కనువిందుగా ‘పుత్తరి’ ఉత్సవం

Jan 12,2024 10:37 #feature

ఎటుచూసినా పచ్చటి పైర్లు..చెట్లూ చేమలు.. ఆహ్లాదాన్ని పెంపొందించే కొండలు, కోనలు… జలపాతాలు.. సంప్రదాయాలతో ముడిపడిన సంస్కృతీ వారసత్వం. ఇదీ కర్నాటక కొడవాలు నివసించే ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం. ఏటేటా పంటలు చేతికి వచ్చే సమయంలో ఇక్కడి ప్రజానీకం కైల్పోద్‌, పుత్తరి పండుగలను వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు.

          కాలం మారినా..జీవన శైలిలో మార్పులొచ్చినా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పండుగలను సమిష్టితత్వంతో జరుపుకుంటారు. ఇలాంటిదే కర్నాటకలో కొడగు జిల్లాలో కొడగు తెగకు చెందిన కొడవాలు (నిప్పులు కురిపించేవారు, నైపుణ్యం గల వ్యక్తుల సమూహం)గా పిలుస్తుంటారు. యోధుల తెగగా కూడా ఇతర ప్రాంతాల వారు పిలుస్తుంటారు. వీరు తమ పూర్వీకుల ఆయుధాలను భావి తరాలకు భద్రపర్చి అందజేయటం ఆనవాయితీ. యువతరాలకు యుద్ధకళ నేర్పటంతోపాటుగా ఆయా సంప్రదాయాల సజీవంగా అందజేయటానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. నిరంతరం ప్రకృతిలో మమేకమై జీవించే ఈ ప్రజానీకం అటవీ ఉత్పత్తులు, పొలాల నుంచి వచ్చే పంటలను తమ జీవనంలో భాగం చేసుకుంటుంటారు. సహజ ప్రకృతి సౌందర్యంతో నిత్యం పొగమంచుతో కూడిన గంభీరమైన పర్వతశ్రేణులకు దగ్గరలో నివశించే ప్రజలే వీరు. అంతరించిపోతున్న ద్రావిడ భాషల్లోని కొడగు వీరి భాష. కొడగు భాష మాట్లాడే వారిలో మరో 14 తెగలకు చెందిన వారున్నారు. గిరిజన ప్రాంతాల మాదిరి స్వయం ప్రతిపత్తి పొందిన ప్రాంతాల్లో నివశించే ఈ కొడవాలు ప్రజానీకం జీవనం వైవిధ్యంగా ఉంటుంది. కల్లా కపటం లేని జీవనం, పరస్పరం సాయం చేసుకునే మనస్తత్వం, ఐక్యతాభావం అణువణువునా తొణికిసలాడేలా హాస్య సరస వరసలతో పల్లెలంతా ఒక్క కుటుంబంగా కనబడుతుంటాయి. చక్కని సహజ ధోరణిలో పల్లెపాటలు, మాటలు, సంప్రదాయాలు వీరి జీవనంలో ప్రస్ఫుటమవుతుంటాయి.

ఏటేటా పండుగ సందర్భంగా జానపద నృత్యాలు, క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో జంతువుల వేటను క్రీడగా పెద్దలు భావించేవారు. తరాల్లో మార్పులు రావటంతో ఇప్పుడు షూటింగ్‌ స్కిల్స్‌, ఫిజికల్‌ స్పోర్ట్స్‌ మొదలైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వేడుకలన్నీ గ్రామాల్లోని మందిరాలు (ముండ్‌)’ లేదా బహిరంగ మైదానాల్లో వైభవపేతంగా జరుపుతుంటారు.

హ్యాపీ కైల్పోద్‌ జరిగేదిలా..

కైల్‌ అంటే ఆయుధం, పోద్‌ అంటే పండుగ. కైల్పోద్‌ పండుగను ఆయుధాల పండుగగా చేసుకుంటారు. పంట పొలాలు దున్నటం, విత్తడం, వరినాట్లు వేయటం వంటి వ్యవసాయ పనుల్లో కష్టపడిన వారంతా దానిని మర్చిపోవటానికి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఏటేటా సెప్టెంబర్‌ 3న దీనిని జరుపుకుంటారు. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించిన 18వ రోజున ఇది ప్రారంభమవుతుంది. పండుగ అంతా పంటల మార్పిడి పూర్తికావటం, దాని వెనుక ఉన్న కృషిని అనుసరించే వేడుక. కదంబుట్టు, వోటి, పాపుట్‌ సాదా కేకులు, సూపుట్‌ నూడుల్స్‌ లాంటి ఉడికించిన పిండి బంతులు, పాండి (పందిమాంసం), కోలి (చికెన్‌), యెర్చి (మటన్‌)కూర, డెజర్ట్‌లు వంటి మాంసం వంటకాలతోపాటుగా అక్కి పాయస (అన్నం ఖీర్‌) వంటివి కూడా ప్రతి ఇంటా వండుకుని ఆరగిస్తుంటారు. పూర్వీకుల సమ్మేళనాల్లో వారి ఫొటోలకు పూజలు చేస్తుంటారు.

