వర్షంలా పడుతున్న ఫిరంగి గుళ్ల మధ్య, పిడుగుల్లా మండిపడుతున్న బాంబు దాడులతో గాజా తల్లడిల్లుతోంది. శిథిలమవుతున్న నగరం, మాయమవుతున్న జనజీవనం అక్కడి ప్రజల భవిష్యత్తును అంధకారం చేస్తోంది. చనిపోయిన చిన్నారులు.. అవయవాలు తెగిపడిన బాలలు ఎక్కడ చూసినా కనపడుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారుల కలలు అక్కడ సమిథలవుతున్నాయి. వారి ఆశలు, కోరికలు శిథిలాల కింద ఛిద్రమవుతున్నాయి. ఈ భీకర పరిస్థితికి అద్దం పట్టే హృదయవిదారకర కథ ఒకటి అక్కడ జరిగింది. పాశవిక దాడికి ఇద్దరు స్నేహితురాళ్ల జీవితాల్లో జరిగిన పెనుమార్పులు కంటతడిపెట్టిస్తున్నాయి.
మాలక్, లుజాయన్ స్నేహితులు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇళ్లు కూడా పక్కపక్కనే.. తమ స్నేహం గురించి, దాడుల తర్వాత తమ పరిస్థితి గురించి లుజాయన్ ఇలా చెబుతోంది.
‘మాలక్ నాకు చెల్లెలు లాంటిది. తనని మొదటిసారి 2019లో చూశాను. మేమిద్దరం గాజా సిటీలోని హమామ్ స్కూల్‌లో చదువుకున్నాం. తన కుటుంబం, నేను ఉండే ఇంటికి కాస్త దూరంలోనే ఉండేది. అక్కడికి వాళ్లు కొత్తగా వచ్చారు. ఆ తరువాత తను మా స్కూల్లో చేరింది. అప్పుడు మా వయసు 9 ఏళ్లు. తనతో స్నేహం చేయాలని మొదట నేనే పరిచయం చేసుకున్నాను. ఆ రోజు నుండి మేము ఇంటి నుండి స్కూలుకి, స్కూలు నుండి ఇంటికి కలిసే వెళ్లేవాళ్లం.
మేం నడిచి వెళ్లే ప్రాంతాన్ని షేక్ రద్వాన్ అంటారు. అదే మా ప్రపంచం. దారి పొడుగునా సుందరమైన భవనాలు, స్వీట్ షాపులు ఉండేవి. అక్కడ అందరికీ ప్రతి ఒక్కరూ తెలుసు. పిల్లలంతా కలసిమెలిసి ఆడుకునేవారు.
మాలక్ చాలా నిశ్శబ్దంగా ఉండేది. సిగ్గుపడేది. బాధ్యతగా ఉండేది. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే తనతో నేను కల్పించుకుని మాట్లాడేదాన్ని. కొత్తగా స్కూలు మారింది కదా! అలవాటుపడుతుందిలే అనుకున్నా. కానీ మాలక్ స్వభావమే అదని నాకు త్వరగానే అర్థమైంది. అయితే ఎవరికైనా సాయం చేయాలంటే మాత్రం మాలక్ నాకు మరోలా కనిపించేది.
క్లాసురూంలో పిల్లలెవరైనా దిగులుగా ఉంటే మాలక్ వాళ్లదగ్గరికి వెళ్లిపోయేది. వాళ్లతో మాట్లాడేది. వాళ్లకి మద్దతుగా నిలిచేది. వాళ్ల హోంవర్క్స్ చేసేది.
మా ఇద్దరికీ మ్యాథ్స్, సైన్స్ అంటే చాలా ఇష్టం. మాలక్ నాకు అర్థం కాని లెక్కలు చెప్పేది. సంగీతం అంటే కూడా మాకు ఎంతో ప్రేమ. నేను పియానో నేర్చుకుంటే, మాలక్ సాంప్రదాయ పాలస్తీనా సంగీతం నేర్చుకుంది.
సంగీతంలో రాణించడం కంటే నర్సుగా స్థిరపడాలని మాలక్ కలలు కనేది. సంగీతం క్లాసులో మేం ఒకరికొకరం నవ్వించుకునేవాళ్లం. జోకులు వేసుకునేవాళ్లం. మాలక్ నవ్వుతుంటే ఎంత అందంగా ఉండేదో.. అయితే తన సంతోషం వెనుక ఓ విషాదం వుందని నాకు తర్వాత తెలిసింది.
