చలికాలంలో పిల్లల రక్షణ ఇలా…

శీతాకాలం (చలికాలం)లో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ కాలపు వాతావరణం పిల్లల ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ కాలంలోనే పిల్లల రోగ నిరోధక శక్తి క్షీణించి వారి ఆరోగ్యం సన్నగిల్లుతుంది. ఫలితంగా వారు చురుగ్గా కాకుండా నీరసంగా ఉంటారు. అనేక సీజనల్‌ సమస్యలకు లోనవుతారు. సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల శరీరం బ్యాక్టీరియా, జెమ్స్‌తో పోరాడే రోగనిరోధక శక్తిని కోల్పో తుంటారు. పిల్లలైనా, పెద్దలైనా చలికాలంలో సరైన డైట్‌ పాటించటం చాలా ముఖ్యం. అంతేకాక ఆహారపు అలవాట్లలో కొన్ని రకాల మార్పులు చేయటం తప్పనిసరి కూడా. పిల్లలు తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాలు, విటమిన్లు, మినరల్స్‌ ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. ఆకుకూరలు తినటం ద్వారా అధికమొత్తంలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. పాలకూర, మెంతికూర, ఉల్లికాడలు, తాజా వెల్లుల్లిని పిల్లల ఆహారంలో చేర్చటం వల్ల వారికి ఎక్కువ మొత్తంలో పైటోన్యూట్రీయెంట్స్‌, విటమిన్లు, మినరల్స్‌ను అందించొచ్చు. ఆకుకూరలతోపాటు పప్పు కూడా తినిపిస్తే మరిన్ని ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి.

ఎక్కువగా దగ్గు, జ్వరం, జలుబు వంటివి పీడిస్తుంటాయి. ఈకాలంలో వైరస్‌, బ్యాక్టీరియా సులభంగా వ్యాప్తి చెందుతాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు జబ్బుల బారిన పడుతుంటారు. రాబోయే మూడు నెలలు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రధానంగా కేంద్రీకరించాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లల ఆరోగ్యంపై ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ద అవసరం. ఈ కాలంలో ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

దుస్తులు : పిల్లలను తీవ్రమైన చలి నుంచి రక్షించి వారి శరీరం వెచ్చగా ఉండేలా పెద్దలు జాగ్రత్త తీసుకోవాలి. అందుకే ఉన్ని స్వెట్టర్లు తప్పనిసరిగా వేయాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే చేతులకు గ్లవ్స్‌, కాళ్లకు సాక్స్‌ వేయాలి. బయటకు వెళ్తే బూట్లు ఉండేలా చూడాలి. పిల్లల శరీరానికి నేరుగా చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. పిల్లల శరీరంలో వెచ్చదనం తగ్గితే జ్వరం వచ్చే రిస్క్‌ పెరుగుతుంది. జలుబు, దగ్గు లాంటివి వస్తాయి. సీజన్‌ మారినప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులు పిల్లలకు ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల ముఖం, శరీరంపై సూక్ష్మక్రిములు దాడి చేస్తాయి. అందువల్ల పిల్లలకు డ్రెస్‌ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖం, శరీరం మొత్తం కప్పి ఉంచే డ్రెస్‌ వెయ్యాలి. చలి తగలకుండా.. వెచ్చదనం ఉండేలా చెయ్యాలి. ఫుల్‌ స్లీవ్స్‌, మంకీ క్యాప్స్‌, ఫుల్‌ లెంగ్త్‌ పాంట్స్‌ వాడాలి.

పరిశుభ్రత : పిల్లల గది, ఆడుకునే ప్రదేశాలు, చదువుకునే ప్రదేశం అన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. పిల్లలు ఎక్కువగా ఇండోర్స్‌లోనే ఉంటారు కాబట్టి ప్రతి రోజూ ఇల్లు పరిశుభ్రంగా ఉంచాలి. పిల్లలకు వాడే బట్టలు, సాక్స్‌, స్కూల్‌ బ్యాగ్స్‌, బొమ్మలు అన్నీ పొడిగా, శుభ్రంగా ఉండాలి.

సరైన ఆహారం : పిల్లలకు ఏడాదంతా పౌష్టికాహారం అందించడం అత్యవసరం. తినే ఆహారంపైనే వారి ఇమ్యూనిటీ ఆధారపడి ఉంటుంది. అందువల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలను ఎక్కువగా ఇవ్వాలి. పిల్లలు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత అల్ఫాహారం తీసుకునే ముందు చేతులు, కాళ్లు బాగా కడగాలి. విటమిన్‌ సి, ఐరన్‌, జింక్‌ వంటి మినరల్స్‌ అధికంగా ఉన్న ఆహారాన్ని అందిస్తే రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. పండ్లు, కూరగాయలు, గోధుమలు, నాటు గుడ్లు వంటివి ఇందులో చేర్చాలి.

