విద్యార్థుల్లో సమగ్ర వికాసం…

విద్యార్థి దశ ఓ మధురానుభూతి. అయితే తీవ్ర ఒత్తిడితో కూడిన నేటి చదువుల వల్ల విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పుస్తకాల బరువు, హోంవర్కులు, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు వంటి వాటి హోరుతో తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారు. ఆటపాటలు కరువై ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతుండటంతో మధుర
స్మృతులకు లోనై తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు. విషయ పరిజ్ఞానం, ఆలోచనాశక్తి, సృజనాత్మకత, ప్రశ్నించేతత్వం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంపొందించటమే లక్ష్యంగా కొందరు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థి వికాస వాహిని (వివివి) నిరంతరం కృషి చేస్తోంది.
కృష్ణాజిల్లా కంకిపాడు పట్టణం బ్యాంకు కాలనీ (వాణీనగర్‌)లో ఏర్పాటైన స్వచ్చంద సేవా సంస్థ విద్యార్థి వికాస వాహిని. భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్ధుల్‌ కలాం స్ఫూర్తితో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. 20 సంవత్సరాలకుపైగా మేనేజ్‌ మెంట్‌, బోధన వృత్తిలో అపారమైన అనుభవం కల్గి వివిధ యూనివర్శిటీలు, రిక్రూట్‌మెంట్‌ కంపెనీలతో అనుబంధం ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (విశ్రాంత) వేములపల్లి కేశవరావు వ్యవస్థాపకులుగా ఈ సంస్థను 2015 జులైలో స్థాపించారు.
సామాజిక సేవే లక్ష్యం… విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా స్థాపించిన ఈ సంస్థలో 125 మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాధికారులు, రచయితలు, మేథావులు, సమాజ సేవకులు భాగస్వాములై ఉన్నారు. మరెందరో సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. అయితే మొత్తం ఐదుగురు వ్యక్తులు, వ్యవస్థాపకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు కీలకంగా ఉండి ఈ సంస్థను నడిపిస్తున్నారు. వీరందించే సహాయ సహకారాల తోనే ఈ సంస్థ ముందుకు సాగుతోంది. పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో సమగ్ర మనో వికాసానికి తమవంతుగా కృషిచేస్తున్నారు. ప్రాథమిక విద్య సమయంలోనే నైతిక విలువలు, జీవన నైపుణ్యాలు, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఈ సంస్థ ప్రతినిధులు అలవర్చుతున్నారు. మాధ్యమిక, ఉన్నత విద్యను అభ్యసించే వారికి విమర్శనాత్మక దృష్టి, సృజనాత్మకత, భావ ప్రకటనా సామర్థ్యం, పరస్పర సహకారం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి కృషిచేస్తున్నారు. సామాజిక సమానత్వం, న్యాయం, ప్రపంచ సంఘీభావం పెంపొందించటం, ప్రజాస్వామ్య విలువల పరి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి సమస్య గురించి హేతుబద్ధంగా ఆలోచించటం, పరిస్థితు లను అవగాహన చేసుకోవటం, ఊహించటం, పోల్చటం, క్షేత్రస్థాయి జ్ఞానాన్ని పెంపొందించటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చదువుకునే రోజుల్లో ఉన్నత ప్రమాణాలకు పునాదులు వేసేందుకు ఈ సంస్థ నిర్విరామంగా కషిచేస్తోంది.

