గుండెలు పులకించు

Apr 2,2024 06:20 #feachers, #jeevana, #kavithalu

గోదారి చూద్దాము ఎక్కండి నావ
బలము పెరుగేనులే తాగండి జావ
మొదలు ముదిరిన చెట్టుకుంటుంది చేవ
పదిమంది నడిచేది అసలైన త్రోవ

గోడ బీటలు బారు మొలిస్తే రావి
మల్లెపూలకు ఉండులే మంచి తావి
నీరు చుట్టున ఎత్తు దిబ్బే దీవి
ఊరికుపకారమోరు, తవ్వండి బావి

కాకి చెబుతుందట చుట్టాల రాక
బంధాలు పెరుగునా? మనమింక పోక
గొర్రుకుంటుందట బెత్తెడే తోక
పొదుపు చేయాలండి, రోజుకో రూక

కావు కావంటుంది చూడండి కాకి
అడవి మార్మ్రోగగా అరచేను కేకి
అనందమౌతుంది మన చెవిని తాకి
గుండెలే పులకించు, ఆ ధ్వనులు సోకి ..!

– కిలపర్తి దాలినాయుడు
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రామభద్రపురం

➡️