ఇంటర్‌ పరీక్షలకు ఇలా ప్రిపేరవ్వండి !

Feb 12,2024 11:19 #feature

విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఇలా అన్ని కోర్సుల పరీక్షలు వరుసుగా వస్తుంటాయి. పరీక్షల తేదీ దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ప్రిపరేషన్‌లో మునిగితేలుతున్నారు. మొదటిగా సిబిఎస్‌ఇ సిలబస్‌తో పది, ఇంటర్‌ పరీక్షలు ఈనెల 15 నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సిలబస్‌ రివిజన్లు కూడా అయిపోయాయి. చదివిన అంశాలను సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. సరైన పద్ధతిలో పరీక్షలకు సన్నద్ధమైతే మంచి స్కోర్‌ సాధించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో పరీక్షల ప్రిపరేషన్‌ ఏ విధంగా ఉండాలో నిపుణుల సూచనల గురించి తెలుసుకుందాం.

పది తర్వాత ఇంటర్మీడియట్‌ విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు. ఏపీలో మార్చి 1 నుంచి, తెలంగాణాలో ఈనెల 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌లో సబ్జెక్టులు భవిష్యత్తులో ఉన్నత విద్య కోర్సుల్లో చేరడానికి, ఆయా కోర్సుల్లో రాణించటానికి కీలకంగా నిలుస్తాయి. అందువల్ల చదువుతున్న గ్రూప్‌ సబ్జెక్టులపై విద్యార్థులు పూర్తి పట్టు సాధిస్తే తద్వారా వార్షిక పరీక్షల్లో మంచి స్కోర్‌ సొంతం చేసుకోవచ్చు.

ఎంపిసి : మ్యాథమేటిక్స్‌ షార్ట్‌ ఆన్సర్‌ కొశ్చన్స్‌పై బాగా దృష్టి పెట్టాలి. పూర్తిచేసిన సిలబస్‌ను క్రమపద్ధతిలో రివిజన్‌ చేసుకోవాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు షార్ట్‌ ఆన్సర్‌ కొశ్చన్స్‌ ప్రాక్టీస్‌ చేసేటప్పుడే జేఈఈ మెయిన్‌, ఎంసెట్‌ తదితర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆయా సిలబస్‌ అంశాలకు అనుగుణంగా ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు- సమాధానాల రూపంలో ప్రిపేర్‌ కావాలి. వీక్లీ, మంత్లీ టెస్టులు రాయటం పరీక్షలకు బాగా దోహదపడతాయి.

మ్యాథమెటిక్స్‌ : ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ద్విపద సిద్ధాంతాల ప్రసాదాలు-సంయోగాలు-సంభావ్యత-వృత్తాలు, సమాకలనులు- నిశ్చిత సమాకలనులు- అవకలన సమీకరణలు- డిమూవర్స్‌ సిద్ధాంతం, వర్గ సమీకరణలు, పరావలయం వంటి అంశాలను బాగా పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు వెక్టార్‌ అల్జీబ్రాబీ మాత్రికలు, సరళ రేఖలు, సరళరేఖ యుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్ల్‌ అండ్‌ డెరివేషన్స్‌పై ఎక్కువ సమయం కేటాయించాలి.

ఫిజిక్స్‌ : ఈ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు స్వల్ప, అతి స్వల్ఫ సమాధాన ప్రశ్నల సాధనకు కృషి చేయాలి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మూవింగ్‌ ఛార్జెస్‌ అండ్‌ మ్యాగటిజం, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ పరమాణువు, వేవ్స్‌ సెమీ కండక్టర్‌ ఎలిమెంట్స్‌ వంటి అంశాల్లో పట్టు సాధించే విధంగా రివిజన్‌కు సమయం కేటాయించాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు రొటేటరీ మోషన్‌, యూనివర్సల్‌ గ్రావిటేషన్‌ లా, ఎస్కేప్‌ వెలాసిటీ, సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్‌, సర్ఫేస్‌ టెన్షన్‌, థర్మో డైనమిక్స్‌ వంటి అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఫిజిక్స్‌లో లాంగ్‌ ఆన్సర్‌ కొశ్చన్స్‌ను సాధన చేసేటప్పుడు అంచెలవారీగా పరిష్కార విధానాన్ని అనుసరించాలి. ఫలితంగా సదరు సమస్యకు సంబంధించి ప్రాథమిక భావనల పైనా పట్టు సాధించేందుకు ఆస్కారం లభిస్తుంది.

