ఒక ఊరిలో ముసలితాత ఉండేవాడు. అతనికి ఎవరూ లేరు. చేతి కర్ర సాయంతో ఇంటింటికి వెళ్లి అడుక్కొని తినేవాడు. ఒక రోజు సోని అనే 6వ తరగతి చదువుతున్న అమ్మాయి, తాతని చూసింది. తన ఇంటికి వచ్చినప్పుడల్లా తాతకి కడుపునిండా అన్నం పెట్టేది. అంతేకాక, రాత్రుళ్లు వాళ్ల ఇంటి అరుగు మీద పడుకోమని చెప్పింది. ప్రతిరోజూ తాత పగలంతా ఊళ్లు తిరుగుతూ, రాత్రుళ్లు సోనీ ఇంటి వద్ద బస చేసేవాడు. తాత కోసం సోనీ ఎదురుచూసేది కూడా. రోజూ తాత సోనీకి మంచి మాటలు, కథలు చెప్పేవాడు.
సోని ప్రతిరోజూ బడికి వెళ్ళేది. స్కూల్లో తనకి మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టేవారు. తాతతో పరిచయం అయిన దగ్గర నుండి ఆ గుడ్డుని తినకుండా తాత కోసం తెచ్చేది. ఈ విషయాన్ని ప్రీతి చూస్తుంది. మాస్టారుకు చెపుతుంది. మాస్టారు సోనిని పిలిపించి ‘గుడ్డు ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నావు’ అని ప్రశ్నిస్తారు. సోని ఏడ్చుకుంటూ, తనకి తాత పరిచయం అయిన సంగతి, గుడ్డు అతనికి ఇస్తున్న విషయం చెప్పింది. ‘అదంతా అబద్దమ’ని ప్రీతి అంది.
ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి సోనీ ఇంటికి వెళ్లారు. కొంతసేపటికి తాత అక్కడికి వచ్చాడు. సోనీ తాతతో జరిగిన విషయం చెప్పింది. అప్పుడు తాత మాస్టారుతో సోనీ చెప్పిందంతా నిజమేనని చెప్పాడు. పెద్దలకు సాయం చేయాలన్న ఆలోచన వచ్చినందుకు, సోనీని మాస్టారు ఎంతో అభినందించారు. ప్రీతి కూడా సోనీని అనుమానించానని బాధపడింది. ప్రధానోపాధ్యాయులు సోనిని మెచ్చుకొని మంచి బహుమతి అందిస్తారు.
– నరాల ప్రసన్న,
6వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బక్రిచెప్యాల, సిద్ధిపేట.