ఏటేటా జాతీయ నులి పురుగుల నిర్మూలనా దినోత్సవం (ఎన్‌డిడి)ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖల నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమం. అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో (ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు) చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 మి.గ్రాముల నమలగల మాత్రను ఏడాదికి రెండుసార్లు ఇస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వటం ద్వారా 1 నుంచి 19 సంవత్సరాల పిల్లల్లో మట్టిద్వారా వ్యాపించే నులి పురుగుల (ఎస్‌టిహెచ్) సంక్రమణను నివారించవచ్చు. రాష్ట్రంలో నులిపురుగుల వ్యాప్తి ప్రస్తుతం 34 శాతం ఉంటూ ప్రజారోగ్య సమస్యగా మారుతున్నందున వాటి నివారణే లక్ష్యంగా కృషి జరుగుతోంది.
నులిపురుగుల నిర్మూలన వల్ల …
- రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
- పోషకాహార వినియోగాన్ని పెంచుతుంది
- రక్తహీనతను నియంత్రిస్తుంది
- నులిపురుగుల సంక్రమణను తగ్గిస్తుంది
పిల్లల్లో ఏకాగ్రత, హాజరును పెంచుతుంది. తద్వారా పని సామర్థ్యం, జీవనోపాధి అవకాశాల్లో మెరుగుదల కన్పిస్తుంది.
నులి పురుగుల నిర్మూలనా చికిత్స సురక్షితమైన చికిత్సగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. రాష్ట్రంలో జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవాన్ని 2016 నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్‌డిడి 19వ విడత కార్యక్రమాన్ని ఈనెల 10న అమలు చేస్తున్నాం. ఆ తర్వాత 17న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాప్ అప్ డే (ఎంయుడి) నిర్వహిస్తాం.
ఎన్‌డిడి కోసం లక్ష్యంగా పెట్టుకున్న పిల్లల వివరాలు ఇవీ…
- అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు : 21,92,088 మంది
- అంగన్వాడీల్లో నమోదు కాని పిల్లలు : 52,2024 మంది
- విద్యాసంస్థల్లో ఉన్న 6 నుంచి 19 సంవత్సరాల పిల్లలు (ప్రభుత్వ, ప్రయివేటు): 86,06,771 మంది
- బడిబయట ఉన్న పిల్లలు 4,34,141 మంది
మొత్తంగా రాష్ట్రంలో 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలు కలిపి 1,12,95,092 మందికి ఈ మాత్రలు పంపిణీచేయటమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
మాత్రలు పంపిణీ ఇలా…
ఆల్బెండజోల్ మాత్రలను అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పంపిణీ చేస్తారు.
1-2 సంవత్సరాల పిల్లలకు సగం టాబ్లెట్
2-3 సంవత్సరాల వయస్సు గలవారికి రెండు చెంచాల మధ్య పూర్తి టాబ్లెట్‌ను చూర్ణం చేసి నీటితో కలిపి ఇస్తారు.
3-19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి పూర్తిటాబ్లెట్‌ను ఇస్తారు. పిల్లలు మాత్రమే సరిగ్గా నమిలి మింగేలా చూడాలి.
ముందస్తుగా అవగాహనా కార్యక్రమాలు
రాష్ట్రప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినానికి ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర కేంద్రం నుంచి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాలు, అక్కడి నుంచి మండల పరిషత్ డెవలప్‌మెంట్ అధికారి (ఎంపిడిఒ)లు, అక్కడి నుంచి ఎఎన్‌ఎంలకు మాత్రలను అందించే ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వారు మందుల పంపిణీని సులభంగా చేసే యంత్రాంగాన్ని ఏర్పాటుచేశాం. ఇప్పటికే గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగానూ, వివిధ వయస్సుల వారీగానూ ఆయా ప్రాంతాల్లో పిల్లల గణాంకాలను సేకరించాం. ఆ సంఖ్యకు అనుగుణంగా మందుల పంపిణీకి పగడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మందులు, వాటికి అవసరమైన సామగ్రి, రిజిష్టర్లు, మందులు తీసుకున్న పిల్లల వివరాలు ఇలా అన్నీ పక్కాగా నమోదు చేస్తాం. పిల్లలకు అవసరమైన సురక్షితమైన తాగునీరు, శుభ్రమైన చెంచాలు (స్ఫూన్లు) సైతం అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేశాం.
అవగాహనా కార్యక్రమాలు
ప్రభుత్వ పరంగా నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం రోజున ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఆరోజున ముఖ్యమైన ప్రాంతాల్లో అవగాహన కోసం ప్రత్యేక వీడియోలు కూడా ప్రదర్శించే ఏర్పాట్లు జరిగాయి. ఇంకా మీడియా, వాట్సాఫ్, ఫేస్‌బుక్, ఎక్స్‌ఖాతా, ఇన్‌స్టా తదితర ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 30, 60 సెకన్ల రేడియో సందేశాలు వినిపించే ఏర్పాట్లు చేశాం. తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి
ఈనెల 10న అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లోని పిల్లలందరికీ వారి వయస్సు ప్రకారం సూచించిన మోతాదు ప్రకారం మాత్రలు అందుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు 400 మి.గ్రా మాత్రలు తీసుకునేలా చూడాలి. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు సైతం ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఆరోగ్య సిబ్బంది మాత్రలు ఇవ్వటానికి వచ్చినప్పుడు అనుమతించాలి. ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం ప్రజా రవాణా సౌకర్యాల వద్ద ప్రత్యేక బూత్‌లు, కౌంటర్లు ఏర్పాటుచేశాం. ఆరోజున అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో మాత్రలు వేసుకోలేని వారికి మరో అవకాశంగా ఈనెల 17న వేసుకునే వెసులు బాటు కూడా కల్పించాం. మాత్రల పంపిణీని పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశాం.
ఏదైనా సమస్యలొస్తే…
ప్రతి అంగన్వాడీ కేంద్రం, పాఠశాల సమీపంలోని పిహెచ్‌సి కేంద్రాల్లో ఎఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. తేలికపాటి దుష్ప్రభావాలైన వికారం, వాంతులు, విరేచనాలు లేదా బలహీనత వంటివి ఉండొచ్చు. ఇవి పెద్ద సమస్యలేమీ కావు. త్వరగానే తగ్గిపోతాయి. పరిస్థితి విషమంగా ఉంటే 104, 108 సేవలను వినియోగించుకోవాలి. మాత్ర గొంతులో ఇరుక్కోవటం దుష్ప్రభావం కాదు. అలాంటి పరిస్థితి వస్తే పిల్లలను ఒడిలో బోర్లా పడుకోబెట్టుకుని తల కిందికి దించి వీపుపై తట్టడం చేయాలి.
– జి.వీరపాండ్యన్, కమిషనర్,
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, డైరెక్టర్, జాతీయ మిషన్, మంగళగిరి.
- సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు