ఒకసారి పొలంలో బావి తవ్వుదామని ఓ రైతు మనుషుల కోసం వెతికాడు. ఎవరూ ముందుకు రాలేదు. చేసేదేమీ లేక, తానే బావి తవ్వుకునేందుకు సామగ్రి తెచ్చుకున్నాడు. రోజుకు కొంత మేర కొన్ని అడుగుల లోతు తవ్వుకున్నాడు. ఆ సమయంలోనే అడవిలో చెలమలన్నీ ఎండిపోయి, నీళ్ళు లేక జంతువులన్నీ అలమటించసాగాయి.
నీళ్ళు ఎక్కడ ఉన్నాయో కనుక్కోమని నక్కకు ఆ పని పురమాయించింది సింహం. నక్క వెంటనే అడవి అంతా గాలించింది. ఒక చోట దూరంగా ఏవో శబ్ధాలు వినపడితే ఆవైపు వెళ్ళి చూసింది. అక్కడ రైతు ఒంటరిగా బావి తవ్వుతున్నాడు. సాయంత్రం వరకు తవ్వి అలసిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. పనిముట్లు అక్కడే వదిలేశాడు. వెంటనే ఈ వార్త జంతువులకు చెప్పింది నక్క. అవన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఒక్కో పని ముట్టు తీసుకుని రాత్రంతా శ్రమించి బాగా లోతు తవ్వాయి. నీళ్ళు బుడ బుడ మని పొంగాయి. అవన్నీ కేరింతలు కొడుతూ దాహం తీర్చుకుని వెళ్లాయి. ఉదయం రైతు వచ్చి చూడగానే బావి నీళ్ళతో నిండిపోయింది. అక్కడ చిత్తడిచిత్తడిగా ఉన్న నేలలో జంతువుల పాద ముద్రలు కనిపించాయి. మనుషుల శ్రమతో సమానంగా జంతువులు కష్టపడ్డాయని రైతు గ్రహించాడు. అవి చేసిన సాయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పాడు.
– కనుమ ఎల్లారెడ్డి, అమెరికా, 93915 23027.