కలసి బతికిన చోట విద్వేషం గీసిన విభజన రేఖ

ఇది భారతీయ సమాజం.. భిన్న సంస్కృతి, సాంప్రదాయాలు నెలవైన ఇక్కడ అన్ని జాతుల వారు సోదర భావంతో మెలుగుతారు. ఒకరి పండుగలకు ఇంకొకరు అతిథులవుతారు. విందులు, వినోదాలు కలిసి పంచుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. ఇట్లాంటి వాతావరణం ఇప్పుడు మారిపోతోంది. మతం పేరుతో ఉన్మాద బీజాలు చాపకింద నీరులా దేశమంతా వ్యాపించేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ సంఘటన అందుకు ఉదాహరణ.

ఉత్తరాఖండ్‌, నందానగర్‌ ప్రాంతం.. నందానదికి ఆనుకుని దేశ రాజధానికి సరిగ్గా 10 గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది. చైనా, ఇండియా సరిహద్దు అది. అక్కడ నలిగిపోయిన, మురికిపట్టిన బట్టలను శుభ్రం చేసే డ్రైక్లీనింగ్‌ షాపును అహ్మద్‌ హసన్‌ నిర్వహిస్తున్నాడు. రోజూ ఉదయం 8 గంటలకు షాపు తెరిచి కస్టమర్ల కోసం ఎదురుచూస్తుంటాడు. అయితే ఇంతకుముందులా ఆ షాపుకి ఇప్పుడు ఎవరూ రావడం లేదు. 2024 సెప్టెంబరుకి ముందు, భోజన సమయానికి ఆ షాపులో 20 నుండి 30 మంది వ్యక్తులు వచ్చేవారు. వారిలో హిందువులే ఎక్కువ. వారంతా హసన్‌తో కలిసి కబుర్లు చెప్పేవారు. రాజకీయాలు మాట్లాడేవారు. జోకులు వేసుకునేవారు. కష్టసుఖాలు చర్చించేవారు. అందరూ కలిసి టీ తాగేవారు. కానీ, ఇప్పుడు పట్టుమని ఐదుగురు కూడా ఆ షాపులో లేరు.

ఒకే ఒక్క ముస్లిం

హసన్‌ ఇప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒకే ఒక్క ముస్లిం. అంతకుముందు అక్కడ 15 ముస్లిం కుటుంబాలు ఉండేవి. వారి ఇళ్లు, జీవనోపాధి అక్కడే. హసన్‌ అక్కడే పుట్టి పెరిగాడు. ఉత్తరప్రదేశ్‌ నుండి వాళ్ల తాత ఇక్కడికి వలసవచ్చిన మొదటి ముస్లిం వ్యక్తి. ఆ తరువాత మరికొన్ని కుటుంబాలు ఇక్కడకి చేరాయి. హిందూ కుటుంబాలతో కలిసి ఈ ముస్లిం కుటుంబాలు పండుగలు జరుపుకునేవి. ఈద్‌, దీపావళికి ఒకరి ఇంటికి ఒకరు అతిథులుగా వెళ్లేవారు. హిందూ వ్యక్తులు మరణిస్తే అంతిమ సంస్కారాలకి అవసరమయ్యే సామగ్రిని ముస్లిములు సమకూర్చేవారు. తన స్నేహితుని కుటుంబ వ్యక్తి ఒకరు చనిపోయినప్పుడు అతని శవాన్ని మోసిన వ్యక్తుల్లో హసన్‌ కూడా ఉన్నాడు. ఇంత సామరస్య వాతావరణం గత ఏడాది సెప్టెంబరు నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ముస్లిం వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది.

కోవిడ్‌ నుండే మొదలైంది!

అక్కడి పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షి అయిన హసన్‌ వాటిని ఇలా వివరించాడు. ‘ఓ హిందూ యువతిని, ముస్లిం వ్యక్తి వేధించాడని ఆరోపణ వచ్చింది. అయితే ఆ ఆరోపణ మొత్తం కమ్యూనిటీకి నెట్టివేశారు. ఈ ద్వేషం ఒక్కసారిగా వచ్చింది కాదు. కోవిడ్‌ సమయం నుంచి మెజార్టీ ప్రజలు మైనార్టీలపై కోపంగా ఉన్నారు. ‘వందలాదిగా ముస్లిం వ్యక్తులు గుమికూడి సమావేశాలు నిర్వహించారని, అందువల్లనే కోవిడ్‌ వేగంగా పెరిగింద’ని అప్పట్లో కొంతమంది పనికట్టుకుని మరీ ప్రచారం చేశారు. అప్పటి నుంచి వారి మనసుల్లో నాటుకుపోయిన విషం ఈ ఘటనతో ఒక్కసారిగా పైకి వచ్చింది. వాస్తవానికి ఆరోపణలు వచ్చిన తరువాత రోజు ఆ యువతికి మద్దతుగా, ముస్లిం వ్యక్తికి వ్యతిరేకంగా కొంతమంది ర్యాలీ చేశారు. అందులో మేం కూడా పాల్గొన్నాం’ అని హసన్‌ చెప్పాడు.

