ఇంగ్లీష్ అంటే ఇప్పటికీ చాలా మందికి మింగుడుపడని సబ్జెక్టు. ముఖ్యంగా తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలకు అదో జఠిల పదార్థం. అయితే అనంతపురం జిల్లాలోని సింగంపల్లి అనే పల్లెలో తెలుగు మీడియం చదువుకున్న అనిత మాత్రం ‘గట్టిగా అనుకోండి చాలు.. ఇంగ్లీష్ వస్తుంది’ అంటున్నారు. రోజువారి జీవితంలో జరిగే విశేషాలను ‘స్మార్ట్ ఇంగ్లీష్ ట్యుటోరియల్స్’ పేరుతో యూట్యూబ్ షార్ట్స్, రీల్స్‌లో సరళంగా ఆమె బోధిస్తున్నారు. పదిమందికీ స్పూర్తిగా నిలుస్తున్న ఈ ఇంగ్లీష్ టీచర్ అనిత ఇద్దరు బిడ్డల తల్లి. ఆమె విద్యాభ్యాసమంతా తెలుగు మీడియంలోనే జరిగింది. అయినా ఇంగ్లీషుపై పట్టు సాధించారు. ఒకప్పుడు తనని చూసి నవ్వుకున్న వాళ్లే ఇప్పుడు తను చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. సినిమా యాక్టర్ సునీల్ అనిత స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను మెచ్చుకుంటూ గతంలో ఓ వీడియో కూడా చేశారు. అనిత చేసిన వీడియోలు వందలోపే ఉంటాయి. కానీ లక్షల్లో వీక్షకులు ఉన్నారు. ఆమె సాధించిన ఈ విజయం వెనుక ఎంతో కృషి దాగుంది.
అనిత స్వగ్రామం ఆత్మకూరు మండలం సింగంపల్లి గ్రామం. తల్లి మణి, తండ్రి శ్రీనివాసులు, సోదరి ఉన్నారు. పీజీ వరకు చదివారు. తెలుగు మీడియంలో చదివిన అనిత ఇంగ్లీషులో పట్టు సాధించాలని ఎందుకు అనుకున్నారో ఆమె స్వయంగా చెప్పారు.
‘గూగుల్, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్.. ఇలా ఎక్కడైనా ఇంగ్లీషే. ఈ భాష నేర్చుకోలేకపోతే భవిష్యత్‌లో ముందుకెళ్లలేం అనిపించేది. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అమ్మాయిగా ఇంగ్లీష్ అంటే మొదటి నుంచీ చాలా భయం. టెన్సెస్ బట్టీపట్టి నేర్చుకుని, ఎంత ప్రయత్నించినా ఈ భాష రాదని ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాను. పెళ్లి, పిల్లలతో ఖాళీగా ఉన్న నేను ఒకరోజు మా అబ్బాయి స్కూలుకి వెళ్లా. అక్కడి టీచర్లతో పేరెంట్స్ అంతా ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. వాళ్లని చూస్తే ఇంగ్లీష్ వచ్చిన వాళ్లదే పైచేయి అనిపించింది. చాలా నామోషీగా అనిపించింది. అసలు నాకెందుకు ఇంగ్లీషు రాదు? ఇంగ్లీషు అంత కష్టమా? అనే ఆలోచనలు ఆ రోజంతా వేధించాయి. నా భర్త గంగాధర్ నన్ను ఎంతో ప్రోత్సహించారు. ‘నీకు చదువు విలువ తెలుసు నువ్వు ఏదైనా నేర్చుకోగలవు అంటూ నాకు మద్దతుగా నిలబడ్డారు. అలా 2016లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముందడుగేశాను.
ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఎమోషన్ ఎవరికైనా ఉంటుంది. అయితే ఎలా నేర్చుకోవాలి? నాకైతే మొదట్లో నేర్చుకోవటమే కష్టం అనిపించింది. అయినా వెనక్కి తగ్గలేదు. పుస్తకాలు చదివా. రోజువారి పనుల్ని, మన కళ్లముందు కనిపించేవన్నీ వాక్యాలుగా రాసుకున్నా. ఇంగ్లీషులో మాట్లాడుతుంటే నా చుట్టూ ఉండేవాళ్లు ‘రాకున్నా బడాయిగా ఇంగ్లీష్ మాట్లాడుతోందంటూ కామెంట్స్ చేశారు. నేనేమీ పట్టించుకోలేదు. ప్రతిరోజూ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. సందేహాలొస్తే గూగులమ్మను అడిగేదాన్ని. అమెరికాలో ఉండే బంధువులతో ఇంగ్లీషులో మాట్లాడేదాన్ని, యూట్యూబ్లో ట్యుటోరియల్స్ ఫాలో అయ్యేదాన్ని. గృహిణిగా అన్ని పనులు చేసుకుని, ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే రోజుకు రెండు గంటలు సాధన చేసేదాన్ని.”