సెప్టెంబరు 2023న ఒక రోజు మేము లెక్కల పరీక్ష రాసి స్కూలు గ్రౌండ్‌లో కూర్చొన్నాం. ఇంకా స్కూలు లాంగ్ బెల్ కొట్టలేదు. అప్పుడు మాలక్ చాలా విచారంగా ఉంది. తన కళ్లల్లో నీళ్లున్నాయి. అది చూసిన నేను తట్టుకోలేకపోయాను. ఏమైందని అడిగాను. అప్పుడు తను ఆకాశం వైపు చూసింది. ఆ తరువాత నావైపు తిరిగింది. ‘నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతడు పుట్టుకతోనే గుండెజబ్బుతో పుట్టాడు. నాకంటే ఒక్క సంవత్సరమే పెద్దవాడు. చాలా అనారోగ్యంగా ఉంటాడు. అతను ఎప్పుడైనా చనిపోవచ్చు’ అని చెప్పి బోరున ఏడ్చింది. అప్పుడు నేను తనను ఓదార్చాను. ‘ఎవరికి తెలుసు మాలక్, మనం అతనికంటే ముందే చనిపోవచ్చు.. చావుకి వయసుతో సంబంధం లేదు కదా!’ అని అన్నాను. ఆ మాటలు చాలా త్వరగానే నిజమవుతాయని నాకు అప్పుడు తెలియదు.
ఆరోజు మేము గంటల తరబడి మాట్లాడుకున్నాం. మాలక్ తన కుటుంబం గురించి ఎన్నో విషయాలు చెప్పింది. అనారోగ్యంతో ఉన్నవారికి, ముఖ్యంగా పిల్లలకు బాగా చూసుకోవాలని చెప్పింది. ఆమె ఎంతో దయతో మాట్లాడుతుంటే తను కచ్చితంగా నర్సు అవుతుందని నేను బలంగా అనుకున్నాను.
యుద్ధం ప్రారంభమైనప్పుడు, నేను, మాలక్ విడిపోయాం. కుటుంబాలతో కలసి వేర్వేరు ప్రాంతాలకు తరలిపోయాం. నగరం వదిలేయాల్సి వచ్చింది. శరణార్థ శిబిరాలే మా నివాసప్రాంతాలయ్యాయి. ప్రస్తుతం మేం రఫాలో తలదాచుకుంటున్నాం. ఇక్కడి నుండే నా అనుభవాలు రాస్తున్నాను. ఈ ప్రయాణంలో మాలక్‌ని కలుసుకోవాలని నేను ఎంతో ప్రయత్నించాను. కానీ తన ఫోను నెంబరు పనిచేయలేదు. ఆగస్టు 3, 2024న మా స్కూలు శరణార్ధులకు ఆశ్రయంగా మారిందని తెలుసు కున్నాను. అప్పుడు కూడా మాలక్‌ని కలవలేక పోయాను.
ఎట్టకేలకి తనతో మాట్లాడాను..
ఏడాది తర్వాత 2025 జనవరిలో ఓ రోజు ఉదయం నాకు ఫోను వచ్చింది. మాలక్ చేసింది. ఎంతో ఆతృతగా నాతో మాట్లాడింది. నేను కూడా తను, తన కుటుంబ బాగోగులు అడిగాను. నేను ఉంటున్న శిబిరానికి కొంచెం దూరంలోనే తను కూడా తలదాచుకుంటున్నట్లు మాలక్ చెప్పింది. ప్రయాణం చేసి చేసీ అలసిపోయామని చెప్పింది. ఆ రోజు మేము మాట్లాడుకుంటున్నప్పుడు మేము తిరిగివచ్చిన ప్రాంతాలు, స్కూలు, ఆటలు అన్నీ గుర్తు చేసుకున్నాం.
