మంచి స్నేహం

Dec 10,2024 03:33 #chinnari, #feachers, #jeevana, #katha

ఒక ఊరిలో ప్రవళిక, వెన్నెల అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారిద్దరూ ఎప్పుడూ కలిసే పాఠశాలకు వెళ్లేవారు. టీచర్లు చెప్పే పాఠాలను ఎప్పటికప్పుడు చదివేవారు. ఆటలు ఆడే సమయంలో ఎవరు గెలిచినా సంతోషపడేవారు. పరీక్షల్లో మార్కులు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ వచ్చినా ఒకరినొకరు అభినందించుకునేవారు.
ఒకరోజు ఆ పాఠశాలకు నేహ వచ్చింది. తనతో ప్రవళికకు స్నేహం కుదిరింది. ఆ రోజు నుంచి వెన్నెలను పట్టించుకోవడం మానేసింది. పాఠాలు వినడం మానేసి నేహ, ప్రవళిక ముచ్చట్లు పెట్టేవారు. ఈసారి పరీక్షల్లో ప్రవళికకు మార్కులు బాగా తక్కువ వచ్చాయి.
స్నేహితురాలు చదువులో వెనకబడడం చూసి వెన్నెల చాలా బాధపడింది. ఒకరోజు ప్రవళిక వద్దకు వెళ్లి ‘ప్రవళిక, నువ్వు టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడం లేదు. ముచ్చట్లు పెడుతూ కూర్చుంటున్నావు. అందుకే నీకు మార్కులు తక్కువగా వచ్చాయి. ఇకనైనా చదువుపై శ్రద్ధ పెట్టు. నేహని కూడా బాగా చదువుకోమని చెప్పు’ అని చెప్పింది. అయినా వెన్నెల మాటలు ప్రవళిక వినిపించుకోలేదు.
రోజురోజుకీ నేహ, ప్రవళిక చదువులో బాగా వెనకబడిపోయారు. ఇలాగే ఉంటే స్నేహితురాలు తనకి దూరమవుతుందని వెన్నెల గ్రహించింది. ఒక రోజు నేహతో మాట్లాడాలని చెప్పి, ప్రవళిక ఇంటి దగ్గరికి తీసుకెళ్లింది. ఆ రోజు ప్రవళిక స్కూలుకి రాలేదు. ‘ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు. నాకు చాలా పని ఉంది. త్వరగా చెప్పు’ అని నేహ నిర్లక్ష్యంగా అంది. అప్పుడు వెన్నెల ప్రవళిక ఇంటి వైపు చూపించింది. అది ఓ చిన్న మట్టి ఇల్లు. ‘ఆ ఇంట్లో ప్రవళిక అమ్మానాన్న, తాత, అవ్వ, అక్క, తమ్ముడు అందరూ ఉంటారు. పెద్ద వాళ్లందరూ కూలీకి వెళతారు. ప్రవళిక ఒక్కత్తే చదువుకుంటోంది. వాళ్ల అక్క, తమ్ముడిని చూసుకునేందుకు చదువు మానేసింది. ఈ పరిస్థితుల్లో ప్రవళికకి చదువు చాలా ముఖ్యం. ఒకప్పుడు నాతో పోటీపడి మరీ చదివేది. మార్కులు బాగా వచ్చేవి. కానీ ఇప్పుడు అలా లేదు. అది చదువులో బాగా వెనకబడిపోయింది. నాకు తెలిసి మీ అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నీకు కూడా చదువు విలువ తెలుసు. కానీ నువ్వు చదువుని బాగా అశ్రద్ధ చేస్తున్నావు. నీతో స్నేహం చేసి ప్రవళిక కూడా మారిపోయింది. ఇకనైనా మీరిద్దరూ చదువుపై శ్రద్ధ పెట్టండి. ప్రవళిక రోజురోజుకీ చదువులో వెనకపడిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో తెలియకే నిన్ను ఇక్కడికి పిలిచాను’ అని వెన్నెల ఏడుస్తూ చెప్పింది.
అప్పుడే బజారుకి వెళ్లి తిరిగి వచ్చిన ప్రవళిక ఈ సంభాషణ అంతా విన్నది. తన కోసం స్నేహితురాలు ఇంతలా ఆలోచిస్తున్నందుకు ఎంతో సంతోషపడింది. తన తప్పు తెలుసుకుంది. ఆ రోజు నుండి నేహలో కూడా చాలా మార్పు వచ్చింది. చదువుపై శ్రద్ధ పెట్టింది. ఇప్పుడు ప్రవళికతో పాటు నేహ కూడా వెన్నెలతో స్నేహం చేస్తోంది.

– గుంజ వెన్నెల, 7వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కోదాడ,
సూర్యాపేట జిల్లా, తెలంగాణ.

➡️