ఓ చిన్న పూలతోటలో ఒక సీతాకోక చిలుక వచ్చి పూవు మీద వాలింది. దానికి కాస్త పక్కగా ఓ తూనీగ కూడా వాలింది. దానివైపు కాస్త చిరాకుగా ముఖంపెట్టి, ‘ఏంటి నా పక్కనే వాలాలనిపించిందా? అటు పక్కగా బోలెడు పూల మొక్కలు ఉన్నాయి కదా?’ అని అంది సీతాకోకచిలుక. తూనీగ ఏమీ అనకుండా అక్కడ నుండి ఎగిరిపోయింది.
ఒక రోజు ఆ సీతాకోకచిలుక పూల మీద వాలుతూ కొమ్మలకున్న సాలెగూడులో చిక్కుకుంది. బయటకు రావడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. సీతాకోకచిలుక గూడులో చిక్కుకున్నది ఆ తూనీగ చూసింది. వెంటనే తేనెటీగ వద్దకు వెళ్లింది. ‘మిత్రమా! అటు పక్కగా సీతాకోకచిలుక సాలెగూడులో చిక్కుకుంది. నీ సాయం కావాలి’ అని అడిగింది.
‘పద..ఎక్కడుందో చూపించు’ అంది తేనెటీగ. రెండూ సీతాకొక చిలుక ఉన్న చోటుకు వచ్చాయి. తేనెటీగ ఆ సాలెగూడును చిందరవందర చేసి సీతాకోకచిలుకను గూడు నుండి బయటపడేలా చేసింది. ‘ధన్యవాదాలు మిత్రమా!’ అంది సీతాకోకచిలుక. ‘ఇందులో నేను చేసిందేమీ లేదు. నువ్వు ఆపదలో ఉన్నావని ఈ తూనీగ చెప్పింది. చాలా కంగారుగా నా దగ్గరికి వచ్చి నీకు సాయం చేయమని అడిగింది’ అంది తేనెటీగ.
సీతాకోకచిలుక తూనీగను చూసి తల దించుకుంది. ‘నన్ను క్షమించు మిత్రమా! నీకంటే నేను అందంగా ఉన్నానని గర్వపడి ఆరోజు నా పక్కన వాలొద్దు అన్నాను. అదేమీ నువ్వు మనసులో పెట్టుకోకుండా ఆపదలో ఉన్న నన్ను కాపడేలా చేశావు. నీకు కృతజ్ఞతలు’ అని అంది. సీతాకోకచిలుకలో వచ్చిన మార్పుకు తేనెటీగ సంబరపడింది. ‘హమ్మయ్య! మీ మధ్య స్నేహం కుదిరింది. నేను ఇక వెళ్లివస్తాను నేస్తాలు’ అని రివ్వున ఎగిరిపోయింది. ‘అలాగే నేస్తం!’ అన్నాయి తూనీగ, సీతాకోకచిలుక.
– యు.విజయశేఖర రెడ్డి, హైదరాబాద్.