ఆ రోజు తనకి నేనొక వాగ్దానం చేశాను. తన కుటుంబాన్ని మా శిబిరానికి తీసుకువస్తానని చెప్పాను. తను ఒక గుడారంలో ఉంటోంది. మేము ఉండేది కాస్త భద్రంగా ఉన్న రాతి కట్టడం. జనవరి 8న మా అమ్మతో కలిసి మాలక్‌ని కలవాలని అనుకున్నాను. విషయం చెప్పాలని మాలక్‌కి ఫోను చేశాను. తను ఫోను తీయలేదు. వాళ్ల చెల్లి ఫోను తీసి గట్టిగా ఏడుస్తోంది. ‘మాలక్ లేదు.. ఈ తెల్లవారుజామున బుల్లెట్లు మా గుడారంపై పడ్డాయి. నిద్రపోతున్న తను ఆ దాడిలో చనిపోయింది’ అన్న మాటలతో నా చెవులు పనిచేయడం మానేశాయి. అది నేను నమ్మలేకపోయాను. నా గుండె బద్దలయినంత ఏడుపు వచ్చింది. ఫోను కిందపడేశాను. వెనుకే ఉన్న మా అమ్మ కంగారుగా నా దగ్గరికి వచ్చింది. నేను ఆమెని గట్టిగా పట్టుకుని ‘మాలక్ లేదు.. చనిపోయిందంట’ అంటున్నప్పుడు నా చెంపలపై కారిన నీటితో అమ్మ దుపట్టా తడిసిపోయింది.
ఇక్కడితో మాలక్ గురించి చెప్పడం ఆపేయచ్చు.. కానీ ఇంకాస్త మిగిలివుంది..
ఆ తరువాతి రోజు మాలక్ వాళ్ల ఇంటికి నేను, అమ్మ బయలుదేరి వెళ్లాం. మాలక్ ఉన్న గుడారం బుల్లెట్ల దాడిలో చిరుగులు పడిపోయి అక్కడే పడిఉంది. అక్కడ మాలక్ కుటుంబసభ్యులు ఎవరూ మాకు కనపడలేదు. పక్కన ఉన్న వాళ్లని అడిగినప్పుడు ‘మాలక్ వాళ్ల అన్నయ్య ఆ రోజు తెల్లవారుజామున చనిపోయాడ’ని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడు దాడుల వల్ల సరైన ఔషధాలు అందక రోజురోజుకూ క్షీణించిపోయాడని వాళ్లు చెప్పారు. పైగా మాలక్ మరణం అతనిని తీవ్ర దు:ఖంలోని తీసుకు పోయిందని అన్నారు. ఆ బాధతోనే మాలక్ చనిపోయిన కొన్ని గంటలకే అతను కూడా చనిపోయాడని వాళ్లు చెప్పారు. ఆ కుటుంబమంతా అతనిని సమాధి చేసేందుకు వెళ్లారని చెప్పారు.
ఆ రోజు గతంలో మాలక్‌తో నేను అన్న మాటలు గుర్తుకువచ్చాయి. మాలక్ చనిపోవడం, తనని అనుసరిస్తూ వాళ్ల అన్నయ్య కూడా చనిపోవడం నేను ఊహించని విషయాలు. వారిద్దరినీ పక్కపక్కనే ఖననం చేశారు. మరణంలో కూడా ఆ అన్నాచెల్లెల్ని ఎవరూ విడదీయలేదని అక్కడ గుమిగూడిన వారిలో ఎవరో అనడం నాకు వినపడింది.
మాలక్‌పై ఆ ప్రాణాంతక బుల్లెట్‌ని ఎవరు పేల్చారు? అసలు వాళ్లు ఆమెని ఎందుకు చంపారు? నిద్రపోతున్న మాలక్ సైనికులకు ముప్పుగా ఎలా కనపడింది? నర్సుగా మారి పిల్లలకు సేవ చేయాలనుకున్న నా స్నేహితురాలి దయగల కలలకు వారు భయపడ్డారా? ఇవి నా మనసును దహించివేస్తున్న ప్రశ్నలు..
ఓ నా ప్రియ స్నేహితురాలా! నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. నీ పేరు మీద ఓ ఆలివ్ చెట్టును నాటుతాను. మీ కుటుంబంలో మిగిలి వున్న వాళ్లని నాతో తీసుకెళతాను. ఇక నుండి నీలా వాళ్లని నేను చూసుకుంటాను’..
ఇట్లు,
నీ ప్రాణ స్నేహితురాలు లుజాయన్ .