గ్యాంగ్‌ ఉమెన్‌

తిరుపతికి వెళ్లే దారిలో రేణిగుంట రైల్వేస్టేషనుకు సమీపాన రైల్వే గ్యాంగ్‌ కార్మికులుగా ఈ ముగ్గురు మహిళలు పనిచేస్తున్నారు. వీరు ప్రతిరోజూ కాలి నడకన, ట్రాక్‌ వెంబడి 10 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తూ ట్రాక్‌ మరమ్మతులు చేస్తున్నారు. గ్రీజు పూయడం, డెబ్రీలను శుభ్రపర్చడం, ట్రాక్‌ పనితీరుని సరిచూడడం, పాములు, తేళ్లు, ఇతర విషసర్పాలు ఏవైనా ట్రాక్‌లో చిక్కుకుని ఉంటే వాటిని వెళ్లగొట్టడం వీరి దినచర్య. దొంగల భయంతో పురుషులు కూడా ఒంటరిగా ప్రయాణించలేని ప్రమాదకర పరిస్థితుల్లో ఈ మహిళలు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు.

యాభై ఏడేళ్ల జి చంద్రమ్మ 1993 నుండి రైల్వే ట్రాక్‌ మెయింటైనర్‌ బాధ్యతల్లో ఉన్నారు. తన ఉద్యోగ ధర్మం గురించి ఆమె ఇలా చెబుతున్నారు. ‘నేను ఉద్యోగంలో చేరేనాటికి నా భర్త చనిపోయాడు. ఏ విద్యార్హత లేని నన్ను తాత్కాలిక ఉద్యోగిగా మాత్రమే తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయినా వెనుదిరిగి చూడలేదు. వృత్తిపరంగా మొదట్లో నాకు ఏ నైపుణ్యాలు లేవు. కానీ అనుభవమే అన్నీ నేర్పింది. 30 ఏళ్లుగా పురుషుల మధ్య పనిచేస్తున్నాను. చాలా ఏళ్లపాటు ఈ ఉద్యోగంలోకి మహిళలు రాలేదు’ అని కాస్తంత విచారవదనంతో ఆమె చెబుతోంది. విధి నిర్వహణలో చంద్రమ్మ చూపిన అంకితభావానికి గాను ఐదేళ్ల క్రితం ఉత్తమ విధులు నిర్వర్తించిన గ్యాంగ్‌గా చంద్రమ్మకి గుంతకల్‌ డిఆర్‌ఎం అవార్డు ప్రకటించింది.
ఆర్‌ నందిని 2016 నుండి ఇక్కడ ట్రాక్‌ మెయింటైనర్‌గా పనిచేస్తోంది. ‘నాన్న రిటైర్డ్‌ అయిన తరువాత నాకు ఈ ఉద్యోగం వచ్చింది. బిఎ పూర్తిచేసిన నేను టీచర్‌గా పనిచేయాలనుకున్నాను. కానీ కుటుంబ బాధ్యతలు నన్ను ఈ పనిలోకి వెళ్లేలా చేశాయి. తల్లిదండ్రులను, చెల్లి, తమ్ముడి బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మొన్నీమధ్యే చెల్లి పెళ్లి చేశాను. తమ్ముడి పెళ్లి త్వరలో చేయాలి’ అంటున్న నందిని అవివాహిత. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు విధుల్లో ఉంటుంది. ‘మేము పురుషులతో సమానంగా పనిచేస్తున్నాం. అధికారులు అప్పచెప్పిన పనిని సకాలంలో, సమర్థవంతంగా పూర్తిచేయడం మా కర్తవ్యం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా బెదరకుండా మా పని మేం చేస్తాం’ అంటూ తన విధినిర్వహణలను నందిని వివరించారు.
జ్యోతి కుమారి రామ్‌ పశ్చిమబెంగాల్‌ నుండి వచ్చారు. 2023 నుండి ఇక్కడి ట్రాక్‌ మెయింటైనర్‌గా పనిచేస్తున్నారు. ‘నేను పశ్చిమబెంగాల్‌ కంచర్‌ పడా గ్రామం నుండి వచ్చాను. ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వెళతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఆర్మీలో చేరాలని కలలుకన్నాను. కానీ కుటుంబ పరిస్థితులు ఇక్కడికి వచ్చేలా చేశాయి. ఇష్టం లేని పనే అయినా అప్పగించిన బాధ్యతలు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఉద్యోగం చేస్తూనే ప్రైవేటుగా చదువుకుంటున్నాను. ఎందుకంటే నా వృత్తి, ప్రవృత్తి రెండూ నాకు ముఖ్యమే’ అంటోంది.
చంద్రమ్మ, నందిని, జ్యోతి లాంటి మహిళలు మనచుట్టూ ఎంతోమంది. ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో పనిచేస్తున్న ఆ మహిళలందరిని మనసారా అభినందిద్దాం.

➡️