చెమటకాయలు పోవాలంటే..

Mar 17,2025 04:02 #Precautions, #Summer

వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల్లో చెమటకాయలు ఒకటి. వీటి కారణంగా చర్మం దురద పెట్టటమే కాకుండా మృదుత్వాన్ని కోల్పోతుంది. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా చెమటకాయల నుంచి బయట పడొచ్చు.
పెరుగు : చెమట కాయలు ఉన్న ప్రదేశంలో చల్లని పెరుగుని అప్లై చేసి 15 నిమిషాలు ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తటి బట్టతో అద్దాలి. పెరుగులో సహజంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ప్రాపర్టీస్‌ చెమటకాయలు రాకుండా చేస్తాయి.
రోజ్‌ వాటర్‌ : 200 ఎంఎల్‌ రోజ్‌ వాటర్‌లో నాలుగు టేబుల్‌ స్పూన్ల తేనె, 200 ఎంఎల్‌ ప్యూర్‌ వాటర్‌ కలపాలి. బాగా కలిపి ఐస్‌ ట్రేలో పోసి ఫ్రీజ్‌ చేయాలి. ఇవి క్యూబ్స్‌లా అయ్యాక నాలుగైదు క్యూబ్స్‌ తీసుకుని పల్చని మస్లిన్‌ బట్టలో చుట్టి చెమట కాయలు ఉన్న ప్రదేశంలో మృదువుగా అద్దాలి. రోజ్‌ వాటర్‌ చర్మం పీహెచ్‌ బ్యాలెన్స్‌ని మెయింటెయిన్‌ చేస్తుంది. ఎక్కువగా ప్రొడ్యూస్‌ అయ్యే ఆయిల్‌ని కంట్రోల్‌ చేస్తుంది.
గంధం : గంధానికి చల్లని ఫుల్‌ ఫ్యాట్‌ మిల్క్‌ కలిపి ఆ మిశ్రమాన్ని చెమట కాయలు ఉన్న ప్రదేశంలో పట్టించి గాలికి ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
ముల్తానీ మిట్టి : మూడు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మిట్టిలో రెండు టీ స్పూన్ల పుదీనా పేస్ట్‌ కలిపి తగినన్ని చల్లని పాలు పోసి స్మూత్‌ పేస్ట్‌ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మం మీద అప్లై చేసి గాలికి ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
కలబంద : చెమటకాయలు ఉన్న ప్రదేశంలో కొంచెం కలబంద గుజ్జు రాస్తే త్వరగా తగ్గిపోతాయి. కలబందలో ఆస్ట్రిజెంట్‌ లక్షణాలు ఉండటం వలన చెమటకాయలు త్వరగా తగ్గటానికి సహాయపడతాయి. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.
టీ ట్రీ ఆయిల్‌ : టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి .కొంచెం టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని దానికి కొంచెం నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఆ మిశ్రమంలో కాటన్‌ బాల్‌ను ముంచి చర్మంపై రాస్తే చెమట కాయలు చాలా త్వరగా తగ్గిపోతాయి.
వెనిగర్‌ : టిష్యూ పేపర్‌ను తీసుకుని వెనిగర్‌లో ముంచి చెమట కాయలు ఉన్న ప్రదేశంలో అద్దాలి. ఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గిపోతాయి.
లవంగ నూనె : కాటన్‌ బాల్‌ను తీసుకుని లవంగ నూనెలో ముంచి చెమటకాయలు ఉన్న ప్రదేశంలో రాస్తే చెమట కాయలు తగ్గుముఖం పడతాయి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

➡️