పండ్ల ముక్కలు తాజాగా ఉండాలంటే …

May 1,2025 21:42 #health tips

‘పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా’ అని రకరకాల పండ్లని ఇంట్లోనే తెచ్చిపెట్టుకుంటాం. వీలైనప్పుడల్లా ముక్కలు కోసిస్తుంటాం. అయితే ఒక్కోసారి పిల్లలు తింటారని ఎక్కువగా కోసేస్తుంటాం. కొన్ని ముక్కలు తినేసి మిగిలినవి అలాగే ఉండిపోతాయి. అవి త్వరగా చెడిపోతాయి లేక నల్లగా మారతాయి. కొంతమంది పండ్లను ముక్కలుగా కోసుకుని ఆఫీసుకు తీసుకెళ్తుంటారు. తినే సమయానికి వాటి రంగు మారిపోయి తినబుద్ధి కాదు. కట్‌ చేసిన పండ్ల ముక్కలు ఎక్కువసేపు తాజాగా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
– కట్‌ చేసిన పండ్లను 6 నుంచి 8 గంటల పాటు తాజాగా ఉంచాలంటే.. వాటిపై కాస్త నిమ్మరసం వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. దీనివల్ల రంగు మునుపటిలానే ఉంటుంది.
– ఒక గిన్నెలో చల్లటి నీటిని తీసుకొని, కట్‌ చేసిన పండ్లను గిన్నెలో వేయాలి. దీని వల్ల పండ్లు నల్లగా మారవు, వాటి తాజాదనం కూడా అలాగే ఉంటుంది.
– యాపిల్‌ ముక్కలు చాలా త్వరగా రంగు మారిపోతాయి. ఆ ముక్కలపై కూడా నిమ్మరసం వేస్తే రంగు మారదు.
– ప్రయాణంలో కట్‌ చేసిన పండ్లను తీసుకెళుతుంటే, పండ్లపై సిట్రిక్‌ యాసిడ్‌ పౌడర్‌ చల్లాలి. ఇలా చేస్తే అవి ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.
– పండ్ల ముక్కలను కట్‌ చేసి ప్లాస్టిక్‌ బ్యాగ్‌ లేదా అల్యూమినియం ఫాయిల్‌లో బాగా చుట్టి ఫ్రిజ్‌లో పెట్టినా ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి.
– స్ట్రాబెర్రీలు త్వరగా పాడైపోతాయి. వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే పెద్ద టిష్యూ పేపర్‌లో ఉంచాలి.

➡️