పొగ తాగటం ముందు ఆసక్తితోనే ప్రారంభమవుతుంది. చివరికి వ్యసనంగా ఊబిలోకి లాగేసుకుంటుంది. ఉత్సుకత..ఉబలాటం కొద్దీ ఆకర్షణకు గురైతే అది క్రమంగా అలవాటుగా జీవితాన్నే చిదిమేస్తుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు…ఇలా ఏవైనా గానీ తాగిన మరుక్షణం నుంచే శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపటం ప్రారంభమవుతుంది. పొగాకు పొగలోని నికొటిన్ వదల్లేని అలవాటుగా మారేలా చేస్తే..విష తుల్యాలు, ఊపిరితిత్తులు, గుండె జబ్బుల వంటి దీర్ఘకాల వ్యాధుల దగ్గర నుంచి వివిధ క్యాన్సర్ల వరకూ రక రకాల సమస్యలకు దారితీస్తాయి. మనదేశంలో జబ్బులు, మరణాలకు కారణమవుతున్న అంశాల్లో సిగరెట్ అలవాటు ఒకటి. ఏటేటా సుమారు 14 లక్షల వరకూ మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. 15, అంతకన్నా ఎక్కువ ఏళ్లు పైబడిన వారిలో సుమారు 30 శాతం మంది వరకూ పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటేటా 7 మిలియన్లకుపైగా మరణాలు ఈ తరహా కేసుల్లో సంభవిస్తున్నాయి. సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగటంతోపాటుగా, గుట్కా, ఖైనీ, జర్దా వంటివి నమలటం ద్వారా పొగాకును వేరే రూపంలో కూడా వాడుతున్నారు.
హానికరమని తెలిసినా?
”మద్యపానం..ధూమపానం ఆరోగ్యానికి హానికరం” ఇది అక్షరాల నిజం. సిగరెట్టు ప్యాకెట్లపైనా, ప్రతిరోజూ సినిమా థియేటర్లలో ఇలాంటి ప్రసారాలు చూస్తూనే ఉంటాం..కానీ వాటి అమ్మకాలు తగ్గటం లేదు. ధూమపానం చేసేవాళ్లు వ్యాధుల పాలవ్వటం ఆగటం లేదు. ధూమపానం చేసేవారు అతిత్వరగా మద్యానికి కూడా బానిసవుతారు. ధూమ, మద్యపానానికి అలవాటుపడితే అది జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. బానిసైన వారు ఆత్మన్యూనతాభావంతో ఉంటారు. ఆత్మవిశ్వాసం, నమ్మకం, బుద్ధి, గౌరవాన్ని కోల్పోతారు. ధూమపానం శృతిమించితే క్యాన్సర్‌తోపాటుగా అనేక ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తాయి. ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితులకు కూడా దారితీస్తున్నాయి.
అనేక రకాల హాని కారకాలు
- సిగరెట్లు, చుట్టలు, బీడీల పొగలోని రసాయనాలు శరీరంలో రక రకాలుగా హాని చేస్తాయి.
- నికొటిన్ పొగ అలవాటుకు బానిసయ్యేలా చేస్తుంది. రక్త నాళాలు సంకోచించేలా చేస్తుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. .
- కార్బన్ మోనాక్సైడ్ ఊపిరితిత్తుల నుంచి గుండెకు ఆక్సిజన్ అందటం తగ్గుతుంది. క్రమంగా గాలిగొట్టాలూ ఉబ్బుతాయి.
- తారు చిమ్నీ లోపల పొగ చూరినట్లుగా ఇది ఊపిరితిత్తుల్లో అంటుకుపోతుంది.
- ఫెనాల్స్ గాలిగొట్టాల్లో శుభ్రత తగ్గుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది.
- సూక్ష్మరేణువులు గొంతు, ఊపిరితిత్తులను చికాకు పర్చి దగ్గును ప్రేరేపిస్తాయి. జిగురుద్రవం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసి ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి.
ఇవీ ఆరోగ్య సమస్యలు
ఊపిరితిత్తుల వ్యాధులు : ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల కణజాలంలో అసాధారణ పెరుగుదల. ధూమపానమే దీనికి ప్రధాన కారణం. ధూమపానం ద్వారా 20 నుంచి 30 రెట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం.