ఎవరైనా నేర్చుకోవచ్చు
పెళ్లయ్యాకే డిగ్రీతో పాటు ఎంఎ ఇంగ్లీష్, ఎమ్మెస్సీ బయో కెమిస్ట్ చదివాను. ఇంగ్లీషుపై పట్టు సాధించాను. లాక్‌డౌన్ సమయంలో ఆన్లైన్లో రోజుకి ఆరు గంటల పాటు ఇంగ్లీషు బోధించా. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు నాకంటే పెద్దవాళ్లు. ఏదో ఒక స్పోకెన్ ఇంగ్లీషుకెళ్లి ఇక భాష రాదని నిర్ణయించుకున్న వాళ్ళే. అలాంటి వాళ్లు నా క్లాస్‌లు విని ఎంతో నేర్చుకున్నారు. ఎవరైనా, ఎప్పుడైనా భాష నేర్చుకోవచ్చు. ‘బెటర్ లేట్‌దాన్ నెవర్’ అంటుంటా. నేర్చుకోవాలనే తపన, అవసరం, ఆసక్తి ఉండాలంతే. ‘నాకేమీ వనరుల్లేవు’ అని ఎప్పుడూ నిరుత్సాహపడద్దు. ఒక్క స్మార్ట్ ఫోను ఉంటే చాలు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒన్డే మ్యాచ్ కాదు. ఇదో నిరంతర సాధన.
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. అయితే ఇక్కడ ఎంటర్ టైన్‌మెంట్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయినా నా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల కోసం ‘స్మార్ట్ ఇంగ్లీష్ ట్యుటోరియల్స్’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించా. ‘ఇంగ్లీష్ ఎడ్యుకేషన్’ చూస్తారో లేదో అనుకున్నా. యూట్యూబ్లో చేసిన పెద్ద వీడియోల కంటే అందరికీ అర్థమయ్యేలా చేసిన కొన్ని షార్ట్స్, రీల్స్ బాగా పాపులరయ్యాయి. ఇది ఊహించలేదు.
ఆత్మ విశ్వాసం తోడైంది
”మాట్లాడటం, రాయటం, చదవటమే నా ప్రపంచం. నాలోని మొండితనమే భాష నేర్చుకోవటానికి కారణమైంది. బయటివాళ్లు ఏమనుకుంటారోననే భయంతో ఇంట్లో మా పిల్లలతోనే ఇంగ్లీష్ మాట్లాడేదాన్ని ‘బాగా మాట్లాడుతున్నావని కొందరంటే.. ఒక ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్‌కి ట్రైనర్గా వెళ్లి అక్కడ డెమో ఇచ్చా. అక్కడ గృహిణులు, ఉద్యోగులు, బిటెక్ చదివిన వాళ్లు ఉన్నారు. సొంతంగా చేసుకున్న మెటీరియల్‌తో పాటు బోధనా తీరు అక్కడి మేనేజ్‌మెంట్‌కి నచ్చింది. ప్రశంసలందుకున్న ఆ రోజు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలా మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేశాను.
అదే నా కల!
ఒకప్పుడు వెటకారంగా ‘బట్లర్ ఇంగ్లీష్’ అని వెక్కిరించినోళ్లు ఇపుడు నాతో మాట్లాడటానికి జంకుతున్నారు. ఇంగ్లీషు నేర్చుకుంటే ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయి. నేను సాఫ్ట్‌వేర్ కోర్సులు కూడా చేశాను. యూట్యూబ్లో నా వీడియోలు వంద కూడా ఉండవు. కొన్ని వీడియోలను లక్షల మంది చూశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన నేను ఇంగ్లీష్ నేర్చుకోవటానికి పడిన కష్టాలు ఇతరులు పడకూడదనుకున్నా. నేర్చుకున్న టెక్నిక్స్, టీచింగ్ మెథడ్స్ చెప్పాలనే సదుద్దేశంతో వీడియోలు చేస్తున్నాను. నేను సాధించిన ఈ చిన్న విజయం. కొందరికైనా స్ఫూర్తిగా మిగిలితే చాలు. నాలాంటి ఎంతోమంది, ఇంగ్లీషంటే భయపడేవారందరూ ఇంగ్లీష్ మాట్లాడేలా చేయాలన్నదే నా కల’.
– వి.రవిచంద్ర, అనంతపురం,
94900 99611.