ఆత్మవిశ్వాసం తోడుగా…

Feb 3,2025 05:56 #feachers, #Jeevana Stories

బాల్యం కొంతమందికి తీయని జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. మరికొంతమందికి మాత్రం చేదు అనుభవాలను జ్ఞప్తికి తెస్తుంది. ముఖ్యంగా పేదరికం వల్ల బాల్యంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న వారు చాలామందే ఉంటారు. అలాంటి యువతి షనీబా అలీ. కేరళకి చెందిన షనీబా ప్రస్తుతం ఎర్నాకుళం హైకోర్టు న్యాయవాదుల్లో ఒకరిగా ఉన్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘కాథల్‌ కోర్‌’ చిత్రానికి లీగల్‌ అడ్వైజరర్‌గా కూడా పనిచేశారు. సాధారణంగా ఈ స్థాయికి వెళ్లిన వారు తమ బాల్యపు చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు ఇష్టపడరు. కానీ షనీబా … ఆ పరిస్థితులు పిల్లల మనసులపై ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పేందుకు తన అనుభవాలనే పంచుకుంటున్నారు.

షనీబా కోజీకోడ్‌లోని కుట్టికత్తూర్‌లో పుట్టారు. తండ్రి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైతే తల్లి ఇంటిపని చేసేందుకు వెళ్లేవారు. ఆ కుటుంబం పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజులు గుర్తుచేసుకుంటూ షనీబా ఇలా చెప్పారు. ‘మధ్యాహ్నం ఉచిత భోజనం దొరుకుతుందని నేను, చెల్లి ప్రతి రోజూ స్కూలుకు వెళ్లేవాళ్లం. ఉడకబెట్టిన గుడ్డు తినడమే మాకు లగ్జరీ విషయం. అది కూడా నెలలో రెండు, మూడుసార్లు ఉండేది. ‘అమ్మ గుడ్లు ఉడకబెడుతుంటే ఎప్పుడెప్పుడు తిందామా’ అని ఆమె చుట్టూనే తిరిగేవాళ్లం’ అంటూ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు.
‘పేదవాడిని అందరూ పనికిరానివాడిగా చూస్తారు. ఇది నా స్వంత అనుభవం’ అని చెబుతున్న షనీబా, ‘పిల్లల భావాలు గాయపడినప్పుడు, వారు అనుభవించే మానసిక గాయాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. పిల్లల ఆత్మగౌరవాన్ని గౌరవించాలి. అప్పుడే వారు పెద్దయ్యాక ఇతరులను గౌరవిస్తారు. చాలా మంది పేదరికాన్ని ఆహారం, దుస్తులు, నివాసం లేకపోవడంతో పోల్చుతారు. కానీ నాకు మాత్రం పేదరికం అంటే మీ ఆత్మ గౌరవాన్ని తగ్గించడం’ అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలని షనీబా ఎంతో తపించింది. చదువుపై శ్రద్ధపెట్టింది. పాత టెక్స్ట్‌ బుక్స్‌, ఇరుగు పొరుగు పిల్లల నుండి సేకరించిన నోట్సులు, బట్టలతోనే ఆమె స్కూలు రోజులు గడిచాయి. ఇంకా తన అనుభవాలను ఆమె ఇలా చెబుతున్నారు. ‘మా అమ్మ వంట చేసేందుకు వెళ్లే ఇళ్లు చాలా పెద్దవిగా ఉండేవి. అక్కడ ఉండే పిల్లలు ఆటవస్తువుల కోసం మారాం చేయడం మాకు తెలుసు. కానీ మాకు ఇల్లు లేదు. కట్టుకునే బట్టలు ఉండేవి కావు. పుస్తకాలు, జామెట్రీ బాక్సు కొనివ్వమని అమ్మని ఎన్నోసార్లు అడిగాం. కానీ అమ్మ వాటిని కూడా కొనివ్వలేనని చెప్పేది’ అంటున్న షనీబా బాల్యస్మృతులు ఎందరో చిన్నారులవి.

పేదరికం పిల్లలపై ఎంత వివక్ష చూపుతుందో ఆమె తన బాల్యంలో ఎదుర్కొన్నారు. ఆ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ‘చిన్నప్పుడు మమ్మల్ని ఎవరూ ఎత్తుకునేవారు కాదు. చాక్లెట్‌ ఇస్తామని ముద్దు కూడా చేసేవారు కాదు. ఎల్‌ఎల్‌బి చదివేటప్పుడు వచ్చిన స్టైఫండ్‌తోనే నేను మొదటిసారి డెయిరీ మిల్క్‌ చాక్లెట్‌ కొనుక్కున్నాను’ అని చెబుతున్నప్పుడు ఆ మాటల్లోని నిజాయతీకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది.

