…ఈ ఇద్దరికీ జేజేలు!

సాంకేతికతను అందిపుచ్చుకుని మనిషి ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు. రాకెట్లు, మెరైన్లు, అంతరిక్ష ప్రయోగాలను దాటి ఆర్టిఫిషియల్‌ ఇంటిల్‌జెన్స్‌ (ఏఐ) రాక ఎన్నో అద్భుతాలకు కేంద్రంగా మారింది. అయితే ఆ అభివృద్ధి మానవ వినాశనం కోరితే.. ముఖ్యంగా ఒక జాతి మరో జాతిని నాశనం చేసే ఆయుధంగా మారితే.. ఉపేక్షించే వీలు లేదు. అది ఎంత శక్తిమంతమైనా, దాని రూపకర్తలు ఎంతటి మేధావులైనా ఆ విధానాలను ఖండించాల్సిందే.. ఆ ఆలోచనలని తిప్పికొట్టాల్సిందే. సరిగ్గా ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సంస్థ 50వ వార్షికోత్సవ బహిరంగ సభలో ఇదే జరిగింది. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇజ్రాయిల్‌ మిలిటరీకీ ఎఐ టెక్నాలజీ విక్రయానికి పూనుకుంది. ఈ చర్యకి వ్యతిరేకంగా వార్షికోత్సవ సభలో ఇద్దరు మహిళా ఉద్యోగులు ఇబ్దిహాల్‌ అబౌసాద్‌, వానియా అగర్వాల్‌ నిరసనలు తెలిపారు. తమ వాణిని చాలా బలంగా వినిపించారు.

