వినపడని స్థితి నుంచి కనపడేంత స్థాయికి …

ఇద్దరు వినికిడి లోపంతో బాధపడుతున్న వ్యక్తులైతే, వారి సమస్యలు, సంతోషాలు ఎలా వ్యక్తం చేసుకుంటారు? ఇలాంటి ప్రశ్నే ఎదురైంది రూపాణి ఛెత్రికి. వినికిడి సమస్య ఉన్న వాళ్లు కూడా సాధారణ పౌరుల్లాగా హద్దులు లేని ప్రపంంచంలో విహరించాలని ఆమె కలలు కంది. ఆ దిశగానే బెంగుళూరు కేంద్రంగా తరుణ్‌ సర్వాల్‌ భాగస్వామ్యంతో 2019 నుండి సంజ్ఞల భాషతో అనుసంధానించబడిన ఓ యాప్‌ని ప్రారంభించారు. వీడియో సంబంధిత సేవలను అందించడంలో ఈ యాప్‌, వైకల్యం ఉన్న వాళ్లకి ఎంతగానో ఉపయోగపడుతోంది.

రూపాణి ఛెత్రి డార్జిలింగ్‌లో పుట్టి, పెరిగారు. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. ఇంట్లో అందరూ గోలగోలగా మాట్లాడుకుంటుంటే తాను మాత్రం ఒక్కత్తే కూర్చొనేది. తన ఇంట్లోనే తను ఓ పరాయిదానిగా ఉండేది. స్కూలుకు వెళ్లినా అదే పరిస్థితి. ‘సెక్యూరిటీ గార్డు కూతుర్నైన నేను సాధారణ స్కూల్లోనే విద్యనభ్యసించాను. ప్రత్యేక పాఠశాలలో చదువు చెప్పించే స్థోమత మా నాన్నకు లేదు. స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలు నాకు వినిపించేవి కావు. బోర్డు మీద రాసిన వాటినే పుస్తకంలో రాసేదాన్ని. ఈ కాపీ, పేస్ట్‌ చదువు నాకు తగదని మా నాన్న చదువు మాన్పించాలని చూశారు.

వినపడదని చదువు మాన్పించేశారు
కానీ చదువుకోవాలన్న ఉద్దేశంతో 9, 10 ఏళ్లప్పుడు కూలి పనులకు వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా నా ముందుకు వినికిడి లోపం వచ్చి కూర్చొనేది. దాన్ని అధిగమించాలని స్పీచ్‌ థెరపీ కూడా నేర్చుకున్నాను. కానీ లాభం లేదు. అప్పటికింకా సంజ్ఞల భాష అందుబాటులోకి రాలేదు. అలాంటప్పుడే నేనో కల కన్నాను. అందరితో నేనూ మాట్లాడాలి’ అంటున్న రూపాణికి 9వ తరగతికే చదువుకు స్వస్తి చెప్పి పెళ్లి చేసేశారు. భాగస్వామి కూడా తనలా వైకల్య బాధిత వ్యక్తి కావడం రూపాణి సమస్యను మరింత పెద్దది చేసింది. పైగా వేధింపులతో ఆమె జీవితం సాఫీగా సాగలేదు. ఈ పరిస్థితుల్లో భర్త నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె చుట్టూ ఎన్నో సూటిపోటి మాటలు. ఎలా బతుకుతావని జాలి చూపులు. కానీ అవేమీ రూపాణిని అధైర్య పరచలేదు. తను కల గన్న కల కోసం ముందుకే అడుగులు వేసింది.

‘విడాకులు తీసుకుని ఇంటికి వచ్చాక, నా చదువును పూర్తి చేశాను. డిగ్రీ కూడా చదివాను. ఢిల్లీలో ఉంటూ డిగ్రీ చేయడం వల్ల నాలాంటి వాళ్లను ఎంతోమందిని కలిసే అవకాశం వచ్చింది. అంతమందిని ఒక్కసారే చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యమేసింది. వారంతా సంజ్ఞల భాషలో మాట్లాడుకోవడం కూడా మొదటిసారి చూశాను. వాళ్లతో నేను కూడా కలిశాను’ అంటున్న రూపాణి ఆ తరువాత కొన్ని ప్రముఖ స్వచ్ఛంద సంస్థల సాయంతో సంజ్ఞల భాషపై పట్టు సాధించారు.

