అన్నయ్య బిర్యానీ అవ్వలేదా?’ అంటూ ఆకర్షణీయంగా వచ్చే ప్రకటనలు నమ్ముతున్నారా? తస్మాస్ జాగ్రత్త. మసాలాల్లో కల్తీలు, టూత్‌పేస్టుల్లో రసాయనాలు, బిర్యానీల్లో రంగుల మిశ్రమాలు కలిపేస్తున్నారు. చూసుకోకుండా బయట ప్యాకెడ్‌ఫుడ్స్ తింటున్నారా? ఖచ్చితంగా అనారోగ్యం పాలవ్వటం ఖాయం. ఆహార పదార్థాల్లో ఏయే రూపాల్లో కల్తీలు జరుగుతాయనే విషయాన్ని ఎజిఎస్ అండ్ జిఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రయోగాత్మకంగా చూపించి బట్టబయలు చేశారు.
కృష్ణాజిల్లా ఉయ్యూరులోని అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య, చెరకు రైతుల సిద్ధార్థ కళాశాల (ఎజిఎస్ అండ్ జిఎస్ డిగ్రీ కళాశాల- విజయవాడ సిద్థార్థ అకాడమీ అనుబంధం) రసాయనశాస్త్ర విభాగం, ఫుడ్ సేప్టీ స్టాండర్డ్ అథార్టీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో మంగళ, బుధ వారాల్లో రెండురోజులపాటు ‘ఆహార పదార్థాల్లో కల్తీ-ప్రభావం’ అనే అంశంపై వర్కుషాపు జరిగింది. కళాశాల డిగ్రీ, పీజీ విద్యార్థినీ విద్యార్థులు మార్కెట్లో కల్తీలు ఎలా జరుగుతున్నాయనేది ప్రయోగాత్మకంగా వివిధ ప్రాజెక్టు నమూనాలు తయారుచేసి ప్రదర్శించారు. పసుపులో కల్తీపై ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమెస్ట్రీ ద్వితీయసంవత్సరం విద్యార్థులు ఎస్‌డి మహిమున్నీసా, కె.భార్గవ, ఎస్. విష్ణు ప్రియాంక, అబ్ధుల్ ఆయేషా, బి.సుమతి, సిహెచ్ హరిత, ఎం.భువనశ్రీ, కాపీ పొడిపై టి.లావణ్య, డి.హేమాంజలి, ఫర్జానాబేగం, టీపైన టి.ఆకాంక్ష, డి.వనతి, పచ్చి బఠాణీలపై ఎండి షర్మిలా, అబ్ధుల్‌షాబీరున్నీసా, షేక్ షాకీరున్నీసా, చిలకడదుంపపై ఎస్‌కె షాదియా, వై.దివ్య, షేక్ పంగ్జేనా, తేనెలో ఎం.శ్రావణి, కె.దుర్గాసాయి, ఎన్.పూర్ణశ్రీ, ఆర్.రాజీ, ఎబి షాహినాబేగం, ఎల్.తేజ ప్రయోగాత్మకంగా వివరించారు.
కల్తీలు ఎలా జరుగుతాయంటే…
మనం నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ రోజువారీగా అనేక వస్తువులు ఉపయోగిస్తుంటాం. టూత్ పేస్టు నుంచి ఇంట్లో సామాన్లు, నూనెలు, పప్పులు, కూరగాయలు, బిస్కెట్లు, తినే పదార్థాలు, ధరించే దుస్తులు… తొడుక్కునే చెప్పులు… ఆభరణాలు.. మార్కెట్లో కనిపించే ప్రతి వస్తువూ… కల్తీలు నకిలీల మయమే. ఫ్యాకెడ్ ఫుడ్ నుంచి ఆహార పదార్థాలు.. తాగే నీరుతో సహా సమస్తం కల్తీల మయం.. ఇవేకాదు మందులు, పెట్రో ఉత్పత్తులు ఇలా ఏ వస్తువు కొన్నా కల్తీల బారిన పడాల్సివస్తుందని వివరించారు.
ఆహార పదార్థాల్లో కల్తీతో పెనుప్రమాదం
ఆహార పదార్థాల్లో విషపూరిత పదార్థాలు, యూరియా, లెడ్ క్రోమైట్, కృత్రిమరంగులు వంటి సాధారణ కల్తీలు విషపూరితంగా మారతాయి. బాక్టీరియల్ కాలుష్యం, కల్తీ ఆహారం హానికరమైన సూక్ష్మజీవులను కల్గివుంటుంది. ఇది అంటువ్యాధులు, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగి ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. అలర్జీలు పెరిగిపోతాయి. గ్యాస్‌తోపాటు కడుపునొప్పి వంటి సమస్యలతోపాటుగా కడుపులో రుగ్మతలు వంటివి వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురికావొచ్చు. కల్తీ వస్తువులను ఎక్కువగా వినియోగిస్తే క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాల సమస్యలు, హార్మోన్లలో అసమతుల్యత, రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. పై అంశాల గురించి ఆయా ప్రాజెక్టుల్లో విద్యార్థినీ విద్యార్థులు సోధాహరణంగా వివరించారు.