క్షయ : ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులు, శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. సిఒపిడి అనేది ఊపిరితిత్తుల ప్రవాహం వల్ల వచ్చే ఒక సమూహం. ధూమపానమే దీనికి ప్రధాన కారణం.
బ్రోన్కైటిస్ : ఊపిరితిత్తుల శ్వాస గొట్టాల వాపు. ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలికంగా ఉండొచ్చు. తీవ్రమైన బ్రోన్కైటిస్ సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. తీవ్రమైన బ్రోన్కైటిస్ సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
గుండె వ్యాధులు : గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులను పెంచుతుంది. గుండెపోటు గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ఈ ప్రమాదాన్ని రెండు, మూడు రెట్లు పెంచుతుంది. కొరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె వైఫల్యం, గుండె సంబంధిత క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
పలు రకాల క్యాన్సర్లు : ఊపిరితిత్తులు, మూత్రపిండ, నోటి, గొంతు, గ్యాస్ట్రిక్, ప్యాంక్రియాస్ క్యాన్సర్లతోపాటుగా ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
దంతక్షయం : దంతాల క్షయం, పళ్ల మధ్య రంధ్రాలు, దంతాల పసుపు వంటి దంత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నోట్లో ఆమ్లాల స్థాయిలను పెంచుతుంది. దంతాల క్షయానికి దారితీస్తుంది. నోట్లో రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది నోటి పుండ్లకు దారితీస్తుంది.
ఇన్ఫెక్షన్లు : గర్భవతుల్లో ధూమపానం వల్ల బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పుట్టుకలో మృతిచెందటం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఏర్పడొచ్చు. రక్తపోటు పెరుగుతుంది. హృదయ నాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి.
చర్మ సమస్యలు : చరమ్మంపై వయస్సు మార్పులు, మచ్చలు పెరుగుతాయి.
మానసిక ఆరోగ్యం : మానసిక ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనతాభావం వంటివి వస్తాయి.
రోగ నిరోధక వ్యవస్థ తగ్గుదల : శరీరంలోని రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు వెంట వెంట వెంటాడుతాయి.
మానేస్తే ఉపయోగాలు…
ధూమపానం మానేస్తే అనేక ప్రయోజనాలున్నాయి.
- హృదయ స్పందన రేటు, రక్తపోటు తగ్గుతుంది
- కార్బన్ మోనాక్సైడ్ స్థాయిల్లో నియంత్రణ
- గుండెజబ్బులు శాతం తగ్గుదల
- క్యాన్సర్ ప్రమాదాలు ఉండవు
పొగ అలవాటు మానాల్సిందే…
సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చటం నేరుగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. పొగలోని విష తుల్యాలు గాలి గొట్టాలను, గాలి గదులను కోలుకోలేనంత దెబ్బతీస్తాయి. ఇది దీర్ఘకాలిక ఊపిరితిత్తి సమస్య ‘క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఒపిడి)కి దారితీస్తుంది. సిఒపిడిలో క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫెసీమా అనే రెండు సమస్యలు తలెత్తుతాయి. పొగతో గాలిగొట్టాల్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) మొదలై ఉబ్బిపోతాయి. లోపల మార్గం కుంచించుకుపోవటాన్నే క్రానిక్ బ్రాంకైటిస్. ఎంఫెసీమాలో గాలిగొట్టాలతోపాటు గాలిగదులూ దెబ్బతింటాయి. శ్వాస ద్వారా తీసుకున్న ఆక్సిజన్ రక్తంలోకి, రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తులోకి మార్పిడి కావటం అస్తవ్యస్తమవుతుంది. భరించలేనంతగా దగ్గు, ఆయాసం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలు దెబ్బతినటంతోనూ అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఆస్తమా సమస్యలు బాగా తీవ్రమవుతాయి. ఇది నియంత్రణలోకి రావటం కూడా కష్టమే. అందువల్ల వీలైనంత త్వరగా ధూమపానం నుంచి బయటపడటమే ఉత్తమం.
– డాక్టర్ ఈమని శ్రీసత్య సాంబశివరావు,
ఆరోగ్యరంగ నిపుణులు, హైదరాబాద్