సమయ పాలన : విద్యార్థులు పరీక్షల కోసం మొత్తం సిలబస్‌ రివిజన్‌ చేయాలి. రీ రివిజన్‌ ప్రిపరేషన్‌కు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. పాఠ్యాంశాల్లో అధిక, తక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంశాలను గుర్తించాలి.

విజువల్‌ లెర్నింగ్‌ : చదివే విషయాన్ని విలువలైజేషన్‌ చేసుకుంటే సులభంగా గుర్తుంటుంది. ఈ రూపంలో గుర్తుకు తెచ్చుకునే విధంగా మైండ్‌ మ్యాపింగ్‌ చేసుకోవచ్చు. సంక్లిష్ట పాఠాలను ఇలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు.క్లిష్ట భావలపై కేంద్రీకరణ : క్లిష్ట భావలను సులభంగా అర్థం చేసుకోవటానికి ప్లాష్‌కార్డ్‌ పద్ధతి ఉపయోగపడుతుంది. పేపర్‌పై అంశాలను రాయటం, తద్వారా టెస్ట్‌ చేసుకోవటం ఈ పద్ధతి. ఇలా చేయటం వల్ల సమాచారం రీ కలెక్ట్‌ అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ కాన్సెప్ట్‌లు గుర్తించుకోవచ్చు.

పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • పరీక్షలంటే ఆందోళన చెందకూడదు.
 • ఆందోళన చెందితే జ్ఞాపకశక్తి తగ్గిపోయి చదువుకున్న పాఠాలను మరిచిపోయే ప్రమాదం ఉంది.
 • మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. వీలైతే తీరిక దొరికినప్పుడు కళ్లు మూసుకుని కాసేపు రిలాక్సు ఇవ్వాలి.
 • కేవలం గైడ్స్‌ మీదనే ఆధారపడకండి. టెక్ట్‌బుక్స్‌ను కూడా రిఫర్‌ చేస్తూ చదవటం ఎంతో మేలు.
 • అన్ని సబ్జెక్టుల ప్రశ్నలకు సమాధానాలను పాయింట్స్‌ వారీగా రాసుకోవాలి. అలా రాసుకోవటం వల్ల అవి బాగా గుర్తుంచాటాయి.
 • ముఖ్యమైన పాయింట్లను విడిగా వేరే నోట్‌బుక్‌లో రాసుకోండి. బయటకు వెళ్లినప్పుడు దాన్ని మీ వెంటే ఉంచుకుంటే మననం చేసుకోవటానికి వీలవుతుంది.
 • సాధ్యమైనంతవరకూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
 • కడుపు ఉబ్బరం కలిగించే మసాలాలు, ఇతర చిరుతిళ్లను వదిలేయడం మంచిది.
 • తాజా పండ్లు, పండ్ల రసాలు, పాలు ఎక్కువగా తీసుకోవాలి.
 • వేకువ జామునే నిద్రలేచి చదువుకోవటం మంచిది.
 • ఆయా సబ్జెక్టుల నమూనా ప్రశ్నాపత్రాలను సాల్వ్‌చేయటం ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలిశ్రీ పరీక్ష సమాయానికి అనుగుణంగా మోడల్‌ పేపర్లు పూర్తిచేయటానికి నిరంతరం ప్రయత్నించాలి.
 • రాత్రిళ్లు త్వరగా నిద్రపోవాలి. తెల్లవారుజామున లేవాలి.
 • ప్రతిరోజూ కాసేపు వ్యాయామం చేస్తే చురుగ్గా ఉంటారు. కాసేపు నడిచినా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 • టైమ్‌టేబుల్‌కు అనుగుణంగా ప్రతిరోజూ దినచర్య ఉండేలా చూసుకోవాలి.
 • క్రమపద్ధతిలో పరీక్షలకు సన్నద్ధం కావాలి
 • సందేహాల నివృత్తికి లెక్చరర్లతో మాట్లాడటం మేలు.                                                                                                                  – బి.సీతారామ్‌ఫిజిక్స్‌ సీనియర్‌ లెక్చరర్‌, కేంద్రీయ విద్యాలయ-1, మధురానగర్‌, విజయవాడ.
➡️