కల్తీల నిరోధానికి చర్యలు : సిహెచ్.గోపాలకృష్ణ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఆచరణాత్మకంగా ఉన్నాయి. చట్టప్రకారంగా మా వంతుగా కల్తీలు, నకిలీ వస్తువులను మార్కెట్లో నియంత్రించేందుకు కృషిచేస్తున్నాం. ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు కూడా కొన సాగిస్తున్నాం. పలు రకాల తనిఖీలు నిర్వహించటం ద్వారా కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లో విక్రయాలు జరగకుండా చూస్తున్నాం. సమాజంలో జరిగే ఆహారాల్లో కల్తీ, ప్యాకెడ్‌ఫుడ్ వల్ల కలిగే నష్టాలు గురించి అవగాహన కల్పించాం.
ఆలోచింపజేసేలా ప్రాజెక్టు నమూనాలు : డాక్టర్ ఎం.శివనాథ్, ప్రిన్సిపాల్
మేము ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో 350 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వారు తయారుచేసిన ప్రాజెక్టులు మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఫలితాలు వచ్చేలా నమూనాలు వచ్చాయి. ఆహార భద్రత, నాణ్యత తదితర అంశాలపై సోధాహరణంగా వివరించారు. భవిష్యత్తు తరాలు చైతన్యం కావటానికి ఇది దోహద పడతాయి.
పప్పుధాన్యాలు-రంగులు : -ఎన్.హేమలత, పి.హేమంజలి, రుక్సానా
పప్పుధాన్యాలను ఆకర్షణీయంగా కనపడటానికి కృత్రిమరంగులతో పూత వేస్తారు. వీటిలో ఉన్న రసాయనాలు తిన్న తర్వాత మన శరీరంలోకి వెళ్లిపోయి క్యాన్సర్ వంటి అనారోగ్య కారకాలుగా మారతాయి. కొద్ది మొత్తంలో పప్పుధాన్యాలను తీసుకుని నీటిలో వేసి కొద్దిసేపు ఉంచాలి. నీటి రంగుమారితే కృత్రిమ రంగులు కలిసినట్లుగా గుర్తించొచ్చు. మారకపోతే స్వచ్ఛమైనవిగా పరిగణించొచ్చు.
కృత్రిమ పాలు ఇలా గుర్తించొచ్చు:- కె.దీక్షిత, జి.వి.వెంకటేశ్వరమ్మ, జి.నవ్య, ఎం.జేజి, పి.రేణుక, సిహెచ్.దివ్యశ్రీ
పాలలో కల్తీని గుర్తించటానికి 5 మిల్లీలీటర్ల పాలు తీసుకుని అందులో టించర్ రెండు, మూడు చుక్కలు వేయటంతో ఆ పాలు పసుపురంగులోకి మారతాయి. అప్పుడు అవి సహజసిద్ధమైనవి. బ్రౌన్‌కలర్‌లోకి మారితే రసాయనాలు కలిసినట్లుగా లెక్క. పాలపొడిలో రసాయనాలు, యూరియా కలిపే అవకాశం ఉంది. మన ఇంట్లోనే పాల గిన్నెలో మన చూపుడు వేలు ముంచితే పాలు చేతికి అంటితే అవి స్వచ్ఛమైనవి, తడి తడిగా నీళ్లలాగే అంటితే కృత్రిమ పాలుగా భావించొచ్చు.
సురక్షితమైన కూరగాయలేనా? : -ఎం.సాయిలక్ష్మి, వి.షణ్ముక, వి.కుసుమ
కూరగాయలకు కూడా రసాయనాలు పూయడం ఇటీవల పెరిగింది. చిన్న దూదిని నీళ్లలో ముంచి దానితో కూరగాయల పైభాగాన్ని రుద్దితే అది ఎలాంటి రంగు మారకుండా ఉంటే అవి సహజమైనవి. ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. దూది ఆకుపచ్చ రంగులోకి మారితే రంగుల కల్తీ జరిగినట్లుగా నిర్ధారించొచ్చు. కల్తీ కూరగాయలను తింటే అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది
ప్రజారోగ్య పరిరక్షణకు దోహదం : డాక్టర్ జి.గిరిప్రసాద్, డాక్టర్ విఎన్‌వి కిశోర్, కన్వీనర్లు, డిగ్రీ, పీజీ కళాశాలల రసాయనశాస్త్ర విభాగాధిపతులు
ఆహార పదార్థాల్లో పరిమాణాన్ని పెంచటానికి, రూపాన్ని మెరుగుపర్చడానికి, బరువు పెరచడానికి ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలను కలుపుతుంటారు. కొందరు స్వార్ధం వల్ల వీటిని కొనుగోలు చేసి తినే వారు ఆయా రసాయనాలు, ఇతర క్రిమి సంహారక మందులు శరీరంలోకి వెళ్లి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఈ వర్కుషాపులో ప్రదర్శించిన నమూనాలు ఆహార భద్రతను గుర్తుచేయటంతోపాటుగా కల్తీ ఆహార పదార్థాలతో అనారోగ్యాలకు ఎలా గురవుతారో వివరించారు.
ఉప్పులోనూ అయోడిన్ లోపమా? : పి.ఉమా, జి.ధనీష, బి.జాహ్నవి, కె.విజయశ్రీ
మనం తినే ఉప్పులోనూ కల్తీ జరుగుతుంది. దీనిని కనుగొనడానికి బంగాళ దుంప ముక్కను కట్‌చేసి ఉప్పు వేసి నిముషం పాటు వేచి చూడాలి. నిమ్మరసం రెండు చుక్కలు వేసినా తెలుస్తుంది. అయోడైజ్డ్ ఉప్పు నీలం రంగులోకి మారుతుంది. సాధారణ ఉప్పు ఎలాంటి రంగులోకి మారదు
– జీవన డెస్క్