గాలిపటం

Jan 12,2025 03:31 #feachers, #jeevana, #katha, #Kite

రామాపురంలో రామ్‌, లక్ష్మణ్‌ అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. బడికి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఇంటికి వెళ్లేటప్పుడు రఘురంజన్‌ మాస్టారు సెలవుల్లో శ్రద్ధగా చదువుకోవాలని, ఎత్తైన ప్రదేశాలు, ఇళ్ళపై గాలి పటాలు ఎగురవేయకూడదని, మైదాన ప్రాంతాల్లో మాత్రమే ఎగురవేయాలని జాగ్రత్తలు చెప్పారు. పిల్లలందరూ సంతోషంతో ఇంటికి వెళ్లారు.
సెలవుల్లో పిల్లలు గాలిపటాలు తయారు చేస్తూ ఎగరేస్తున్నారు. లక్ష్మణ్‌ మేడ మీద గాలిపటం ఎగురవేస్తున్నాడు. అప్పుడు రామ్‌కి మాస్టారు చెప్పింది గుర్తొచ్చింది. లక్ష్మణ్‌కి ప్రమాదం వస్తుందని గ్రహించి ‘అరే లక్ష్మణ్‌, మేడపై గాలిపటం ఎగరవేయొద్దు. అలా చేస్తే గాయపడతాము’ అని మాస్టారు చెప్పారు కదా! వెంటనే పైనుండి దిగు’ అని జాగ్రత్త చెప్పాడు. రామ్‌ మాటలు లక్ష్మణ్‌ పట్టించుకోలేదు. ‘గాలిపటం ఇక్కడి నుండి ఎగరేస్తేనే బాగా పైకి ఎగురుతుంది. నీకు తెలియదు. ఒకసారి పైకి వచ్చి నువ్వే చూడు’ అంటూ రామ్‌నే పైకి రమ్మన్నాడు.
‘నేను రాను. మా ఇంటి దగ్గర మైదానంలో గాలి పటం ఎగరవేసుకుంటాను’ అని రామ్‌ ఇంటికి వెళ్లిపోయాడు. లక్ష్మణ్‌ గాలి పటం ఎగరవేస్తూ మెల్లమెల్లగా వెనక్కి నడుస్తూ మేడ పైనుంచి జారి పడ్డాడు. పెద్ద ప్రమాదం జరగకపోయినా ఆస్పత్రిలో చేరాల్సివచ్చింది. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నాడు. అప్పుడు రామ్‌ ‘చూసావా లక్ష్మణ్‌ నేనెంత చెప్పినా నువ్వు వినలేదు. మాస్టారు చెప్పినట్టు వినుంటే నువ్వు ఆసుపత్రిలో ఉండేవాడివి కాదు కదా!’ అన్నాడు. ఆ మాటలను అంగీకరిస్తూ లక్ష్మణ్‌, ‘నిజమేరా, మాస్టార్లు మన మేలు కోసమే చెబుతారు. ఇంకెప్పుడూ నేను పెద్దల మాటలు పెడచెవిన పెట్టను’ అన్నాడు.

– బి.విశ్వ తేజ,6వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,
అనంత సాగర్‌, సిద్దిపేట జిల్లా.

➡️