కప్ప తెలివి

Dec 4,2024 03:33 #feachers, #Jeevana Stories

ఒక అడవిలో పులి ఉంది. ఒకరోజు దానికి బాగా ఆకలి వేసింది. ఎంతసేపు వెదికినా ఏ ఆహారం దొరకలేదు. అలా వెళ్తుండగా చెరువు కనిపించింది. తిండి ఎలాగూ లేదు, కనీసం చెరువులో నీళ్లైనా తాగి కాసేపు ఓపిక పడదామని తలవంచింది. చెరువులో దానికి ఒక కప్ప కనిపించింది. పులికి ప్రాణం లేచి వచ్చింది. కప్పను పట్టుకోబోయింది. భయంతో ఉన్న కప్ప చెరువులోకి దూకబోయి, గట్టుపైకి ఎగిరింది. ఈసారి ఇంకా భయంతో వణికిపోయింది. అయితే వెంటనే తేరుకుని ‘ఓ పులి రాజా, మీరు అడవికి రాజైతే, నేను ఈ చెరువుకు రాజుని. ఇద్దరమూ సమానమే. మనిద్దరి హోదాలు ఒకటే. కాబట్టి మీరు నన్ను తినకూడదు’ అని లేని ధైర్యాన్ని తెచ్చుకుని పులితో గప్పాలు పలికింది. అప్పుడు పులి ‘నేనే ఈ అడవికి రాజును. నీకెంత ధైర్యం ఉంటే, నువ్వే రాజునని అంటున్నావు’ అని కోపంగా గాండ్రించింది. ఈసారి కప్ప భయంతో బిక్కచచ్చిపోయింది. ఎలాగైనా పులి నుండి తప్పించుకోవాలని ఉపాయం ఆలోచించింది. ‘మనిద్దరం సమానమంటే మీరు ఒప్పుకోవడం లేదు. కాబట్టి పరుగుపందెం పెట్టుకుందాం. అందులో మన శక్తిసామర్థ్యాలు తెలుస్తాయి. అప్పుడైనా మీకు అర్థమవుతుంది’ అని ఈసారి కాస్త స్వరం తగ్గించి చెప్పింది కప్ప.
కప్ప అలా అనడంతోనే పులి ‘నాతో నీకు పోటీనా? తెలివి తక్కువ కప్పా.. అయితే, నాతో పరుగెత్తు..” అంటూ పరుగు లంకించుకుంది. ఇదే అదను అనుకుని కప్ప వెంటనే నీళ్లల్లో దూకేసింది. బతుకుజీవుడా అనుకుంటూ నీళ్లలోకి జారిపోయింది.

 

– కందుల శ్రవణ్‌, 9వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కడవేర్గు గ్రామం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ.

➡️