పక్కింట్లో టీవీ చూసేందుకు వెళ్లినప్పుడు ముఖంమీదే తలుపులు వేసిన అనుభవం కూడా షనీబా బాల్యంలో ఎదుర్కొంది. ‘సమాజంలో పేదలకు విలువ లేదు. ఈ సంఘటనలు నా మనసులో చాలా పెద్ద ప్రభావాన్ని చూపాయి. పేదవాడు కూడా ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటాడని, ఈ విషయాన్ని సమాజానికి చాలా గట్టిగా నిరూపించాలని అప్పుడే అనుకున్నాను’ అని ఆమె చెప్పారు.

ఇంట్లో ఇంత పేదరిక పరిస్థితులు ఉన్నా షనీబా చదువులో, క్రీడల్లో రాణించేది. ఖర్చుతో కూడుకున్నవాటికి మాత్రం దూరంగా జరిగేది. స్కూల్లో పెట్టిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో షనీబాకే ఎప్పుడూ ప్రథమ బహుమతి వచ్చేది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఆమే ముందుండేది. అయితే ఒకసారి, సాధారణంగా ప్రతిభతో రాణించే విద్యార్థులకు సూల్లో ఇచ్చే ‘కళాతిలకమ్‌’ టైటిల్‌ ఆమెకి దక్కలేదు. ఖర్చుతో కూడుకున్న డాన్స్‌ పోటీలో ఆమె పాల్గొనకపోవడమే కారణంగా చెప్పారు. ఆ సందర్భాన్ని షనీబా ఇలా ప్రస్తావించారు. ‘ఆ కార్యక్రమానికి, టైటిల్‌ తీసుకున్న విద్యార్థులతో పాటు వాళ్ల తల్లిదండ్రులు, బంధువులు కూడా వేదికపైకి వచ్చారు. ఆ ఫంక్షన్‌ హాలులో మా అమ్మానాన్న కూడా ఉన్నారు. కానీ ఈ వివక్షపై ప్రశ్నించే ధైర్యం వాళ్లకి లేదు’ అని షనీబా గుర్తు చేసుకున్న సంఘటన ఎందరో పేదపిల్లలది.

‘రుచికరమైన ఆహారం తినడానికి కలలు కన్నాను. ఈ స్థాయి నుండి ప్రజలు తమ హక్కుల కోసం పోరాడేలా, వాళ్లని ప్రేరేపించే వ్యక్తిగా నేను మారాను. నన్ను ఇంతలా ఎదిగేలా ఈ అనుభవాలే మార్చాయి’ అంటున్న షనీబా పాఠశాల విద్య పూర్తిచేసి, ఎల్‌ఎల్‌బి వైపు అడుగులు వేశారు. పేదరికం వల్ల చదువులో కూడా తను ఎలా రాజీపడిందో ఇలా గుర్తుచేసుకున్నారు. ‘ఎంబిబిఎస్‌ కంటే ఎల్‌ఎల్‌బి తక్కువ ఖర్చు కాబట్టి దీన్ని ఎంచుకున్నాను. ‘నేను త్వరగా జీవితంలో స్థిరపడాలి. అమ్మానాన్నకి ఓ మంచి ఇల్లు కొనిపెట్టాలి’ ఇదే నా మనసులో ఎప్పుడూ వుండేది’ అని చెబుతున్న షనీబా కెరీర్‌ తొలినాళ్లలో చాలా తక్కువ జీతానికే పనిచేశారు.

‘మొదటి మూడు నెలల సమయంలో నేను ఒక పూట భోజనం మానుకుని ఖర్చులు తగ్గించుకున్నాను. సీనియర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో సొంతంగా కేసులు తీసుకున్నాను. అలా ఆదాయం సంపాదించుకున్నాను’ అని తన జీవితంలో ఎదురైన అనుభవాలన్నింటినీ ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. 27 ఏళ్ల షనీబా ఎక్కడా సిగ్గు పడకుండా తన బాల్యాన్ని, పేదరికాన్ని చెప్పడం చూసిన ఆమె ఇన్‌స్టా ఫాలోవర్లు తన ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రశంసిస్తున్నారు. తను మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

➡️