నిరాశ్రయులను నిలబెడుతున్నాడు..

Feb 16,2024 07:03 #Jeevana Stories, #services
He is supporting the homeless.snehan

ప్రతి రోజూ మన చుట్టూ ఎంతోమంది నిరాశ్రయులు కనిపిస్తుంటారు. నిలువ నీడ లేక చెట్ల కింద, పుట్‌పాత్‌లపై నిద్రించేవారిని బోలెడుమందిని రోజూ చూస్తుంటాం. ఆ క్షణం ఆ వైపు చూపు తిప్పినా, మరు క్షణమే మన పనిలో బిజీ అయిపోతాం. మరి అటువంటి వారిని పట్టించుకునేది ఎవరు? వారికి ఆశ్రయం కల్పించేది ఎవరు? నిధులు సేకరించి నిరాశ్రయులను ఆదరించే సంస్థలు చాలా ఉంటాయి. కానీ సొంత ఉత్పత్తులతో నిధులను సమీకరించుకుని సాయం చేసేవి చాలా తక్కువ. అటువంటి వాటిలో ఒకటే పుదుచ్చేరిలోని ‘స్నేహన్‌’. సి.అనుముత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆ సంస్థ ఆపన్నులకు ఆసరా ఇవ్వడమే కాక, ఆర్థికంగా ఎదిగేలా ఉపాధి మార్గాలు కూడా చూపిస్తోంది.

సంస్థ నిర్వాహకుడు అనుముత్తు పేదరిక కుటుంబం నుండి వచ్చారు. ఏడేళ్ల వయస్సులో తండ్రిని పోగొట్టుకున్న ఆయన చిన్న వయసులోనే బాలకార్మికునిగా పనిచేశాడు. ‘అమ్మతో పాటు నేను రోజు కూలీకి వెళ్లిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తే. అమ్మకు రోజుకు రూ.6, నాకు రూ.4 జీతం ఇచ్చేవారు. ఆ కొద్ది మొత్తంతోనే నేను, అమ్మ, చెల్లి, తమ్ముడు జీవించేవాళ్లం. పని లేనప్పుడు పస్తులతోనే గడిపేవాళ్లం. వేసవిలో పని దొరక్క చాలా రోజులు ఉండిపోయేవాళ్లం. ఆకలి తట్టుకోవడానికి చేలో వేరుశనగ గింజలు దొంగిలించడం కూడా నాకు ఇప్పటికీ గుర్తే’ అంటూ తన చిన్ననాటి అనుభవాన్ని అనుముత్తు గుర్తుచేసుకున్నారు.

తినడానికి తిండి లేని కుటుంబం నుండి వచ్చిన అనుముత్తు ఇప్పుడు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం వెనుక గొప్ప ఆశయం దాగుంది. ‘నేను ఉచిత భోజనం, బట్టలు కోసమే స్కూలుకి వెళ్లేవాడ్ని. కానీ రోజూ స్కూలుకి వెళితే అమ్మ ఒక్కత్తే పనికి వెళ్లాల్సివస్తుందని చదువు మధ్యలోనే ఆపేశాను. అటువంటి పరిస్థితుల్లో ఓ చర్చి ఫాదర్‌ నన్ను అక్కున చేర్చుకున్నాడు. చదువు చెప్పించాడు. బోర్డింగ్‌ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి, హైద్రాబాద్‌కి వెళ్లి ఐటిఐలో ఎలక్ట్రికల్‌ స్ట్రీమ్‌ నేర్చుకున్నాను. నాకు మల్టీమీడియా అంటే ఇష్టం. దీంతో తిరుచ్చికి తిరిగివచ్చి, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా శిక్షణ తీసుకున్నాను. ఈ ప్రయాణంలో నాకు ఎంతోమంది నిరాశ్రయులు తారసపడ్డారు. రోడ్డు మీద యాచన చేసేవారు, ఆహార పొట్లాల కోసం ఎదురుచూసే వాళ్లు, హోటల్లో పనిచేసే పిల్లలు ఇలా చాలామంది కనిపించేవారు. వారందరిలో నన్ను నేను చూసుకునేవాడ్ని. నాకు ఎవరో ఆశ్రయం ఇస్తే నేను ఈ స్థితికి వచ్చాను. కాబట్టి వీరికి కూడా ఇంకెవరో ఆసరా ఇస్తారు అని సర్దిపెట్టుకోలేకపోయాను. వారిలో కొంతమందినైనా నేను పడిన బాధలు పడకుండా చేయాలి అని గట్టిగా అనుకున్నాను. అందులో భాగంగానే 2008లో ‘స్నేహన్‌’ సంస్థను ప్రారంభించాను’ అని సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న ఆశయాన్ని వివరించారు.

‘స్నేహన్‌’ ప్రత్యేకత ఏంటంటే.. నిధుల సేకరణ కోసం విద్యాసంస్థలతో అనుసంధానమై సొంతంగా పత్తి ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈ ఆదాయంతో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తోంది. ‘ఆసరాగా నిలవడం అంటే వారికి ఆహారం, వసతి, వైద్యం, విద్య సమకూర్చడంతో సరిపెట్టకుండా, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేలా చేయడం’ అంటున్న అనుముత్తు సంస్థ నిర్వహణ కోసం తన జీవితాన్నే అంకితం చేశారు.

చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న 67 ఏళ్ల రవికుమార్‌ని ఆస్పత్రిలో చేర్చించి, వైద్యం అందించారు. కోలుకున్న తరువాత కూడా అతని సంరక్షణ కోసం ఓ కేర్‌టేకర్‌ని ఏర్పాటు చేశారు. అలాగే 55 ఏళ్ల ఆటోడ్రైవర్‌ సుందర్‌ ఓ ప్రమాదంలో కన్ను, చేతివేళ్లను పోగొట్టుకుని నిరాశ్రయుడు అయ్యాడు. అతనికి వైద్యం చేయించి, ఓ సంచుల దుకాణం పెట్టించారు. ‘ఒకప్పుడు సుందర్‌ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆకలికి ఉండలేక కనిపించిన వారినల్లా సాయం చేయమని అర్థించేవాడు. కానీ ఇప్పుడు సుందర్‌ ఆ వీధిలో గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నాడు. రోజుకు రూ.300 సంపాదిస్తున్నాడు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ అనుముత్తు చెబుతున్నారు. సంస్థ తరపున అనుముత్తు ఎంతోమందికి ఆశ్రయం కల్పించారు. మహిళలకు కుట్టు మిషను నేర్పించి, వాళ్లతో సొంతంగా షాపులు పెట్టించారు. పత్తి ఉత్పత్తులను తయారుచేసే బృందాలుగా వారిని తయారు చేశారు. ఇంకా టీస్టాళ్లు పెట్టించారు. హోటళ్లు, చిల్లర దుకాణాలు, సైకిళ్లు ఇలా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రతి అవకాశాన్నిఅందించారు. ‘ఆశ్రయం అంటే జీవితానికి భరోసా కల్పించడం’ అని చెబుతున్న అనుముత్తు జీవితం స్ఫూర్తిదాయకం.

➡️