

‘అంకితా, క్షమించు,
నన్ను క్షమించు, నీ హత్యపై సిబిఐ దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మేము ఇంతవరకు ప్రధాన నిందితుణ్ణి పట్టుకోలేకపోయాం.
నన్ను క్షమించు అశుతోష్‌, నువ్వొక నిర్భయ జర్నలిస్టువి. ఈ కేసును కోర్టులో వేసినందుకు మీరు బలిపశువు అయ్యారు. మీపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు. మీ భార్యని బదిలీ చేసి మీకు దూరం చేశారు.

నన్ను క్షమించండి సోనీ దేవి (అంకిత తల్లి).. హోటల్‌లో పనిచేస్తున్న అంకిత ప్రత్యేక సేవలు కోరిన వ్యక్తిని ప్రతిఘటించడమే ఆమె హత్యకి దారితీసింది. ఏ నేరం చేసినా తప్పించుకోవచ్చు అనేంతగా రాజకీయ నాయకుల ముందు పోలీసులు సాగిలపడినందుకు నేను చింతిస్తున్నాను. (ఈ కేసులో మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినా అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. దీనిపై ఆవేదన చెందుతూ కోలిన్‌ ఇలా రాశారు)

మొదటిది.. అంకిత, ఆమె స్నేహితుడు పుష్యదీప్‌ మధ్య వాట్సాప్‌ చాట్‌. అందులో ఆమె ఒక విఐపి తమ హోటల్‌కి అతిధిగా వచ్చారని, అతను, తనని ప్రత్యేక సేవలు కోరాడని ఫిర్యాదు చేసింది. ఉత్తరాఖండ్‌ పోలీసులు ఆ చాటింగ్‌ని చార్జ్‌షీట్‌ నుంచి తొలగించారు. ఆ చాట్‌లో ఆమె తనకు భయంగా ఉందని, వెంటనే వచ్చి తనని తీసుకెళ్లమని కోరింది.

రెండవది.. పుష్యదీప్‌కి, విఐపి సహచరుడికి మధ్య స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర జరిగిన వాగ్వివాదం. ఆ దృశ్యాలను సీసీటివి పుటేజ్‌లో చూసిన పుష్యదీప్‌, ఆ సహచరుడిని గుర్తించాడు. అయితే ఆ వివరాలు పోలీసులు చార్జిషీట్‌లో నమోదు చేయలేదు.

మూడవది.. ఆ సహచరుడు తన బ్యాగులో నగదు, ఆయుధాలను కలిగిఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు అతడిని నిందితుడిగా గుర్తించలేదు. ప్రశ్నించలేదు.

నాల్గవది.. అంకితని హత్య చేసేముందు, బలవంతంగా ఆమెని బయటకి తీసుకెళ్లారు. అప్పుడు ఆమె గదిలో బిగ్గరగా ఏడ్చింది. ఆ ఘటనకి ప్రత్యక్షసాక్షి ఇచ్చిన వాంగ్ములాన్ని కూడా చార్జ్‌షీట్‌లో పేర్కొనలేదు.

ఐదవది.. అంకిత బస చేసిన గదిలోని లాబోరేటరీ ఫోరెన్సిక్‌ నివేదికను కూడా జోడించలేదు.

ఆరవది.. స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంకిత బస చేసిన గదిని బుల్డోజరుతో నాశనం చేసినా నేరంగా పరిగణించలేదు.

ఏడవది.. విఐపితో సంభాషణలు జరిపిన హోటల్‌ సిబ్బంది మొబైల్‌ ఫోన్లని ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు.

ఎనిమిదవది.. విఐపి, అతని పరివారం గుర్తింపును స్పష్టంగా చూపించే సిసిటీవీ పుటేజ్‌ని కెమెరాలు పనిచేయడం లేదన్న సాకుతో ఇంతవరకు అందించలేదు.

తొమ్మిదవది.. హత్యకి ముందు అంకిత పరధ్యానంగా ఉందని చెప్పిన సాక్షులను సరిగ్గా విచారించలేదు.

పదవది.. కాల్‌ రికార్డ్‌ని పరిశీలించామని, అనుమానాస్పదమైన కాల్‌ రికార్డులు, మెసేజ్‌లు ఏమీ లేవని ఉత్తరాఖండ్‌ పోలీసులు కేసును పక్కదారి పట్టించారు. హత్యకు గురైన అంకిత కాల్‌ రికార్డులు మాత్రమే పరిశోధించి, హోటల్‌ సిబ్బంది కాల్‌ రికార్డులను ఉద్దేశపూర్వకంగా విస్మరించారు.

చివరికి.. నిందితుల్లో ఒకరితో కలిసి అంకిత బైక్‌పై ప్రయాణిస్తున్న వీడియోను ప్రాసిక్యూషన్‌ తప్పుగా ప్రస్తావించింది. అయితే తనపై జరిగిన అమానుషానికి షాక్‌కి గురైన అంకిత చేష్టలుడిగిన దానిలా అలా కూర్చొంది. బైక్‌పై వెళ్లిన కొద్దిసేపటికే అంకితని హత్య చేసి కాల్వలో పడేశారు. అయితే అంతకు కొద్ది క్షణాల ముందు అంకిత తనకి ఫోన్‌ చేసిందని, తన చుట్టూ కొంతమంది వ్యక్తులు గుమిగూడారని, చాలా భయంగా వుందని, తనను మాట్లాడనివ్వడం లేదని ఆమె చెప్పిందని పుష్యదీప్‌ కోర్టులో సాక్ష్యం చెప్పారు.

తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హోటల్‌ ఉద్యోగి పుల్‌కిత్‌ ఆర్యా తమని నార్కో ఎనాలసిస్‌కి అనుమతించమని కోర్టుని అభ్యర్థించాడు. అయితే ట్రయల్‌ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. ఆరోపణలకు గురైన వాళ్లు తమంతట తాము ఇవ్వదలిచిన ఆ సాక్ష్యం, నిందితుడిని, అతని గుర్తింపును బహిరంగపరిచేది.

ఈ కేసులో విఐపి గుర్తింపును పోలీసులు కప్పిపుచ్చారు. సిబిఐ విచారణ చేపడితే ఈ తెర తొలగుతుంది. అతను ఉన్నతస్థాయి రాజకీయ నాయకుడని, తన పార్టీ సభ్యులతో తరచూ హోటల్‌కి వెళ్లేవాడని అంకిత తల్లి ఫిర్యాదులో పేర్కొంది. దాని ఆధారంగానైనా సీసీటివీ పుటేజ్‌ లేదా సిబ్బంది మొబైల్‌ ఫోన్ల ద్వారానైనా ఆధారాలు సేకరించవచ్చు. నిందితుడిని గుర్తించవచ్చు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అందుకే, అంకితా.. క్షమించు! ఇది భారతదేశం.. ఇక్కడ సామాన్య మహిళల జీవితాలకు లెక్క లేదు. గొప్పవాళ్లు, ధనవంతులు మళ్లీ మళ్లీ తప్పించుకుంటారు.

– కొలిన్‌ గోన్సాల్వ్స్‌,
సీనియర్‌ న్యాయవాది, సుప్రీంకోర్టు.

➡️