తాత గారి ఊళ్లో …

Jun 8,2024 04:20 #jeevana

అందమైన ఒక చిన్న గ్రామంలో ఒక తాత, అమ్మమ్మ ఉన్నారు. ఈ వేసవి సెలవులకు వాళ్ల మనుమలు, మనుమరాళ్లు అంతా ఇంటికి వచ్చారు. పిల్లలందరినీ చూసి అవ్వా తాత ఎంతో మురిసిపోయారు.
ఒక రోజు తాత పిల్లలను మల్లె తోటలోకి తీసుకెళ్లాడు. ఆ తోటల్ని చూసి పిల్లలు భలే సంతోషపడ్డారు. ‘మా పట్టణాల్లో ఎందుకు తాతయ్య ఇలాంటి తోటలు ఉండవు’ అని అందరూ అడిగారు. ‘మీ పట్టణంలో ఎవరూ వ్యవసాయం చేయరు. ఇక్కడ అందరూ ఇదే వృత్తిగా చేస్తారు’ అని తాతయ్య చెప్పాడు. ఇంకోరోజు పిల్లలు తాతయ్యతో, ‘తాతా మాకు మామిడికాయలు కావాలి, తెచ్చి పెట్టు’ అన్నారు. ‘సరే’ అని తాతయ్య మామిడి కాయలతో పాటు తాటి ముంజెలు కూడా తెచ్చాడు. పిల్లలంతా తీయని మామిడి పళ్ళు, చల్లని తాటి ముంజలు తింటూ ఆ రోజంతా సరదాగా గడిపారు.
తాతయ్య ఊళ్లో ఉన్నన్ని రోజులూ పిల్లలంతా గ్రామమంతా తిరుగుతూ, ఆడుకుంటూ చింతకాయలు కోసుకోవడం, తినటం, రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. తెలియని ఎన్నో విషయాలను తాతయ్యని అడిగి తెలుసుకున్నారు. సెలవులు గడిపిన తర్వాత ఊరు నుండి వెళ్లిపోతూ, ‘మళ్లీ రాబోయే సెలవులకు వస్తామ’ని, తాతయ్య, అమ్మలకు చెప్పి సంతోషంగా పట్టణానికి బయల్దేరారు.

– కాకర్ల గీతిక, 9వ తరగతి
అరవింద మోడల్‌ స్కూలు,
మంగళగిరి.

➡️