భిన్న అభిరుచుల జనశ్రేణుల్ని ఓ చోటకు చేర్చి అందర్నీ ఆనంద డోలికల్లో ముంచగల సామర్ధ్యం నాటకానికే ఉంది. నాటక కళ సహకార సమన్విత దృశ్య సమాహారం. ఒక సమస్యను కవిత్వం ముందుగా ఆవిష్కరించినా పరిష్కారాన్ని సూచించడంలో ‘నాటకం’ ముందుంటుంది అంటారు. తెలుగు పల్లెలోని ఓ పశువుల కాపరితో పద్యం పాడించేట్లు చేయగలిగింది పౌరాణిక నాటకమైతే.. తాను, తన పూర్వీకులు పశువులు కాస్తూనే ఎందుకు బతకాల్సొచ్చిందోనని ఆలోచింపజేసేది ఆధునిక (సాంఘిక) నాటకం. ఆధునిక తెలుగు నాటకరంగ ఆద్యుల్లో.. సాంస్కృతిక పునరుజ్జీవన రథసారథులు గురజాడ, కందుకూరి, పానుగంటి, చిలకమర్తి, కాళ్లకూరి సహా ఎందరెందరో సంస్కరణవాదుల్లో ప్రముఖంగా ఎన్నదగిన కందుకూరి వీరేశలింగం జయంతి ఏప్రిల్ 16న తెలుగు రంగస్థల దినోత్సవంగా అధికారికంగా పరిగణిస్తున్నారు. తెలుగు నాటకరంగంలో ఎందరో నట దర్శక రత్నాలు విశిష్ట నాటకకర్తలు ఉన్నారు. మరింతగా కొనసాగుతున్న.. కొనసాగాల్సిన ఈ పరంపరలో.. ఇటీవలి కాలపు ముఖ్యుల్లో కావూరి సత్యనారాయణ ఒకరు.
సాధారణంగా.. ఉత్తమ నటులైతే రచయితలుగానూ దర్శకులుగానూ ఆల్రౌండర్లుగానూ మరింతగా రాణిస్తారని నాటకరంగ సీనియర్లంటారు. కావూరి వందలాది ప్రదర్శనలిచ్చిన ఓ ఉత్తమ శ్రేణి నటులు. అనేక నాటికలకు పరిణతి స్థాయిలో దర్శకత్వం నెరిపిన కళాకారులు. కనీసం పాతిక నాటికలు, ఓ ఐదు నాటకాల రచయిత. నాటక రంగానికి సంబంధించి ఈ ప్రధాన మూడు విభాగాల్లోనూ అనేక బహుమతులు సాధించిన ఉన్నత స్థాయి ప్రయోక్త. ఉత్తమ నటుడిగా, దర్శకుడిగా వ్యక్తిగత బహుమతులతో పాటు తన సారథ్యంలో ఉత్తమ ప్రదర్శన బహుమతులు ఎన్నో అందుకున్నారు. ఏడు పదులు దాటిన వయసులోనూ ఓ విజయవంత సమాజ నిర్వాహకులు. నాటకారంగానికి దాదాపు ఐదు దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్నందుకు గానూ మొన్న ఉగాది పండుగ నాడు రాష్ట్ర ప్రభుత్వం కావూరిని ‘కళారత్న’ హంస అవార్డు (రూ. 50 వేల నగదు, దుశ్శాలువా, జ్ఞాపిక)తో సత్కరించింది. వాస్తవానికి ఈ రంగంలో ఆయన పొందిన సత్కారాలూ సన్మానాలూ అవార్డులూ రివార్డుల సంఖ్య తక్కువేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కందుకూరి అవార్డును ఇదివరకే అందించి సన్మానించింది. కెఎల్ యూనివర్సిటీ ‘సీఎస్సార్ అవార్డు’తో, యువ కళా వాహిని (హైదరాబాద్) ‘అక్కినేని గోల్డ్ మెడల్’తో, ‘గురజాడ అవార్డు’తో సత్కరించాయి.
డిగ్రీ చదివే రోజుల్లో ‘కుబుసం వీడింది’ నాటిక తొలిసారిగా ప్రదర్శించి మంచి గుర్తింపు రావడంతో ఈ రంగంపై ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. బలమైన కాంక్షతో, తగిన కృషితో క్రమక్రమంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. 1952లో జన్మించిన కావూరి బి.కామ్ డిగ్రీ అనంతరం సంగం డెయిరీలో ఉద్యోగిగా చేరారు. అక్కడే కొంతమంది మిత్రులను కూడగట్టి ‘సంగం డెయిరీ క్రియేషన్స్’ పేరుతో నాటకాలు ఆడారు. పోటీలకు వెళ్లారు. ఇతర సమాజాల్లోనూ కావూరి పాల్గొనేవారు. సమాజంలోని వివిధ రుగ్మతల్ని గర్హిస్తూ, అవకతవకల్ని నిరసిస్తూ, సామాజిక అభ్యుదయం కోసమే ప్రజా చైతన్యానికే నాటకాలు ఆడుతుంటానంటారు కావూరి.