‘మీ చేతులకు రక్తం అంటుకుంది.. షేమ్‌ ఆన్‌ యు’ అంటూ సంస్థ ఉద్యోగి ఇబ్దిహాల్‌ అబౌసాద్‌ బిగ్గరగా అరుస్తూ సంస్థ మాజీ సిఇఓ స్టీవ్‌ బామర్‌ ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఆమె ఆక్రోశిస్తున్నప్పుడు బహుశా అక్కడున్న వారందరికీ, ఆ వీడియో చూస్తున్న ప్రపంచ జనాభాకి పాలస్తీనీయులకు జరిగిన అన్యాయం క్షణకాలమైనా కళ్లముందు మెదిలేవుంటుంది.
ఒప్పందాన్ని వ్యతిరేకించడంతోనే అబౌసాద్‌ సరిపెట్టలేదు. ‘ఒకపక్క గాజాలో మరణ మృదంగం వినిపిస్తుంటే, అందుకు ఇజ్రాయిల్‌ మిలటరీకి సాయం చేసిన మైక్రోసాఫ్ట్‌ సంస్థ సిగ్గుపడాలి’ అని నినదించారు. ‘మారణహోమం కోసం ఏఐని ఉపయోగించడం ఆపండి’ అని బిగ్గరగా కేకలు వేశారు.
ఆ తరువాత మరో ఉద్యోగి వానియా అగర్వాల్‌ కూడా బిల్‌గేట్స్‌, సత్య నాదెళ్ల, స్టీవ్‌ బామర్‌ ఒకే వేదికపై ఆసీనులై సంస్థ సాధించిన విజయాలు ఏకరువు పెడుతున్న వేళ తన గళాన్ని విప్పారు. సంస్థ లక్ష్యంపైనే ఆమె విమర్శానాస్త్రాలు సంధించారు.
‘మానవులు అభివృద్ధి చెందేలా వారికి అధికారాలు కల్పించడం’ సంస్థ లక్ష్యంగా ఉంది. దీనిపైనే ఆమె ప్రశ్నించారు. ‘ఏ వ్యక్తులకు మీరు అధికారం ఇస్తున్నారు? వర్ణ వివక్షను అమలు చేసే పాలనలను మన సంస్థ స్వాగతిస్తుందా? యుద్ధ నేరాలు, మారణహోమం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతు ఇస్తుందా? మైక్రోసాఫ్ట్‌ సంస్థ రానురాను డిజిటల్‌ ఆయుధాలు సరఫరా చేసే ఉత్పత్తిదారుగా మారిపోయింది. సాంకేతికత పేరుతో అణచివేత, జాతి ప్రక్షాళనకు సహాయపడే నిఘా వ్యవస్థలకు సహాయం చేస్తోంది’ అని ఆమె తీవ్రంగా విమర్శించారు.
భారతీయ సంతతికి చెందిన వానియా సంస్థలో ఏడాదిన్నర నుండి విధులు నిర్వర్తిస్తున్నారు. సంస్థ కార్యకలాపాలను తీవ్రంగా నిరసించిన వానియా 50వ వార్షికోత్సవ సభలో దిగ్గజ మేధావుల ఎదుట తన గొంతును బలంగా వినిపించారు. ‘మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీతో గాజాలో యాభైవేల మంది పాలస్తీనియన్లు హత్య చేయబడ్డారు. మీకు ఎంత ధైర్యం? వాళ్ల రక్తంతో మీ చేతులు తడిసిపోయాయి. ఈ మానవ హననాన్ని ఇకనైనా ఆపండి. ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంచుకోండి’ అని అరుస్తున్న వానియాని సిబ్బందిని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు.
పాలస్తీనీయుల దుర్భర జీవితాలను కళ్లకుకట్టిన అసోసియేటెడ్‌ ప్రెస్‌ నివేదికలను వానియా ఈ సందర్భంగా ఉదహరించారు. ఇజ్రాయెల్‌ వర్ణవివక్ష పాలనను, గాజాలో పాలస్తీనియన్ల మారణహోమాన్ని ప్రారంభించడంలో మైక్రోసాఫ్ట్‌ కీలక పాత్ర పోషించిందని ఆ నివేదికలో స్పష్టం చేశారు.
ఏప్రిల్‌ 4న సంస్థ వార్షికోత్సవం ముగిసిన తరువాత గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరు ఉద్యోగులకు లేఆఫ్‌ లెటర్లు జారీచేశారు. ఉద్యోగినులు లేవనెత్తిన అంశాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆ లేఖలో ఈవిధంగా ప్రస్తావించింది. ‘ఖ్యాతిని పొందడానికి వీరు ఎంతో తహతహలాడిపోయారు. అందుకే కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్న పెద్ద కార్యక్రమానికి అంతరాయం కలిగించేలా ప్రవర్తించారు. ఈ దుస్సాహసాన్ని మేం సహించం. వీరిలో ఒక ఉద్యోగి తన రాజీనామాని ప్రకటించారు. అయితే అందులో ప్రస్తావించిన తేదీ కంటే 5 రోజుల ముందుగానే ఆమెని మేం విధులు నుంచి తొలగిస్తున్నాం’ అని రాశారు. తప్పును ఎత్తిచూపితే సహించలేని ఆధిపత్య ధోరణి ఈ లేఖలో కనిపిస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌. అటువంటి సంస్థ చేసే కార్యకలాపాలపై తమ నిరసనను వ్యక్తపరిచిన ఈ మహిళా ఉద్యోగుల ధైర్యానికి హాట్సాప్‌ చెప్పాల్సిందే. ఉద్యోగం పోతుందని తెలిసినా అన్యాయాన్ని ఎదిరించాల్సిందేనని గళమెత్తిన ఈ ధీరవనితలు ప్రశంసలకు అర్హులు. సాంకేతికత పేరుతో మానవ హననానికి కారణమవుతున్న వ్యక్తుల, సంస్థల చర్యలకు ఈ సంఘటన చెంపపెట్టు.


చదువులో టాపర్‌
వానియా ఈ ఘటన తరువాత తన ట్విట్టర్‌, ఈమెయిల్‌ ఖాతాలను నిలుపుదల చేశారు. గతంలో ఆమె ఖాతాలో ఉన్న సమాచారం మేరకు ఆమె మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగిగా కెరియర్‌ ఎంచుకోక ముందు టీ కన్సల్టెంట్‌లో పనిచేశారు. 2015లో కొన్ని నెలల పాటు సోషల్‌ మీడియా మేనేజర్‌గా ఉన్నారు. మెడికల్‌ అసిస్టెంట్‌గా, రిసెప్సనిస్ట్‌గా కూడా పనిచేశారు. 2018లో అమెజాన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఆ తరువాత అదే కంపెనీలో ఫుల్‌టైం జాబ్‌ సాధించారు. 2023 నుండి మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా చర్చ తరువాత 2025 ఏప్రిల్‌ 11న తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆమె 2016-19 మధ్య కాలంలో అరిజోనా యూనివర్శిటీలో బాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌ చేశారు. విద్యలో ఎంతో ప్రతిభతో రాణించే వానియా 2017లో గ్రేస్‌ హోపర్‌ కాన్ఫరెన్స్‌కి హాజరైన 35 మంది విద్యార్థుల్లో ఒకరు. యూనివర్శిటీ స్కాలర్‌షిప్‌కి ఎంపికైన వారికి మాత్రమే ఈ అర్హత ఉంటుంది.

➡️