మలి సంధ్యలో ‘హ్యాపీ సీనియర్స్‌’

Feb 21,2024 11:00 #feature

కుటుంబం, పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్లు, మనవరాళ్లు, మనవళ్లతో మూడొంతుల జీవితం అనుభవించేసిన పెద్దలను ప్రేమగా పలకరించే వారే ఈ రోజుల్లో కరువవుతున్నారు. ముఖ్యంగా జీవితభాగస్వామిని కోల్పోయిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. జీవితకాలం తోడుగా నిలిచిన ఆ సాహచార్యం లేక ఎంతోమంది మానసికంగా కృంగిపోతారు. తీవ్ర ఒత్తిడితో సతమతమవుతుంటారు. ఒక పక్క అనారోగ్య సమస్యలు, మరోపక్క భాగస్వామి లేని లోటు వారిని తీవ్రంగా బాధిస్తుంది. అయితే అలా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు ‘హ్యాపీ సీనియర్స్‌’ నిర్వాహకులు మాధవ్‌ దామ్లే. పూనెకి చెందిన మాధవ్‌ 2010లో వృద్ధుల కోసం ఓ ఆశ్రమం ప్రారంభించారు. కాలక్రమేణా అది వృద్ధుల సహజీవన కేంద్రంగా మారిపోయింది. ఈ విషయం వినడానికే చాలామంది ఇష్టపడరు. యువతీయువకులు సహజీవనం చేస్తుంటే చాటుగానైనా విమర్శలు చేస్తారు గానీ, అదే వృద్ధాప్యంలో ఆ పని చేస్తే.. మొహం మీదే అవమానిస్తారు. కానీ మాధవ్‌ ఈ పెద్దవాళ్లకి ఆ పరిస్థితులు రానివ్వరు. సమాజంలో వారు గౌరవంగా జీవించే సదుపాయాలు కల్పిస్తారు. పెద్దవాళ్ల సాహచర్యంలో ఉన్న ప్రేమను ఉన్నతంగా చూపిస్తారు.

                అనిల్‌ యార్ది, అశ్వారీ కులకర్ణి 60 ఏళ్లు దాటిన వారు. భాగస్వాములను కోల్పోయి, మాధవ్‌ స్థాపించిన వృద్ధాశ్రమంలో చేరారు. అక్కడే ఒకరికొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. 2015లో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో పెద్ద సంచలనం. దీనికంతటికీ కారణం మాధవ్‌. ఆధునిక పోకడకి అద్దం పట్టిన సంఘటనగా ఈ విషయంపై మీడియా కోడై కూసింది. సర్వీస్‌ ఇంజినీర్‌గా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మాధవ్‌కి సామాజిక సేవ ఇష్టమైన వ్యాపకం. అందులో భాగంగానే ప్రతి రోజూ అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లేవారు. ‘నేను ఎన్నో వృద్ధాశ్రమాలకు వెళ్లాను. వాళ్లకి కావాల్సిన ఆహారం, దుప్పట్లు, బట్టలు, వస్తువులు వంటివి ఇచ్చేవాళ్లం. వాటిని అందించేటప్పుడు వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయేవి. అయితే అదంతా ఆ ఒక్క క్షణమే. ఆ తరువాత ఏదో వెలితి వాళ్లల్లో కనిపించేది.

 

అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. వాళ్లు సంతోషంగా ఉండేందుకు ఏదైనా చెయ్యాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’ అని సంస్థ ఆవిర్భావ రోజులని మాధవ్‌ గుర్తు చేసుకున్నారు. అనుకోవడమే తరువాయి, తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న శతాబ్దం చరిత్ర ఉన్న ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చేశారు. వృద్ధాశ్రమం ప్రారంభించిన తొలి రోజుల్లో మా బంధువుల్లో ఒకాయన, కొడుకుతో గొడవపడి, నిద్రమాత్రలు మింగేశాడు. ఆస్పత్రిలో చేర్చించామని చెప్పినా కొడుకు రాలేదు. చాలా రోజులు ఆయన కోలుకోలేదు. మేమే అన్నీ దగ్గరుండి చూసుకున్నాం. ఆ సంఘటనే నన్ను ‘హ్యాపీ సీనియర్స్‌’కు ప్రేరేపించింది. సాహచర్యం వల్ల వృద్ధుల్లో నెలకొన్న అనేక రుగ్మతలను పారద్రోలవచ్చని నిర్ణయించుకున్నాను. అయితే అదంత తేలికైన విషయం కాదు. సాహచర్యం గురించి నేను ప్రస్తావించిన ప్రతిసారీ చాలా మంది విముఖత చూపించారు. మాట్లాడగా, మాట్లాడగా ఒప్పుకున్నారు. తగిన భాగస్వామిని వెతికి పెట్టడం నాదే బాధ్యతని వాళ్లకి చెప్పాను. ఏడాది తరువాత ఓ ఇద్దరు వృద్ధులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలా మొదలైన ఈ ప్రయాణంలో ఇప్పటి వరకు 75 జంటలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.

‘మళ్లీ పెళ్లి సమస్యకు పరిష్కారం కాదు. కానీ సాహచర్యం వాళ్లని ఆనందంగా ఉంచుతుంది. అందుకే నేను ముందుగా వాళ్లని ఒకరినొకరు అర్థం చేసుకొమ్మని చెబుతాను. ఇష్టాయిష్టాలు తెలుసుకోమంటాను. అన్నీ నచ్చిన తరువాతనే వివాహానికి సిద్ధమవ్వమని చెబుతాను. అంతేకాదు, ఈ వివాహానికి పిల్లల అనుమతి తప్పక ఉండాలని షరతు పెడతాను. అలాగే పురుష భాగస్వామి కచ్చితంగా తన భాగస్వామి బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమచేయాలని చెబుతాను. ఇద్దరికీ బ్యాంకు ఖాతాలుండాలని నియమం పెడతాను. అందులో ఫిక్సెడ్‌ డిపాజిట్‌ కింద కొంత మొత్తం జమచేయాలని చెబుతాను’ అని హ్యాపీ సీనియర్స్‌ నియమ నిబంధనలను ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ సంస్థ పూణెలోనే కాక, నాగపూర్‌, ముంబయి వంటి ప్రాంతాల్లో కూడా తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

➡️