ఆ రోజు జరిగిన ర్యాలీలో ముందు వరుసలో కొంతమంది వ్యక్తులు అన్సర్‌ అనే ఓ ముస్లిం వ్యక్తిని చావబాదారు. వేధింపులు చేసిన యువకుడికి సహాయం చేశాడని అతడిని విచక్షణారహితంగా కొట్టారు. అలా చేస్తున్నప్పుడే వారిలో కొంతమంది హిందూ వ్యక్తులు బిగ్గరగా అరుస్తూ ముస్లిం వ్యతిరేక నినాదాలు చేశారు. ‘వాళ్లని బూటు కాళ్లతో కొట్టండి.. ఎక్కడ కనిపిస్తే అక్కడ చావబాదండి’ అని పిలుపునిచ్చారు. ఒకపక్క నినాదాలు చెబుతుండగానే రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన గుంపులో ఉన్న ఇతర ముస్లింలు తలోదిక్కూ పారిపోయారు. వారిలో హసన్‌ కూడా ఉన్నాడు. తరువాత ఆ గుంపు ముస్లిం ఇళ్లపై దాడి చేసింది. వారి షాపులను ధ్వంసం చేసింది.
ఆ రోజును హసన్‌ ఇలా గుర్తు చేసుకున్నాడు. ‘అందరూ మా ఇంటి పైభాగంలో తలదాచుకున్నారు. ఆ క్షణాలు ఇప్పుడు తలుచుకున్నా వణుకు పుడుతుంది. సహాయం కోసం పోలీసులకు, మా హిందూ స్నేహితులకు ఫోన్‌ చేశాం. ఎవరూ స్పందించలేదు. అర్ధరాత్రి దాటిన తరువాత నేను నా షాపుకి వెళ్లాను. షాపులో సామానంతా రోడ్డుపై పడేశారు. పిల్లల పెళ్లికని దాచుకున్న రూ.4 లక్షల సొమ్మును కూడా దోచుకెళ్లారు’ అని హసన్‌ బాధగా చెప్పాడు.

రక్షించలేమని చెప్పారు

ర్యాలీ జరిగిన మరుసటి రోజు హిందూ గ్రూపులకు చెందిన కార్యకర్తలు వేలాదిగా నందనగర్‌ వచ్చారు. 60, 70 మంది పోలీసులు గస్తీ నిర్వహించారు. అయితే ఈ పోలీసులు ముస్లిం వ్యక్తులకు రక్షణ కల్పించలేమని చేతులెత్తేసారు. ‘మీ ప్రాణాలను మీరే రక్షించుకోండి. వీలైనంత దూరం పారిపోండి సహాయం చేస్తాం’ అన్నారని హసన్‌ గుర్తుచేసుకున్నాడు.
గ్రూపు సభ్యుడు చేసిన హింసాత్మక, మతోన్మాద ఉపన్యాసం తరువాత ఆ వ్యక్తులు చేసిన బీభత్యానికి ముస్లిం వ్యక్తులు ఊకుమ్మడిగా ఊరు వదిలి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు దగ్గరుండి మరీ జీపుల్లో వారిని నగరం వెలుపల విడిచిపెట్టారు.
ఆ రోజుతో నందనగర్‌లో వాళ్ల జీవితాలు తెల్లారినట్లే అని ఆ ముస్లిం కుటుంబాలు భావించాయి. కానీ హసన్‌ అలా ఊరుకోలేకపోయాడు. అప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో ఇలా చెప్పాడు. ‘నా గుర్తింపు ఇక్కడే ఉంది. ఇదే నా నివాసం. ఉన్నట్లుండి ఈ ప్రాంతం, ఈ ఇల్లు నాది కావంటే నేను ఎక్కడికి వెళ్లాలి? నా కుటుంబం ఏమై పోవాలి? అని బాగా ఆలోచించాను. కొన్ని రోజుల తరువాత రక్షణ కల్పించమని అయ్యూమ్‌ అనే వ్యక్తితో కలిసి కోర్టులో పిటిషన్‌ వేశా. తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. కానీ..’ అంటూ హసన్‌ బాధగా నిట్టూర్పు విడిచాడు.

నేను భూతంలా కనిపిస్తున్నాను

తీర్పు తరువాత హసన్‌ ఒక్కడే నందనగర్‌ చేరుకున్నాడు. భయంతో మిగిలిన వారు ఎవ్వరూ రాలేదు. భార్య నలుగురు పిల్లలతో ఇంటికి వెళ్లిన హసన్‌ ఇప్పుడు రోజూ బాధపడుతున్నాడు. అతని షాపుకి ఎవ్వరూ రావడం లేదు. అసలు ఎవ్వరూ అతనితో మాట్లాడడం లేదు. ఈ పరిస్థితి గురించి చెబుతూ.. ‘నేను ఇప్పుడు ఇక్కడ అందరికీ భూతంలా కనిపిస్తున్నాను. నా కుటుంబంతో కలసి ఇంతకుముందులా స్వేచ్ఛగా బయటికి వెళ్లలేకపోతున్నా. మా అమ్మాయిని తన పక్కన కూర్చోవద్దని స్నేహితులు అంటున్నారు. స్కూలుకు వెళ్లడానికి ఆ పిల్ల ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితులు ఎంత దూరం తీసుకెళతాయో అర్థం కావడం లేదు’ అని వాపోతున్నాడు. హసన్‌ పడుతున్న ఈ బాధ ఎందరో ముస్లింలది!

➡️