ప్రత్యేక దుస్తులతో ఆకట్టుకునే తత్వం

తెల్లవారుజామునే కొడవాలు గ్రీకు సైన్యం (టోగా) మాదిరి దుస్తులతో అడవిపందులను వేటాడేందుకు లోడ్‌చేసిన రైఫిళ్లు(తుపాకి)తో వెళ్తారు. జంతువులను వేటాడి తెచ్చి వంటలు చేస్తారు. వివాహ వేడుకల్లోనూ, ఇతర శుభకార్యాల్లోనూ మద్యపానం, రుచికరమైన ఆహారంతో కూడిన భోజనాలుంటాయి. బృంద నృత్యాలు, వీనుల విందైన వాయిద్యాలు, అందరూ ఉమ్మడి నృత్యాలు, విచిత్రమైన హావభావాలతో సంగీత కచేరీలు హోరెత్తుతాయి. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా స్త్రీలు, పురుషులు ఆయా జానపదాల్లో లీనమై సంగీతానికి అనుగుణమైన డ్యాన్సులు, నృత్యాలతో జత కలుస్తుంటారు.

కొత్త పంటల పండుగే ‘పుత్తరి’

కొడవాలు మాత్రమే చేసుకునే పండుగ పుత్తారి (కొత్త వరి పంట). కొడగుల్లో నవంబర్‌-డిసెంబర్‌ నెలల్లో వరి కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు దీనిని జరుపుకుంటారు. చేతికి వచ్చిన వరి పంటను కుటుంబ పెద్ద కోయటం ఆనవాయితీగా వస్తోంది. ఓ పౌర్ణమి రాత్రిలో ‘పోలి..పోలి..దేవా’ (ఓ దేవా..మాకు సమృద్ధిగా పంటలు ఇవ్వండి) అనే కీర్తనలతో వరి కోతలు ప్రారంభిస్తారు. వారు కొలిచే ప్రధాన దేవతైన ఇగుతప్పను పిలవటానికి సూచికంగా ఆకాశంలో తుపాకి తూటా ఒక్క షాట్‌ను పేలుస్తారు. ఆ తర్వాత అందరూ కోతలు ప్రారంభిస్తారు. చేతికొచ్చిన పంటలతో పిండి వంటలు, తినుబండారాలు చేసి తమ ఇష్ట దైవాలకు పూజలతో సమర్పిస్తారు. వ్యవసాయంలో భాగమైన జంతువులను ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రభలను రంగురంగులుగా అలంకరించి ఊరేగింపులు చేస్తారు. పండుగ సమయాల్లో ప్రజలంతా ఆటపాటల్లో విరివిగా పాల్గొంటారు. శక్తివంతమైన సంస్కృతిని ప్రతిబింబించటానికి తమ వంతుగా కృషిచేస్తారు. ‘పుత్తరి కోలాట్‌’ పంట పండిన వెంటనే నిర్వహించబడే జానపద నత్యం. వరి కోసిన తర్వాత, ప్రతి గ్రామంలో పుత్తరి కోలాట్‌ లేదా పుత్తరి మంద్‌ నమ్మే నిర్వహిస్తుంటారు. రంగురంగుల పొట్టి కర్రలతో కోలాటం నిర్వహిస్తారు, పుత్తరి కోలాటాన్ని నిర్వహించడానికి పొడవాటి కర్రలను ఉపయోగిస్తారు. సంప్రదాయ డప్పుల శబ్దం, లయబద్ధమైన ధ్వనులకు అనుగుణంగా స్త్రీలు, పురుషులు నృత్యాలు చేయటం సంప్రదాయ కళలో భాగంగా భావిస్తారు. ఐక్యంగా సహపంక్తి భోజనాలు చేస్తుంటారు.

యుద్ధక్రీడలు

కత్తి, డాలుతో ఇద్దరు వ్యక్తులు పొడవాటి కర్రలు పట్టుకుని యుద్ధ క్రీడల్లో మాదిరిగా చేసే సాహసాలను ‘పారేకలి’గా పిలుస్తుంటారు. యుద్ధకళను తలపించేలా ఈ సంస్కృతికి సంరక్షకుడిగా మాంధ్‌ను పేర్కొంటారు. జిల్లాస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఆయా తెగకు చెందిన పెద్దలు ఉంటారు. వారు తీర్పులకు ఆయా ప్రాంత ప్రజలు కట్టుబడి ఉంటారు.

ప్రాముఖ్యత కోల్పోతున్నారు

ప్రపంచీకరణ ప్రభావం, పాలకుల విధానాలకుతోడుగా కొందరు అక్రమార్కులు ఇలాంటి ప్రాంతాలపై కేంద్రీకరించటంతో వారు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నారు. గతంలో 240 కొడగు ప్రాంతాలుండగా నేడు 80 వరకూ తగ్గాయి. అయినప్పటికే అనేకమందితో కూడిన బృందాలు, కొడవు సమాజాలు, ఇతర సంస్థలు వాటిని పునరుద్ధరించే కృషిని కొనసాగిస్తున్నాయి.

➡️