మతం సరిహద్దులను చెరిపేసిన మానవత్వ దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున, ఆ తరువాత వరుసగా జరిగిన ఉదంతాల నేపథ్యంలో హిందూభక్తుల కోసం ముస్లిం, సిక్కు మతాల ప్రజలు మానవతా దృక్పథంతో స్పందించారు. మతాలు వేరైనా మనుషులు ఒక్కటే అని చాటిచెప్పారు. కలసి మెలసి బతికే భారతీయుల అసలు స్వభావాన్ని వెల్లడి చేశారు.
కుంభమేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు … ఆ విషాద ఘటనలో ప్రాణాలొదిలిన వాళ్లు కొంతమందైతే, అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరుగులు తీసినవారు మరికొంతమంది. అలా పరుగులు పెడుతున్న ఓ హిందువు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చుట్టూ జనం. పడిపోయిన వ్యక్తిని నిలబెట్టే సాహసం కూడా ఎవరూ చేయడం లేదు. అప్పుడే అక్కడికి ఓ ముస్లిం వ్యక్తి వచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనికి ఊపిరి ఊది ప్రాణాలు రక్షించాడు. ఈ మొత్తం ఉదంతాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి ఇటీవల ఈ దృశ్యాలని సోషల్ మీడియాలో షేర్‌చేశాడు. ఇదొక్కటే కాదు, ఇంకా అక్కడ ముస్లిం వ్యక్తులు హిందూ భక్తుల కోసం చేస్తున్న సేవలు అనేకం ఉన్నాయి. ఇది కదా భారతదేశం. మత సామరస్యానికి చిహ్నంగా మహా కుంభమేళాలో జరిగిన ఆ విశేషాలు చూద్దాం.
‘ఆ ప్రాంతంలో షాపులు పెట్టుకునేందుకు వాళ్లకి అనుమతులు ఇస్తే, ఆ ప్రదేశం పవిత్రత కోల్పోతుంది. వాళ్లు అక్కడ కావాలని కొన్ని అభ్యంతరకర చేష్టలు చేస్తారు. అవి అక్కడికి వచ్చే ఎంతో పవిత్రులైన నాగసాధువులకు కోపం తెప్పిస్తాయి. ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రపంచంలో దేశ పరువు మంటగలిసిపోతుంది’ అని కుంభమేళా ప్రారంభానికి కొన్ని రోజుల ముందు అఖిల భారతీయ అఖాడా పరిషద్ ప్రతినిధి మహంత్ రవీంద్ర పూరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ‘వాళ్లు మా మతాన్ని అపవిత్రం చేస్తారు. కూరగాయల షాపులు, జ్యూస్ షాపులు, ఫుడ్ స్టాల్స్, టీ షాపులకు వాళ్లకి అనుమతి ఇస్తే, మేము తినే ఆహారాన్ని కావాలనే అపవిత్రం చేస్తారు. దాని మీద ఉమ్మి వేసి ఇచ్చినా ఇస్తారు’ అని కూడా మాట్లాడారు. కానీ, ఇంత ప్రతికూల వాతావరణంలోనే మతానికి మించిన మానవత్వ హృదయాలు అక్కడ కనిపించాయి.
ఘటన జరిగిన తర్వాత, పరిస్థితి తీవ్రత అర్థమైన స్థానిక ముస్లిం వ్యక్తులు, కుంభమేళాకి వచ్చే భక్తుల కోసం సంఘటితమయ్యారు. విశేషంగా సేవచేస్తున్నారు. సిక్కులు, ముస్లింలు ఆహారం, వసతి, నీళ్లు వంటి సౌకర్యాలను అందిస్తున్నారు. 25 వేలకి పైగా దుప్పట్లు పంపిణీ చేశారు. దర్గాలు, మసీదుల్లో భక్తుల కోసం బస ఏర్పాటు చేస్తున్నారు. వాళ్లంతా సురక్షితంగా ఉండాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఇది కదా గంగా-జమున స్ఫూర్తి. ఇది కదా మతం హద్దులను చెరిపేసిన మానవత్వం.