‘సంజ్ఞల భాష’ మాతృభాష లాంటిది
వైకల్య బాధిత వ్యక్తుల కోసం జాతీయ స్థాయిలో పనిచేసే ఎన్‌ఎడి వంటి సంస్థల్లో గీతా శర్మ, జావేద్‌ అబిది లాంటి వ్యక్తుల పరిచయం రూపాణిని ఉన్నత స్థానాలు అధిరోహించేలా చేసింది. ‘వారి ప్రోత్సాహం వల్ల సంకేత భాషను నేర్చుకున్నాను. అర్థవంతమైన స్నేహాలను ఏర్పరచుకున్నాను. నా స్వంత గుర్తింపును కనుగొన్నాను. పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభించాను’ అంటున్న ఆమె ‘సంజ్ఞల భాష వినికిడి సమస్య ఉన్న వారికి మాతృభాష లాంటిది. తమను తాము వ్యక్తీకరించుకోవడానికి, ఇతరులలాగే కమ్యూనికేట్‌ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది వాళ్ల ప్రాథమిక హక్కు. చిన్నప్పటి నుండే ఇందులో ప్రవేశం ఉండేలా సౌకర్యాలు కల్పించాలి’ అంటున్నారు.

‘విఆర్‌ఎస్‌’ రూపకర్త
ఎన్‌ఎడితో కొంతకాలం పనిచేసిన తర్వాత, ఆమె ఢిల్లీకి చెందిన హెచ్‌ఎక్యూ సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌, సంస్థతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. దాదాపు ఆరేళ్లపాటు పని చేసిన తరువాత 2017లో ఐరోపాలో యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యమయ్యారు. ఈ ప్రయాణంలోనే అధునాతన సౌకర్యమైన, బధిరుల కోసం వీడియో రిలే సర్వీస్‌ (విఆర్‌ఎస్‌) పరివర్తన ప్రభావాన్ని ఆమె ఆవిష్కరించారు.

అంతర్జాతీయ గుర్తింపు
ఈ విజయం అంతర్జాతీయంగా ఆమెకు ఎనలేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. యుఎన్‌ వాలంటీర్స్‌ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ఒక బ్లాగ్‌ ప్రకారం, ‘ఒక మార్పుకు ఇది నాంది’ అని రాశారు. రూపమణి తన ఈ ప్రయాణంలో కమ్యూనికేషన్స్‌ అసిస్టెంట్‌గా, యుద్ధంలో వినికిడి లోపంతో బాధపడే వ్యక్తులకు మద్దతు ఇచ్చే స్థాయికి వెళ్లారు. యుక్తవయస్కులు, వినికిడి లోపం ఉన్న పెద్దల కోసం సంకేత భాషా కోర్సులను కూడా నిర్వహించారు.

యాప్‌ ఆవిష్కరణ
అయితే ఆ వ్యక్తులతో పనిచేయడం ప్రారంభించిన రూపాణికి వినికిడి లోపంతో బాధపడే ఎందరో వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు నిద్రపట్టకుండా చేశాయి. అక్కడ విధులు ముగించుకుని ఇండియాకి వచ్చిన ఆమెకి తన ప్రయాణంలో కలసి భాగస్వామ్యమయ్యే వ్యక్తులు, సంస్థల కోసం అన్వేషించడం ప్రారంభించారు. అప్పుడే తరుణ్‌ ఆమెకి సోషల్‌మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఈ ఇద్దరి చొరవతోనే 2019 జనవరిలో రఱస్త్రఅAbశ్రీవ యాప్‌ ఆవిష్కృతమైంది.

12 భాషల్లో సేవలు
సంజ్ఞల భాష అంటే ఏ ఒక్క భాషకో పరిమితం కాకుండా ఏకంగా 12 భాషల్లో ఈ యాప్‌లో సేవలు అందిస్తున్నారు. సంజ్ఞల భాషలో ముఖాముఖి సందేశాలు తీసుకోవడం, ఇవ్వడం ఈ యాప్‌ ప్రత్యేకత. ‘ప్రపంచ నలుమూలల వ్యక్తులు ఈ యాప్‌ ద్వారా సంభాషించుకోవచ్చు. ఇప్పటి వరకు 350 మంది ఇందులో సేవలు అందిస్తున్నారు. నామమాత్రపు ఫీజుతో ఈ యాప్‌ని అనుసంధానించుకునే వీలు కల్పించాం. సమర్ధవంతంగా నిర్వహించడంలో కొన్ని లోపాలు ఉన్నా, వీలైనంత ఎక్కువమందికి సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని చెబుతున్న రూపాణి సాధించిన విజయాలు చూస్తుంటే తను కూడా ఓ బాధితురాలే అని ఎవరికీ గుర్తుకురాదు. అంతలా ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని ప్రయాణిస్తున్న రూపాణి తనలాంటి ఎంతోమందికి గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నారు.

➡️