త్రీ బీ…త్రీ సీలతో ఆరోగ్య సూత్రాలు
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గాను వారి శారీరక, మానసిక, విజ్ఞాన శక్తులను పెంపొందించే విధంగా త్రీ బి (బాడీ, బ్రెయిన్‌, బుక్‌) ఫార్ములాతో, 3 సీ (కాన్ఫిడెన్స్‌, క్యారెక్టర్‌, కంపెటెన్స్‌) పెంపొందిం చే వివిధ కార్యక్రమాలను గత ఆరేళ్లుగా వివివి సంస్థ కొనసాగుతోంది. ఆరోగ్య సూత్రాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. సదస్సులు, సమావేశాలు, అవగాహనా సదస్సులు నిర్వహి స్తోంది. ఆటల్లో ప్రోత్సాహం, వ్యాయామం వంటివి నేర్పించటం, యోగా తరగతులు ఏర్పాటు చేయిస్తున్నారు. అవగాహనా శక్తి పెంపొందించే విధంగా మోటివేషనల్‌ క్లాసులు, వారాంతపు, వేసవి తరగతులను వివిధ విషయాలపై నిర్వహిస్తున్నారు. పెద్దఎత్తున వ్యాసరచన, వక్తత్వ పోటీలు నిర్వ హిస్తుండటం ద్వారా విద్యార్థుల్లో ప్రపంచ, సామాజిక, శాస్త్ర, సాంకేతిక విషయాలపై అవగాహన, ఆసక్తి పెంపొందించటానికి కృషి చేస్తున్నారు. మేథోశక్తిని పెంపొందించటానికి పుస్తక పఠనం, ఆన్‌లైన్‌ పోగ్రాములు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

విద్య, వైజ్ఞానిక, ఆరోగ్య కార్యక్రమాలకు పెద్దపీట
కరోనాకు ముందు రోజుల్లోనూ ఈ సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రంథాలయాల్లో పెద్దఎత్తున విద్యార్థుల కోసం అనేక విద్య, వైజ్ఞానిక, ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించింది. మూడు నుంచి ఏడోతరగతి వరకూ ఒక బ్యాచ్‌, ఎనిమిది నుంచి డిగ్రీ వరకూ చదివే విద్యార్థుల కోసం ఇలా పలు బ్యాచ్‌లుగా ఏర్పాటుచేసి ఆన్‌లైన్‌ తరగతులు పెద్దఎత్తున బోధించారు. కంకిపాడులోని సంస్థ కార్యాలయంలో ప్రతి ఆదివారం ఉచిత ఆంగ్ల భాషపై శిక్షణ, పుస్తక పఠన కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఏటేటా పదో తరగతి విద్యార్థుల కోసం ఒత్తిడి లేని విద్యను అభ్యసించటంపైనా, కెరీర్‌ గైడెన్స్‌పైనా మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నత చదువులపై అవగాహనా కార్యక్రమాలు కొనసాగు తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రల కోసం కూడా కరోనా సమయంలోనూ, ఆ తర్వాత కూడా వారి ఆరోగ్య రక్షణకు, మానసిక వికాసానికి తగిన సూచనలు, సలహాలను అందిస్తున్నారు.

స్మార్ట్‌ మాయ నుంచి బయటపడేలా…
స్మార్ట్‌ మాయ (సెల్‌ఫోన్లు) పిల్లల జీవితాలను కబళించేస్తోన్న విషయం తెలిసిందే. నిద్ర లేచించి మొదలు రాత్రి పడుకునే వరకూ స్మార్ట్‌ ఫోన్‌తోనే. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేలా పుస్తక పఠనంపై దృష్టి పెట్టేందుకు ఈ ‘వివివి’ సంస్థ ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తోంది. తద్వారా విలువలు నేర్చుకుంటున్నారు. మార్గదర్శకంగా ఉంటున్నారు. మానసిక పరిణితిని పొందు తున్నారు. కొత్త విషయాలను సులభంగా తెలుసుకోగల్గుతున్నారు. సామాజిక అంశాలపై ఎంచక్కా అవగాహన పెంపొందించుకుంటున్నారు.

వేములపల్లి కేశవరావు, వ్యవస్థాపక అధ్యక్షులు, విద్యా వికాస వాహిని

నైతిక బోధనలతో మంచి సమాజం
విద్యార్థుల్లో నైతిక ప్రమాణాలు పెంచటమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. చిన్నప్పుడే పిల్లల్లో జాతీయ భావాలు, అభ్యుదయ విషయాలు తెలియజేస్తే వారు రాబోయే తరాల్లో మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. విద్యార్థుల సర్వతోముఖాభివద్ధి కోసం కృషిచేసే ఉపాధ్యాయులను గుర్తించి వారికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సైతం అందిస్తున్నా. ఈ కృషిలో ఎందరో అభ్యుదయవాదులు భాగస్వాము లవుతున్నారు.

-యడవల్లి శ్రీనివాసరావు

➡️