నీరు : చలికాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. సాధారణంగా ఎక్కువగా దాహం వేయదు. అందుకే పిల్లలు ఎక్కువ నీరు తాగరు. తగినంత నీరు తాగకపోతే చలికాలంలో శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడతాయి. జలుబు, దగ్గు వచ్చే రిస్క్‌ పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లటం కష్టమవుతుంది. అందువల్ల పిల్లలతో నీరు బాగా తాగిస్తూ ఉండాలి. నీరు చర్మాన్ని తేమగా ఉంచి.. బ్యాక్టీరియాతో పోరాడేలా చేస్తుంది. నీటి వల్ల శరీరం.. విష వ్యర్థాలను బయటకు పంపేందుకు వీలవుతుంది. చలి కాలంలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టనందున పిల్లలు తక్కువ నీరు తాగు తుంటారు. వారితో ఎక్కువ నీరు తాగించాలి. వీలైనంత వరకు గోరువెచ్చని నీరు అందించాలి.

నిద్ర : చలికాలంలో పిల్లలు బాగా నిద్రపోయేలా చెయ్యాలి. తద్వారా వారి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. శారీరకంగా కూడా పిల్లలు ఎదిగేందుకు నిద్ర చాలా అవసరం. రోజూ కనీసం 7 గంటలైనా పడుకునేలా చెయ్యండి.

టీకాలు వేయించాలి

ఇన్‌ప్లుయెంజా వ్యాక్సిన్‌తో పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరం రాకుండా ఉంటుంది. వీటిని ఏడాది పిల్లలకు రెండుసార్లు వేస్తారు. ఆ తర్వాత ఐదేళ్ల వరకు ఏటేటా ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలి. సీజనల్‌ టీకాలు వేయించాలి.

సొంత వైద్యం సరికాదు

చలి కాలంలో చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణంలోని మార్పులు, చల్లని గాలులతో పిల్లలకు జ్వరంతోపాటు శ్వాసకోస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి జలుబు అధికమైతే పిల్లలకు ఆయాసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా జబ్బు చేసిన ప్రతిసారీ వారికి యాంటీబయాటిక్‌ ఇస్తుంటారు. ఫార్మసీకి వెళ్లి యాంటీబయాటిక్స్‌ తీసుకురావడం, జలుబు, దగ్గుకు సొంతంగా ఔషధాలు వేస్తుంటారు. ఇలా ప్రతిసారీ ఇవ్వడంతో సహజమైన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. సకాలంలో వైద్యులను సంప్రదించి తగిన వైద్యం అందించాలి.

వ్యాయామం 

పిల్లలను ఆడుకోనివ్వాలి. సూర్యకాంతిలో ఆడుకునే అవకాశం ఇవ్వాలి. రెగ్యులర్‌ వ్యాయామం పిల్లల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రన్నింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ లాంటివి చేయించాలి. వ్యాయామం వల్ల శరీరంలో వెచ్చదనం కూడా పెరుగుతుంది. ఫిట్‌గా ఉంటారు. వ్యాధి కారకాలతో శరీరం మెరుగ్గా పోరాడగల్గుతుంది. ఉదయం ఎండ వచ్చాక వారిని కాసేపు సూర్యరశ్మి తగిలేలా తీసుకెళ్లాలి. దీంతో శరీరానికి కాస్త వేడి తగులుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచే విటమిన్‌ డి కూడా లభిస్తుంది. అయితే ఎక్కువగా చలిగా ఉన్నప్పుడు పిల్లలను బయటకు తీసుకెళ్లకూడదు.

జాగ్రత్తలివే…

  • రాత్రి వేళ చల్లని గాలులు గదిలోకి రాకుండా చూసు కోవాలి. బయట చలిగా ఉన్న సమయంలో పిల్లలను ఎక్కువ సమయం బయట గడపకుండా జాగ్రత్తలు వహించాలి.
  • వెచ్చగా ఉండేందుకు మందంగా ఉండే దుస్తులు లేదా స్వెట్టర్లు ధరింపజేయాలి. తలకు మఫ్లర్‌ (టోపీ), చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్స్‌ వంటి అదనపు రక్షణ దుస్తులు ధరించాలి.
  • చలికాలంలో ముఖం, చేతులు, పాదాలు, మడమలు పగిలిపోవడం సాధారణం. తల స్నానానికి ముందు నూనె రాసి కాసేపు ఉంచిన తర్వాత స్నానం చేయించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్నానం వేడి నీటితో చేయించాలి. ఆ తర్వాత పొడిగా ఉండే దుస్తులను వేయాలి.
➡️