చేదూ విలువైనదే …

Apr 27,2025 02:56 #feachers, #Jeevana Stories, #katha

తోటలో ఠీవిగా ఉన్న వృక్షాలు గాలికి కులాసాగా ఊగుతున్నాయి. అంతలో మామిడి చెట్టు చూపు తనతో సమానంగా ఊగుతున్న వేప చెట్టుపై పడింది. అది వెంటనే ”ఏరు వేప చెట్టూ! ఏం చూసుకుని తెగ ఊగుతున్నావ్‌? నిలువెల్లా చేదు నింపుకున్నందుకా?’ అని హేళన చేసింది.
ఆ మాటలకు వేప చెట్టు చిన్నబోయింది. బదులివ్వబోయింది. అంతలో ‘మామయ్యా! ఇక్కడ పెద్ద చెట్లు భలే ఉన్నాయి. మామిడి కాయలు నాకు భలే ఇష్టం. మామిడికాయ పప్పు, ఆవకాయ, మాగాయ నాకు ఎంత ఇష్టమో! మామిడి పళ్ళయితే చాలా చాలా యిష్టం! కానీ ఈ వేప చెట్టు పెద్దగా ఉండి ఏం ప్రయోజనం? ఒకటే చేదు. యాక్‌” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వసంత్‌ వికారంగా మొహం పెట్టి.
ఆ సంభాషణ విన్న మామిడి చెట్టు, వేప చెట్టుతో ”విన్నావా? నా గురించి ఎంత గొప్పగా చెప్పాడో!” అంది గర్వంగా.
అంతలో వసంత్‌ మామయ్య ‘నువ్వు అనుకునేది తప్పు వసంత్‌! మామిడి చెట్టు ఎంత గొప్పదో వేప చెట్టు కూడా అంత గొప్పదే. రుచికి చేదు అయినా, ఆరోగ్యానికి చాలా మంచిది. వేపలో ఔషధ విలువలు చాలా ఉన్నాయి. గతంలో ప్రతి ఇంటి ముందు వేపచెట్టు ఉండేది. వేప గాలి మంచిదంటారు. వేప చెట్టులోని ప్రతి భాగం విలువైనదే. ఎన్నో మందుల తయారీలలో వేప ఉపయోగపడుతోంది. క్యాన్సర్‌ కణాలను నిరోధించడంలో వేప బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇది క్రిమి సంహారి కూడా. సౌందర్య సాధనాల తయారీలో కూడా వేప ఉపయోగపడుతోంది” అని వివరించాడు.
”అయితే వేప చెట్టు కూడా గొప్పదే మామయ్య!” అన్నాడు వసంత్‌ అంతా తెలిసినట్టు ముఖం పెట్టి. ఆ మాటలు విన్న మామిడి చెట్టు, వేప చెట్టుతో ‘నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నీ గొప్పతనం ఇప్పుడు బాగా అర్థమైంది” అంది. వేప చెట్టు ఆనందంగా తల వూపింది.

– జె.శ్యామల,
హైదరాబాద్‌, 99896 01113.

➡️