కొయ్యకూరకు సిగ్గులేదు

Jan 9,2025 03:24 #feachers, #Koyyakuraku, #sigguledu

‘అమ్మా జడ వెయ్యవా!’ అడిగింది మమత. ‘ఏడో తరగతికి వస్తున్నావు. ఇంకా ఎప్పుడు జడ వేసుకోవడం నేర్చుకుంటావు?’ తిడుతూనే జడ వేసింది అమ్మ. ‘కొయ్యకూరకి సిగ్గు లేదు, కొడవలికి సిగ్గు లేదు, అన్నట్లుంది మీ పద్ధతి. నువ్వు తిట్టడం మానవు. అది అడగడం మానదు’ అంది బామ్మ.
‘బామ్మా! కొయ్య కూర అంటే ఏంటి? చిలక్కొయ్య? మంచం కొయ్య?” అడిగింది మమత. ‘కొయ్యకూర అంటే కొయ్య తోటకూర. మొక్క పొడుగ్గా, ఎత్తుగా పెరుగుతుంది. చేతితో తుంచలేం. కాడ గట్టిగా ఉండి, కొడవలితో కోస్తారు. ఎన్ని సార్లు కోసినా త్వరగా పెరుగుతూనే ఉంటుంది’ చెప్పింది బామ్మ.
‘పూర్వం అంగరాజ్యంలో శంకరవ్వ అనే పూటకూళ్లవ్వ నివసిస్తూ ఉండేది. నిత్యం యాత్రికు లతో శంకరవ్వ ఇల్లు సందడిగా ఉండేది. ఆమె కొయ్యకూర మెంతి పులుసు గొప్ప రుచికరంగా చేసేది. ఇంటి పరిసరాల్లో దొరికే ఆకుకూరలు, కాయగూరలతో పులుసు, కూర, పప్పు, పచ్చడి చేసేది. ఎంతో రుచికరంగా ఉండడంతో అందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్లేవారు. కొయ్యకూరను కొడవలితో కోసి, వండి పెట్టేది. ఇలా కొంతకాలం గడిచింది. ఓసారి కొడవలి పట్టుకుని శంకరవ్వ పెరట్లోకి వెళ్ళింది. అక్కడున్న కొయ్య కూరను కోయబోతూ ఉంటే ‘అవ్వా నన్ను ఎదగనివ్వవా? మొన్ననే కదా కోసావు’ అని అడిగింది కొయ్య కూర. ఆ మాటలకు ఆశ్చర్యపోయింది అవ్వ.
‘నువ్వు నిట్రాటలా తొందరగా పెరిగేస్తున్నావు. పదిమంది ఆకలి తీరుస్తున్నావు. అయినా కోసే కొడవలికి సిగ్గులేదు. ‘ఎన్నిసార్లు కొయ్యాలని’ అది ఎప్పుడూ అనుకోదు. నీకూ అంతకంటే సిగ్గు లేదు. కోసే కొద్దీ పెరుగుతున్నావు. అవతల భోజనాల వేళ అవుతోంది. నాకు అడ్డుపడకు’ అంది శంకరవ్వ.
అప్పటి నుంచి ‘కొయ్యకూరకు సిగ్గులేదు, కొడవలికి సిగ్గులేదు’ అనే సామెత పుట్టింది. నిత్యం ఒకరినొకరు తిట్టుకున్నప్పటికీ కలసి ఉండేవాళ్లని చూసినప్పుడు ఈ సామెత వాడుతారు’ అని చెప్పింది బామ్మ.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️