ఘటన రోజు ముస్లిం వాలంటీర్ ఫర్హాన్ అలాం, తనకెదురైన అనుభవాన్ని ఇలా చెబుతున్నారు : ‘ఆ రోజు రామ్ శంకర్ అనే భక్తుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే నేను ఉన్నాను. అతను పూర్తిగా స్పృహ కోల్పోయాడు. పరిస్థితి నాకు అర్థమైంది. ఆలస్యం చేయకుండా అతనికి సిపిఆర్ చేశాను. అతడు లేచి నిలబడ్డాడు’ అని చెబుతున్న పర్హాన్ ఆ సమయంలో ఎంత టెన్షన్ పడ్డాడో వైరల్ అయిన వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చూసేవాళ్లకి ఓ హిందువుని ఓ ముస్లిం వ్యక్తి కాపాడుతున్నట్లు కనిపించదు.. ప్రాణాపాయంలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి మానవత్వమున్న మరో వ్యక్తి ఎంతలా తపన పడతాడో కనిపిస్తుంది. అందుకే పర్హాన్ తెగువకి, అతను చూపిన మానవత్వ హృదయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు జళ్లు కురిసింది.
ఈ ఘటన తరువాత ప్రయాగరాజ్‌లోని స్థానిక ముస్లిం సమాజం అద్భుతమైన కరుణ, ఐక్యతను ప్రదర్శించింది. తొక్కిసలాట దుర్ఘటన తరువాత జనవరి 29న భక్తుల ప్రవేశానికి ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు పెట్టింది. దీంతో, వేలాది మంది భక్తులు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. జాన్‌సెన్‌గంజ్ రోడ్డుతో సహా 10కి పైగా ప్రాంతాలన్నీ కిటకిటలాడిపోయాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు యాత్రికులకు దారి చూపేందుకు, తమ ఇళ్లు, మసీదులు, సమాధులు, దర్గాలు, ఇమాంబరాల తలుపులు తెరిచారు స్థానిక ముస్లింలు. ఆ రోజు దాదాపు 25 వేల మందికి ఆశ్రయం కల్పించారు. ఆహారం, టీ, నీరు అందించారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి వైద్య సహాయం చేశారు. నఖాన్ కోహ్నా, హిమ్మత్‌గంజ్, ఖుల్దాబాద్ వంటి ప్రాంతాల్లో భండారాలు (సామూహిక విందులు) నిర్వహించారు.
బహదూర్ గంజ్ నివాసి ఇర్షాద్ దైనిక్ భాస్కర్ మీడియాతో తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ‘నా ఇంటికి వచ్చిన వ్యక్తి నా అతిధి. అతని బాగోగులు పూర్తిగా నేనే చూసుకోవాలి. అది నా బాధ్యత. తొక్కిసలాట తరువాత దారుణమైన పరిస్థితి ఉంది. అందుకే, నేను, నా పొరుగువారు మా ఇళ్ళని, మసీదులని ఆశ్రయం కల్పించేందుకు వీలుగా ఏర్పాటుచేశాం’. అక్కడే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అప్నా చౌక్ నుంచి వచ్చిన ఉపాధ్యాయుడు మసూద్ అహ్మద్ కూడా ఉన్నారు. ఆయన ఇలా అంటున్నారు. ‘ముస్లిములు తమ మతాన్ని పాటిస్తున్నారు. హిందువులు తమ మతాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ రెండు మతాలకు చెందిన వారిగా కంటే మనుషులుగా ఉన్న వ్యక్తులనే చూడాలి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ప్రాథమిక అవసరాలు తీర్చడం ఎంతైనా అవసరం. అందుకే మేమంతా సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని చెబుతున్నారు.
మౌనీ అమావాస్య రోజు, ఆ తరువాత ఇలాంటి మత సామరస్య దృశ్యాలు అక్కడ అనేకం కనిపించాయి. ప్రయాగరాజ్‌కి వచ్చే భక్తుల కోసం ముస్లిం వ్యక్తులు హృదయపూర్వక స్వాగతాలు పలికారు. చౌక్ జామా మసీదు వెలుపల, గుమిగూడిన విశ్వాసులు, భక్తులను పూలతో స్వాగతించారు. ముస్లింలు రక్షణ వస్త్రంగా భావించే ‘చాదర్’ని యాత్రికుల క్షేమం కోసం ఉంచారు. ప్రేమ, గౌరవం, సోదరభావంతో నిండిపోయిన ఈ సంప్రదాయాలు మతం కంటే మానవత్వం ముఖ్యమని, ఇదే భారతదేశ సంస్కృతి అని చాటిచెబుతున్నాయి.