ఈ కృషిలో భాగంగా- ఎం.సెట్ ప్రశ్నపత్రాల లీకేజ్ నేపథ్యంతో తన ‘శ్వేతపత్రం’ నాటిక సంచలనం సృష్టించింది. విజయవాడలో ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నరికి చంపిన దారుణ (ఈవ్ టీజింగ్) ఉదంతంపై రాసిన ‘రివర్స్ మార్చ్’ విశేషంగా ఆకట్టుకుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికుడికి నీరాజనాలర్పిస్తూ రాసిన ‘రావణ కాష్టం’ నాటిక బంగారు నంది అవార్డు సాధించింది. ఇప్పుడు ఆయన ‘చిగురు మేఘం’ నాటిక పరిషత్తుల్లో విజయ ఢంకా మోగిస్తోంది. జబ్బునపడ్డ గ్రామీణ భారతానికి వైద్య రంగం తరలాల్సిన అవశ్యకతను విశదీకరిస్తుంది ఈ నాటిక. దుర్వ్యసనాలకు బానిసై, సమాజానికి చేటుగా మారిన కొడుకును పోలీసులకు పట్టించిన తండ్రి కథ ఇతివృత్తంగా ‘ముఖచిత్రం’ (నాటిక), వ్యక్తిగత స్వార్ధ, అవసరాలకు ఎవరినైనా వాడుకోవాలనుకునే యువతి భంగపాటు ఇతివృత్తంగా ‘జారుడుమెట్లు’ (నాటిక), నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బినామీ పేర్లతో కొల్లగొట్టిన రూ.కోట్లను- అధికారం కోల్పోయాక సీబీఐ పట్టుకోవడం ఇతి వృత్తంగా ‘పతాక శీర్షిక’ (నాటకం), భార్యాభర్తల అనుబంధానికి.. వృద్ధాప్యంలో ఒకరు పోతే రెండో వారి అవస్థలకు అక్షర రూపమిచ్చిన ‘ఐదు పదులు’ (నాటిక), వ్యసనపరుడైన భర్తతో నిత్యం నరకం అనుభవిస్తున్న చెల్లి దంపతుల్ని ఇంట్లో పెట్టుకుని.. అంతిమంగా ఆ కుటుంబాన్ని కాపాడిన అన్న కథ ఇతివృత్తంగా ‘అమత హస్తం’ (నాటిక), ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు పట్టించుకోని నేపథ్యంలో మనవడిని బాగుచేసే ఇతివృత్తంతో సాగే ‘మరో సిద్ధార్థుడు’ (నాటిక) కావూరి రచనల్లో కొన్ని. ఆయన రాసిన నాటికలు, నాటకాలను ఇతర సమాజాలు ప్రదర్శించి బహుమతుల్ని కొల్లగొట్టిన ఉదాహరణలూ ఎన్నో.
యాసిడ్ దాడిలో గాయపడి, కోలుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి దోషుల్ని శిక్షింపజేసిన సాహస యువతి కథ ఇతివృత్తంగా సాగిన ‘దగ్ధ దృశ్యం’ (నాటకం) గంగోత్రి సాయి బృందం ఐదు నందుల్ని సాధించింది. కావూరి చేయి తిరిగిన రచయితే కాదు.. తలపండిన.. పండిత, పామరుల్ని మెప్పించిన నటుడు.. ముఖ్యంగా సామాజిక హితాన్నీ జన జాగృతినీ బలంగా కాంక్షించిన కమిటెడ్ కళాకారుడు. అందుకే ఆయన ప్రదర్శనలు అంత విజయవంతమవుతున్నాయి.
జనంలోంచే.. : – కావూరి సత్యనారాయణ, నాటక రచయిత.
నా రచనలకు సబ్జెక్టులన్నీ జనంలోంచే ఏరుకుంటాను. సామాజిక అంశాలను అధ్యయనం చేసి రచనకు పూనుకుంటా. నాటకం సామాజిక చైతన్యానికి దోహదపదాలని నా భావన.
– జి.వి.రంగారెడ్డి,
సీనియర్ జర్నలిస్ట్, 99126 15747.